పాతికేళ్ల జలయుద్ధానికి తెర: బిహార్, జార్ఖండ్‌ల కీలక ఒప్పందం! | Historic Breakthrough Bihar and Jharkhand Settle 25 Year Old Sone River Water Dispute | Sakshi
Sakshi News home page

పాతికేళ్ల జలయుద్ధానికి తెర: బిహార్, జార్ఖండ్‌ల కీలక ఒప్పందం!

Sep 3 2026 7:34 AM | Updated on Sep 3 2026 7:57 AM

Historic Breakthrough Bihar and Jharkhand Settle 25 Year Old Sone River Water Dispute

రెండున్నర దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేసిన జల వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల మధ్య సోన్ నది నీటి పంపకాలపై గత 25 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం ఢిల్లీ వేదికగా ముగిసింది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర అవగాహన ఒప్పందం కుదిరింది. రెండు రాష్ట్రాల అన్నదాతల భవితవ్యాన్ని మార్చే ఈ కీలక ఒప్పందం ప్రాజెక్టుల శకానికి కొత్త నాంది పలికింది.

25 ఏళ్ల పగ ముగిసింది: ఢిల్లీలో చారిత్రక ఘట్టం
సోన్ నది నీటి పంపకాలపై పాతికేళ్లుగా నెలకొన్న ప్రతిష్టంభనకు దేశ రాజధానిలో తెరపడింది. ఈ తాజా చారిత్రక ఒప్పందం ప్రకారం మొత్తం కేటాయింపుల్లో బిహార్‌కు 5.75 మిలియన్ ఎకరాల అడుగుల ( ఎంఏఎఫ్‌) నీరు, జార్ఖండ్‌కు 2 ఎంఏఎప్‌ నీటిని కేటాయించారు. ఈ కీలక నిర్ణయంతో ఇరు రాష్ట్రాల్లోని కరువు పీడిత ప్రాంతాలలో దశాబ్దాలుగా మూలనపడిన సాగునీరు, రిజర్వాయర్ నిర్మాణాలు, నదుల అనుసంధాన ప్రాజెక్టులు శరవేగంగా పట్టాలెక్కనున్నాయి.

విభజన తెచ్చిన చిచ్చు: వివాదం పుట్టిందిక్కడే!
ఈ వివాదానికి మూలాలు నవంబర్ 2000 నాటి ఉమ్మడి బిహార్ విభజనలో ఉన్నాయి. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో సోన్ నది ప్రధాన ఎగువ పరివాహక ప్రాంతం, దాని ఉపనదులు జార్ఖండ్‌ పరిధిలోకి వెళ్లిపోయాయి. దిగువ మైదాన ప్రాంతాల్లోని సారవంతమైన వ్యవసాయ భూములు బిహార్‌లో ఉండిపోయాయి. నది పుట్టుక ఒకచోట, వ్యవసాయ క్షేత్రాలు మరోచోట కావడంతో సహజంగానే నీటి నియంత్రణ, వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

1973 బాణ్‌సాగర్ లింక్: 7.75 ఎంఏఎఫ్ వివాదం
ఈ సంక్షోభం వెనుక 1973 నాటి బాణ్‌సాగర్ ఒప్పందం కీలక పాత్ర పోషించింది. నాటి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉమ్మడి బిహార్ మధ్య జరిగిన ఆ త్రైపాక్షిక ఒప్పందంలో ఉమ్మడి బిహార్‌కు మొత్తం 7.75 ఎంఏఎఫ్‌ నీటిని కేటాయించారు. అయితే 2000లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ 7.75 ఎంఏఎఫ్‌ నీటిని బిహార్, జార్ఖండ్‌లు ఎలా పంచుకోవాలనే దానిపై ఎలాంటి స్పష్టమైన చట్టబద్ధ నిబంధనలు రూపొందించలేదు. దాంతో రెండు దశాబ్దాలుగా అనేక కమిటీలు ప్రయత్నించినా రిజర్వాయర్ ఎత్తు, గ్రామాలు మునిగిపోతాయన్న భయాల నడుమ పంచాయితీ కొలిక్కి రాలేదు.

ఇంద్రపురి బ్యారేజ్: సీన్ మొత్తం మారింది!
ఈ తాజా ఒప్పందంతో రోహ్‌తాస్ జిల్లాలోని దేహ్రీ-ఆన్-సోన్‌కు సమీపంలో ఉన్న ప్రసిద్ధ ఇంద్రపురి బ్యారేజ్ పూర్తిస్థాయి నిర్వహణకు మార్గం సుగమమైంది. జార్ఖండ్‌లోని గఢ్వా, పలాము జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ బ్యారేజీ.. బిహార్‌లోని షాహాబాద్ వ్యవసాయ ప్రాంతానికి ప్రధాన జీవనాధారం. తాజా ఒప్పందంతో బిహార్‌కు సాగు కోసం అదనపు నీరు లభించడమే కాకుండా, జార్ఖండ్ భూములు ముంపునకు గురికాకుండా రిజర్వాయర్ నీటిమట్టాన్ని పరిమిత స్థాయిలో ఉంచేందుకు, అవసరమైన పునరావాసం కల్పించేందుకు స్పష్టమైన నియమావళి ఖరారైంది.

రాజకీయ ప్రకంపనలు: ఇరు రాష్ట్రాల్లో దశాబ్దాల సెగ
గత పాతికేళ్లలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య నేరుగా యుద్ధ వాతావరణం కనిపించకపోయినా, ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ సోన్ నది అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఖరీఫ్ సీజన్‌లో కాలువలకు నీరు రాకపోతే బిహార్ నాయకులు సర్కారుపై విరుచుకుపడేవారు. మరోవైపు ఇంద్రపురి డ్యామ్ ఎత్తు పెంచితే తమ భూములు మునిగిపోతాయని, ప్రజలు నిరాశ్రయులవుతారని జార్ఖండ్ నేతలు అడ్డుకున్నారు. వేర్వేరు పార్టీల సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉండటంతో పరస్పర నిందారోపణల నడుమ ఈ సమస్య దశాబ్దాల పాటు నలిగిపోయింది.

రంగంలోకి కేంద్ర జల సంఘం: చివరకు పరిష్కారం!
ఈ సుదీర్ఘ ప్రతిష్టంభనను ఛేదించడంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కీలక దౌత్యం నడిపింది. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా సాంకేతిక అధ్యయనాలు, హైడ్రాలజీ సర్వేలు జరిపి డ్యామ్ ఎత్తుపై ఆమోదయోగ్యమైన మార్పులను ప్రతిపాదించింది. జల్‌శక్తి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ ఫైలును ఓ కొలిక్కి తెచ్చారు. ఫలితంగా జార్ఖండ్‌లోని పలాము, గఢ్వా జిల్లాల దాహం తీరడంతో పాటు బిహార్‌లోని రోహ్‌తాస్, భోజ్‌పూర్, ఔరంగాబాద్ పొలాలకు పుష్కలంగా సాగునీరు అందనుంది.

ఇది కూడా చదవండి: రాజస్థాన్‌ అంటే జైపూర్‌, ఉదయ్‌పూర్‌ కాదు.. మరి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement