నాలుగు నెలల కవల పిల్లల్ని బకెట్లో ముంచి హత్య
బెంగళూరులో దారుణం
దొడ్డబళ్లాపురం: సిలికాన్ సిటీగా పేరొందిన బెంగళూరులో ఘోర విషాదం సంభవించింది. లేకలేక పుట్టిన కవల పిల్లలను తల్లే నీటి బకెట్లో ముంచి హతమార్చింది. తలఘట్టపురలో ఈ దారుణం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఉమాదేవి (42), రామలింగప్ప (50) దంపతులకు 2002లో వివాహమైంది. రామలింగప్ప వ్యాపారం చేస్తుండగా, ఉమాదేవి గృహిణి. వీరికి పిల్లలు పుట్టకపోవడంతో అనేక ప్రయత్నాల తరువాత ఐవీఎఫ్ చికిత్స ద్వారా ఉమాదేవి గర్భం దాల్చింది. మే 5న ఒకే కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు.
అయితే, పిల్లలు పుట్టాక ఉమాదేవి మానసిక అనారోగ్యం బారిన పడింది. పిల్లలను పోషించడంలో కూడా తీవ్ర ఇబ్బందులు పడసాగింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం శిశువులను నీళ్లున్న బకెట్లో ముంచి ప్రాణాలు తీసింది. తరువాత వారిని ఊయలలో ఉంచింది. ఆపై ఆత్మహత్యాయత్నం చేస్తుండగా.. అదే సమయంలో ఇంటికొచి్చన భర్త రామలింగప్ప ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించాడు. ప్రసవం తరువాత వచ్చే మానసిక వైకల్యానికి తన భార్య గురైందని, నిమ్హాన్స్ వైద్యులతో చికిత్స చేయిస్తున్నట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో భర్త రామలింగప్ప తెలిపారు. తాను పిల్లలను చూసుకోలేనని, అనాథాశ్రమంలో ఇచ్చేయాలని ఆమె గొడవ చేసేదని చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది.


