రాఖీ సమీపిస్తున్న వేళ.. భారీగా కల్తీ రసగుల్లాలు స్వాధీనం! | Ghaziabad Food Safety Raid 1,000 kg Adulterated Rasgullas Seized Ahead of Raksha Bandhan | Sakshi
Sakshi News home page

రాఖీ సమీపిస్తున్న వేళ.. భారీగా కల్తీ రసగుల్లాలు స్వాధీనం!

Aug 25 2026 12:57 PM | Updated on Aug 25 2026 1:00 PM

Ghaziabad Food Safety Raid 1,000 kg Adulterated Rasgullas Seized Ahead of Raksha Bandhan

గజియాబాద్ (యూపీ): రాఖీ పండుగ సమీపిస్తున్న వేళ ఆహార కల్తీపై గజియాబాద్ ఆహార భద్రతా విభాగం అధికారులు ఉక్కుపాదం మోపారు. విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిహారీపురాలో ఉన్న ఒక గోదాముపై మెరుపు దాడులు నిర్వహించి, సుమారు 1,000 కిలోల కల్తీ  రసగుల్లాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ మిఠాయిలను తయారుచేసి నిల్వ ఉంచారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు.

కల్తీ పన్నీర్, పంచదారతో పాటు ‘సెఫోలైట్’ వంటి రసాయనాలను ఉపయోగించి ఈ రసగుల్లాలను తయారు చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి నాలుగు నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. స్వాధీనం చేసుకున్న 1,000 కిలోల రసగుల్లాల నిల్వలను ధ్వంసం చేసే ప్రక్రియను ప్రారంభించిన అధికారులు, సదరు గోదాము నిర్వాహకుడి లైసెన్స్‌ను రద్దు చేసేందుకు చర్యలు చేపట్టారు.
 

రక్షాబంధన్ వేళ మిఠాయిలకు భారీగా డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో, కల్తీని అరికట్టేందుకు అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే అంతకుముందు ఆగస్టు 14న గాజియాబాద్‌లోని పలు డెయిరీలపై ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) దాడులు నిర్వహించింది. ఆ సమయంలో 868 కిలోల పన్నీర్, 170 కిలోల కోవాను అక్కడికక్కడే అధికారులు ధ్వంసం చేశారు. ఆహార కల్తీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఎఫ్‌డీఏల సమన్వయంతో కఠిన నిఘా, చర్యలు కొనసాగుతున్నాయని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్ఎస్ఏఐ) తెలియజేసింది.

ఇది కూడా చదవండి: ‘కేరళ రీల్’.. పదేళ్ల తర్వాత కన్నవారి చెంతకు దివ్యాంగుడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement