చెన్నై: తమిళనాడులో విజయ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై ఫోకస్ పెంచుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి నిర్ణయాలపై సీఎం విజయ్ ప్రకటన చేశారు. పొంగల్ నుంచి ‘అన్నపూర్ణ సూపర్-6’ పథకం అమలు చేయనున్నట్టు సీఎం విజయ్ చెప్పుకొచ్చారు.
తమిళనాడులో విజయ్ ప్రభుత్వం పథకాల హామీల అమలుపై స్పీడ్ పెంచింది. ‘అన్నపూర్ణ సూపర్-6’ పథకాన్ని వచ్చే పొంగల్ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందించే ప్రతిపాదన గతంలో వెల్లడైంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.30 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి దాదాపు రూ.4,000 కోట్ల భారం పడుతుందని అంచనా. ఏటా రూ.2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు ఏడాదికి మూడు ఎల్‌పీజీ సిలిండర్ల ఖర్చును ప్రభుత్వం భరించనుంది.
అలాగే, ఇప్పటికే సాధారణ ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లో ఉంది. కాగా, అక్టోబర్ 2 నుంచి మహిళలకు మరిన్ని బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా డీలక్స్ సర్వీసులను కూడా ఉచిత ప్రయాణ పరిధిలోకి తీసుకురానున్నారు. ‘వెట్రి పయణం’ పథకం పరిధిని విస్తరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు కూడా ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు విజయ్ అసెంబ్లీలో ప్రకటించారు.
సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒకవైపు పేద కుటుంబాలకు గ్యాస్ భారం తగ్గిస్తూ.. మరోవైపు మహిళలకు బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ.. ట్రాన్స్‌జెండర్లకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ విజయ్ ప్రభుత్వం అసెంబ్లీలో సంక్షేమ పథకాల వరుస ప్రకటనలు చేయడం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా తమిళనాడు ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో.. మహిళలకు బస్సు ప్రయాణం, కుటుంబాలకు వంటగ్యాస్ ప్రయోజనాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశాలుగా మారుతున్నాయి.


