Miss Universe India 2026 ఒకప్పుడు తన ముఖాన్ని, తన ఫోటోలను చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడిన ఒక యువతి ఆత్మవిశ్వాసంతో ఎదిగి అందాల రాణిగా తనను తాను చాటుకుంది. ఆగస్టు 23న జైపూర్‌లో జరిగిన ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ గ్రాండ్ ఫినాలేలో 52 మంది పోటీదారులను వెనక్కి నెట్టి కాజియా లిజ్ మెజో (Kaziah Liz Mejo) విజేతగా నిలిచారు. సుమారు 9వేల మంది దరఖాస్తుదారుల నుండి ప్రాంతీయ పోటీలు, ఆడిషన్లు , వైల్డ్‌కార్డ్ ఎంట్రీల ద్వారా ఆమెను ఎంపిక చేశారు. ఈ విజయంతో, నవంబర్‌లో పోర్టో రికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో కాజియా భారతదేశం తరఫున పోటీ పడనున్నారు.
మిస్ యూనివర్స్ ఇండియా ఫినాలే ఈవెంట్‌కు సుస్మితా సేన్ (1994 మిస్ యూనివర్స్), సెలీనా జైట్లీ, ఊర్వశి రౌతేలా, రియా సింహా (మిస్ యూనివర్స్ ఇండియా 2024), ఫిల్మ్ ప్రొడ్యూసర్ ప్రగ్యా కపూర్, డెర్మటాలజిస్ట్ డాక్టర్ స్తుతి ఖారే శుక్లా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించడం విశేషం. కేవలం ఏడాది క్రితం టీన్-టైటిల్‌లో రన్నర్-అప్‌గా తన అందాల పోటీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఒక యువతి ఇండియా మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకోవడం, ప్యూర్టో రికోలో ప్రపంచ వేదికపై పోటీపడే అవకాశం లభించడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
ఇదీ చదవండి: బిడ్డకు మేనమామ ఉంగరం : బిడ్డింగ్ దక్కించుకున్న జ్యుయల్లర్స్ ఇవే!
ఎవరీ కాజియా లిజ్ మెజో?
అబుదాబిలో పెరిగిన కేరళ అమ్మాయి మెజో (Mejo) 2007లో జన్మించింది. మావెలిక్కరకు చెందిన మెజో అబ్రహం సుజా మెజోల కుమార్తె అయిన ఆమె, ప్రస్తుతం కొచ్చిలో ఉంటూ బెంగళూరులో న్యాయశాస్త్రం (లా) చదువుతోంది. అంతుకుముందు ఆమె అబుదాబిలోని ఎమిరేట్స్ నేషనల్ స్కూల్, సెయింట్ జోసెఫ్స్ స్కూల్, అబుదాబి ఇండియన్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. చిన్న వయసులోనే ఆమెకు వేదికపై ప్రదర్శనలు ఇచ్చే అవకాశం లభించింది. 2012లో అబుదాబిలో శాస్త్రీయ నృత్య శిక్షణ ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత అనేక సృజనాత్మక రంగాలలో నైపుణ్యాలను పెంపొందించుకుంది. 2024లో అందాల పోటీలలో పాల్గొనడం ప్రారంభించింది . 'మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2025' పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, 'ఫస్ట్ రన్నరప్'గా నిలిచింది. కొన్ని నెలల తర్వాత, ఆమె ఉన్నత స్థాయి పోటీకి (కేటగిరీకి) మారి, రాష్ట్ర స్థాయి టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కొచ్చిలో జరిగిన పోటీలో మాళవిక రాజేంద్రన్ దేవ్ , లిజ్ జైమోన్ జాకబ్‌లను ఓడించి, ఆమె 'బీనా కన్నన్ కౌచర్ మిస్ యూనివర్స్ కేరళ 2026' కిరీటాన్ని గెలుచుకుంది.
ఈ సందర్భం గత కొన్నేళ్లు తాను అనుభవించిన ఆత్మన్యూనత గురించి గా మెజో వివరించింది. చాలా కాలందాకా తన రూపం వ్యక్తిత్వం పట్ల తనకు ఆత్మవిశ్వాసం ఉండేది కాదని ఆమె చెప్పింది. fake it till you make it అనే దృక్పథం తనలో మార్పు తెచ్చిందని ఆమె పేర్కొంది. వేదికపైకి వెళ్లే ముందు కూడా, అత్యంత ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తిని తానేనని తనకు తాను చెప్పకునే దాన్నని ఆమె చెప్పింది.
ఇదీ చదవండి: రోజు రూ. 50లే, ఇపుడు ఫార్చ్యూనర్ కారు : స్వీపర్ సక్సెస్ స్టోరీ వైరల్
అలాగే అందాల పోటీల పట్ల ఆమెకు ఆసక్తి కలగడానికి టీవీలో చూసిన ఒక సంఘటనే కారణమని చెప్పుకొచ్చింది. 2021లో హర్నాజ్ సంధు 'మిస్ యూనివర్స్' కిరీటాన్ని గెలుచుకోవడం చూసిన తర్వాత తనకు అందాల పోటీలపై ఆసక్తి కలిగిందని మెజో చెప్పింది. ఎన్నాళ్లో ఎదురు చూసి, చివరికి ఆమె టైటిల్ దక్కించుకోవడం తనకు స్ఫూర్తినిచ్చిందని ఆమె పేర్కొంది.


