11 ఏళ్ల వేరు కాపురం.. విడాకులు మంజూరు! | Living apart for 11 years, Sci granted Divorce | Sakshi
Sakshi News home page

11 ఏళ్ల వేరు కాపురం.. విడాకులు మంజూరు!

Sep 3 2026 6:27 AM | Updated on Sep 3 2026 6:27 AM

Living apart for 11 years, Sci granted Divorce

 మధ్యప్రదేశ్‌ దంపతుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు

రూ.ఏడు లక్షల శాశ్వత భరణం మంజూరు

న్యూఢిల్లీ: పెళ్లి తరువాత గొడవల కారణంగా వేర్వేరుగా ఉంటున్న దంపతులకు సుప్రీంకోర్టు బుధవారం విడాకులు మంజూరు చేసింది. 2005 డిసెంబరు నుంచి వీరు విడిగా ఉంటున్నారని, మహిళ వైవాహిక సంబంధాన్ని వదిలేసుకుందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ శ్రీ చంద్రశేఖర్‌ ప్రకటిస్తూ ఆమెకు శాశ్వత భరణంగా ఏడు లక్షల రూపాయలు చెల్లించాలని భర్తను ఆదేశించారు. 

వీలైనంత వరకూ వివాహాన్ని కాపాడేందుకు ప్రయత్నించాలని చట్టం చెబుతున్నప్పటికీ దీర్ఘకాలం దూరంగా ఉంటున్నారు కాబట్టి వాస్తవిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరముందని బెంచ్‌ వ్యాఖ్యానించింది. దీర్ఘకాలం వేరుగా ఉండటం వారి మధ్య వైవాహిక బంధం పునరుద్ధరణకు వీలు కానంత బలహీనమైందా? అన్న విషయాన్ని నిర్ణయించేందుకూ ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఒక తీర్పును కూడా బెంచ్‌ ప్రస్తావించింది. కేసు వివరాలు...

మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. భార్య తనను వదిలిపెట్టడం, క్రూరత్వాన్ని ప్రదర్శించడాన్ని ఆ వ్యక్తి రుజువు చేయలేకపోయాడని హైకోర్టు స్పష్టం చేస్తూ విడాకులు నిరాకరించింది. వీరిద్దరికీ 2003లో వివాహం కాగా.. విద్యార్హతల్లేవని భార్య భర్తను వదిలేసిందని, నిరక్షరాస్యుడని, మొరటోడని అవమానించిందని ఆ వ్యక్తి తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. 

భార్య 2005 నవంబరు నెలలో పుట్టింటికి వెళ్లిపోయిందని, కాపురానికి రమ్మన్నా రాకపోవడం వల్ల తనకు విడాకులివ్వాలని ఆ వ్యక్తి 2007 జూన్‌లో కేసు వేశాడు. మనస్పర్దల కారణంగా దంపతులు ఇద్దరూ 2005 డిసెంబరు నుంచి కలిసి ఉండటం లేదని ట్రయల్‌ కోర్టు విచారణలో వెలుగు చూసిన విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది.

 ‘‘మా దృష్టిలో ఈ కేసులో భార్యకు భర్తను వదిలేయాలన్న ఉద్దేశం లేదని హైకోర్టు అర్థం చేసుకోవడం సరికాదు’’ అని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. భార్యకు కాపురానికి తెచ్చుకునేందుకు భర్త అత్తారింటికి వెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయని, కానీ సరైన కారణం చూపకుండా ఆమె భర్తతో వచ్చేందుకు నిరాకరించిందని తెలిపింది. వివాహం కారణంగా వీరికి సంతానమేదీ లేని విషయాన్ని, సంబంధాన్ని పునరుద్ధరించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడాన్ని పరిగణలోకి తీసుకుని ఇద్దరికీ విడాకులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement