న్యూఢిల్లీ: తన అనుమతి లేకుండా నివాస చిరునామా, ఇతర వ్యక్తిగత వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేత సౌరవ్ దాస్ ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో యాంకర్ అభిజిత్ అయ్యర్-మిత్రతో పాటు పలు మీడియా ప్లాట్‌ఫాంలకు ఢిల్లీ హైకోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది.
వ్యక్తిగత సమాచారం బయటపెట్టారన్న ఆరోపణలపై మధ్యంతర రక్షణ కోరుతూ దాస్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. దాస్ నివాస చిరునామా ఉన్న పోస్టులను ఎక్స్ తొలగించినట్లు కోర్టుకు తెలియజేశారు. న్యాయమూర్తి సచిన్ దత్తా నోటీసులు జారీ చేసి, ప్రతివాదులు తమ సమాధానాలు దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ సెప్టెంబర్ 14న జరగనుంది.
దాస్ తరఫున సీనియర్ న్యాయవాది అఖిల్ సిబల్ వాదిస్తూ.. ‘ది పాంఫ్లెట్’కు చెందిన సిబ్బంది అనుమతి లేకుండా తన క్లయింట్ నివాస ప్రాంగణంలోకి ప్రవేశించి ఒక వీడియో చిత్రీకరించారని తెలిపారు. అయ్యర్-మిత్ర ఆ వీడియోకు మరిన్ని దృశ్యాలను జత చేసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారని సిబల్ ఆరోపించారు. ఎక్స్‌లోని కొన్ని పోస్టుల్లో దాస్ నివాస చిరునామాను ప్రత్యేకంగా పేర్కొన్నారని కూడా ఆయన తెలిపారు.
ఎక్స్‌లో ఇంకా ఉన్నాయా?
తన క్లయింట్‌కు రక్షణ కల్పించాలని కోరుతూ, ఎక్స్ తన విధానం ప్రకారం ఇప్పటికే తొలగించిన పోస్టులను తిరిగి అందుబాటులోకి తీసుకురాకుండా చూడాలని సిబల్ కోర్టును కోరారు. ఎక్స్ తరఫున హాజరైన న్యాయవాది, సంబంధిత లింకులు "ఇకపై అందుబాటులో లేవు" అని కోర్టుకు తెలిపారు. ఈ వాదనను కోర్టు నమోదు చేసింది.
‘ది పాంఫ్లెట్’ తరఫు న్యాయవాది కూడా పోస్టులు ఎక్స్‌లో ఇక అందుబాటులో లేవని తెలిపారు. ఆరోపణలపై పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వడానికి సమయం కోరారు. 3 రోజుల్లో ప్రతివాదుల వివరాల పత్రం, వ్యాజ్య పత్రాన్ని సవరించుకునేందుకు అనుమతించింది.
అయ్యర్-మిత్ర, ‘ది పాంఫ్లెట్’తో పాటు లాబీట్, ‘ది జైపూర్ డైలాగ్స్’, ‘ది సండే గార్డియన్’, గూగుల్ ఎల్‌ఎల్‌సీ, ఎక్స్ కార్ప్‌లను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. తన గోప్యత, గౌరవం, భద్రతకు భంగం కలిగిందని ఆరోపిస్తూ, ప్రతివాదులపై శాశ్వత, తప్పనిసరి నిషేధాజ్ఞలతో పాటు నష్టపరిహారం చెల్లించాలని దాస్ కోరారు.
తన అనుమతి లేకుండా తన నివాస చిరునామా, ఇతర వ్యక్తిగత వివరాలను నమోదు చేసి ప్రచారం చేశారని దాస్ తన పిటిషన్‌లో ఆరోపించారు. తన కచ్చితమైన చిరునామా బయటపడటం వల్ల తనకు, తన నివాసంలో ఉండే ఇతరులకు భద్రతాపరమైన ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
తాను నివసించే నివాస ప్రాంగణంలోకి ‘ది పాంఫ్లెట్’ ప్రతినిధులు ప్రవేశించి, ఇంటి లోపలి భాగాలతో సహా ఆస్తికి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించారని దాస్ ఆరోపించారు. ఆ దృశ్యాలను తర్వాత ఎక్స్‌లో పోస్టు చేశారని తెలిపారు.


