Delhi: రెండో రోజూ భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ | Delhi Rain Alert Red Alert Issued as Heavy Downpour Paralyzes City for Second Day | Sakshi
Sakshi News home page

Delhi: రెండో రోజూ భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

Aug 25 2026 9:22 AM | Updated on Aug 25 2026 9:28 AM

Delhi Rain Alert Red Alert Issued as Heavy Downpour Paralyzes City for Second Day

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం రెండో రోజూ భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. రహదారులు జలమయమై, నడుము లోతు నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. రానున్న గంటల్లో వర్షం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది.

మంగళవారం ఉదయం 6:45 గంటల ప్రకటన ప్రకారం, రాబోయే రెండు నుంచి మూడు గంటల్లో ఢిల్లీ అంతటా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సెంట్రల్, ఈస్ట్, న్యూఢిల్లీ, నార్త్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, షహదరా, సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్ ఢిల్లీ జిల్లాలకు ఈ హెచ్చరికలు వర్తిస్తాయి. ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయంలో విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సోమవారం నాడు 3 అంతర్జాతీయ విమానాలతో సహా మొత్తం 15 విమానాలను జైపూర్ (12), చండీగఢ్ (2), లక్నో (1)లకు మళ్లించారు.

ఉత్తరం నుంచి వీస్తున్న పొడి గాలులు, పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమతో కూడిన తూర్పు గాలులు పరస్పరం కలవడం వల్లే ఈ ఆకస్మిక భారీ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ శశికాంత్ వెల్లడించారు. మరోవైపు, పొరుగున ఉన్న గురుగ్రామ్‌లోనూ భారీ వర్షానికి ప్రధాన రహదారులు, చౌరస్తాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాజీవ్ చౌక్, ఇఫ్కో చౌక్, ఓల్డ్ ఢిల్లీ రోడ్ సహా పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పాఠశాల బస్సులు, ఇతర వాహనాలు నీటిలో చిక్కుకుపోవడంతో, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని, పాఠశాలలకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని గురుగ్రామ్ యంత్రాంగం ఆదేశించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement