బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోనే అత్యధిక ట్రాఫిక్ జామ్ కలిగిన నగరంగా ఈ సిటీకి పేరు. ఈ నేపథ్యంలోనే నగర ట్రాఫిక్ సమస్యలను పౌరులకు తెలియజేయడాని అక్కడి ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో ఎదురయ్యే సవాళ్లు తదితర సమస్యలు తెలుసుకోవడానికి ‘కాప్ ఫర్ ది డే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దీని ద్వారా నగరవాసులు ఒక రోజు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో కలిసి పనిచేస్తూ, నగరంలో ట్రాఫిక్ నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసుల విధులు, బాధ్యతలను స్వయంగా అర్థం చేసుకోవడంతో పాటు, రహదారులను మరింత సురక్షితంగా, సాఫీగా మార్చేందుకు తమ సూచనలు అందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసుల దృష్టికోణంలో బెంగళూరు ట్రాఫిక్‌ను అనుభవించాలని, విధి నిర్వహణలో వారు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తమ అనుభవాలను, రహదారి భద్రతకు సంబంధించిన సూచనలను పోలీసులతో పంచుకోవచ్చని తెలిపారు.
బెంగళూరు సిటీ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తిక్ రెడ్డి, ఐపీఎస్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని గతంలో విజయవంతంగా నిర్వహించామని, ఇప్పుడు మరోసారి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పీక్ అవర్స్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించడం, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం వంటి విధుల్లో ట్రాఫిక్ సిబ్బంది ఎదుర్కొనే సవాళ్లను పౌరులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోవాలని ఆయన కోరారు.
ఎలా నమోదు చేసుకోవాలి ?
ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు ముందుగా BTP ASTraM యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకుని యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో కనిపించే “Traffic Cop for a Day” ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం అడిగిన వివరాలను నమోదు చేసి దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
రిజిస్ట్రేషన్ విజయవంతమైన తర్వాత, ఎంపికకు సంబంధించిన తదుపరి సమాచారాన్ని అనుసరించి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ పోలీసుల రోజువారీ విధులను దగ్గరగా తెలుసుకోవడంతో పాటు, బెంగళూరు ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారాలపై పౌరులు తమ అభిప్రాయాలను నేరుగా పోలీసు విభాగంతో పంచుకునే అవకాశం లభించనుంది.


