పాట్నా: బిహార్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 70వ బీపీఎస్సీ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు చేసిన నిరసన హింసాత్మకంగా మారింది. విద్యార్థులతంగా పెద్ద ఎత్తున నిరసన చేపడుతూ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి నివాసం వైపు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి ముందుకు సాగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు వాటర్ క్యానన్లను ప్రయోగించారు.
ప్రధానంగా 70వ బీపీఎస్సీ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆ పరీక్షను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పరీక్షల నిర్వహణలో స్పష్టత, నియామక ప్రక్రియలో పారదర్శకత, ఒకే పరీక్ష విధానం అమలు చేయాలని వారు కోరుతున్నారు. పాట్నాలోని గార్డనిబాగ్ ప్రాంతంలో కొంతకాలంగా ఈ అంశాలపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ రోజు (మంగళవారం) పట్నా,గాంధీ మైదాన్ నుంచి ఉదయం 10 గంటల ప్రాంతంలో విద్యార్థుల మార్చ్ ప్రారంభమైంది. పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ విద్యార్థులు ముఖ్యమంత్రి నివాసం వైపు కదిలారు. మార్గమధ్యంలో పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ, వాటిని దాటుకుని విద్యార్థులు ముందుకు వెళ్లడంతో పోలీసులతో ఘర్షణ చోటుచేసుకుంది.
సోమవారం విద్యార్థి ప్రతినిధులు బీహార్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. చర్చలు సానుకూలంగా సాగాయని విద్యార్థి నాయకులు చెప్పినప్పటికీ, తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరితో నేరుగా సమావేశం కావాలని వారు పట్టుబట్టారు. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకపోతే విద్యాశాఖ మంత్రితో మాట్లాడేందుకు సిద్ధమని, ఇతర అధికారులతో చర్చించబోమని స్పష్టం చేశారు.
విద్యార్థుల ఆందోళనకు భూసంబంధిత సమస్యలపై నిరసన చేస్తున్న రైతుల బృందం కూడా మద్దతుగా చేరింది. రైతులు నల్ల జెండాలతో నిరసనలో పాల్గొనడంతో భద్రతను మరింత పెంచి నిరసన ప్రదేశంలో సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు.ఇదిలా ఉండగా, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు బీహార్ ప్రభుత్వం ‘విద్యార్థి సహయోగ్ శివిర్’ పేరుతో నెలవారీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం సమ్రాట్ చౌదరి ప్రకటించారు.
ప్రతి నెల నాలుగో మంగళవారం విద్యా సంస్థల్లో ఈ శిబిరాలను నిర్వహించి విద్యార్థుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసి వాటి పరిష్కార స్థితిని తెలుసుకునే అవకాశం కూడా కల్పిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.


