ముంబై నేర చరిత్రలో ఎందరో క్రూరమైన గ్యాంగ్‌స్టర్లు ఉన్నారు. అయితే అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సైతం తలవంచి, కన్నతల్లిలా భావించి భయభక్తులతో నడుచుకున్న ఏకైక మహిళ ఒకరు ఉన్నారు.. ఆమె మాటే దావూద్‌కు వేదవాక్కు.. ముంబై అక్రమ మద్యం సామ్రాజ్యాన్ని శాసించి, పోలీసులతో పాటు అండర్‌వరల్డ్ డాన్‌లందరినీ తన గుప్పిట్లో పెట్టుకున్న ఆ మహిళే ‘జేనాబాయి దారువాలీ’. ప్రముఖ పరిశోధనాత్మక జర్నలిస్ట్ ఎస్. హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం ఆధారంగా వెలుగులోకి వచ్చిన ఆమె సంచలనాత్మక జీవిత ప్రస్థానం ఇది.
పేదరికం నుంచి స్వతంత్ర సమరం వరకు
జేనాబాయి అసలు పేరు జైనబ్. ఆమె 1920లో ముంబైలోని ఒక ముస్లిం మెమన్ హలాయ్ కుటుంబంలో జన్మించారు. తండ్రి విక్టోరియా గుర్రపు బండి నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. ఆరుగురు తోబుట్టువులతో కలిసి డోంగ్రీ ప్రాంతంలోని ఒక చిన్న గదిలో ఆమె బాల్యం గడిచింది. 14 ఏళ్ల వయసులోనే కలప వ్యాపారి మహమ్మద్ షా దర్వేశ్‌తో వివాహం జరిగింది. 1920-30ల నాటి స్వాతంత్రోద్యమంలో జేనాబాయి.. మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై పోరాటాల్లో పాల్గొన్నారు. దేశ విభజనకు ముందు ముంబైలో జరిగిన మత ఘర్షణల్లో హిందువులకు రక్షణగా నిలిచారు. ఈ క్రమంలో ఆమె భర్త చేతిలో దెబ్బలు కూడా తిన్నారు.
దేశ విభజన.. ఒంటరి పోరాటం
1947లో దేశ విభజన జరిగినప్పుడు జేనాబాయి భర్త దర్వేశ్ పాకిస్థాన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆమెను కూడా రావాలని ఒత్తిడి చేసినప్పటికీ, జేనాబాయి భారతదేశాన్ని వీడటానికి ససేమిరా అంగీకరించలేదు. తన ఐదుగురు సంతానంతో కలిసి ముంబైలోనే ఉండిపోయారు. కుటుంబ పోషణ కోసం నగరంలో నెలకొన్న తీవ్ర ఆహార కొరతను అవకాశంగా మలుచుకున్నారు. హోల్‌సేల్ వ్యాపారులకు, బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే దుకాణదారులకు మధ్య మధ్యవర్తిగా మారి బియ్యం వ్యాపారం ప్రారంభించారు. మెమన్ వర్గానికి చెందినది కావడంతో గుజరాతీ వ్యాపారులతో సులభంగా సంబంధాలు నెరిపారు. అలా ఆమె ‘జేనాబాయి చావలాలీ’గా గుర్తింపు పొందారు.
అక్రమ మద్యం సామ్రాజ్యంలోకి ప్రవేశం
తదనంతర కాలంలో ఆమె ఇక్బాల్ గాంధీ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తొలగకపోవడంతో, పేదలకు సహాయం చేసే వరదరాజన్ ముదలియార్‌ను కలిశారు. ఆ సమయంలో బొంబాయిలో మద్యపాన నిషేధం అమల్లో ఉండటంతో వరదరాజన్ ముఠా అక్రమ మద్యం తయారీలో ఉండేది. వరదా సలహాతో జేనాబాయి మద్యం వ్యాపారంలోకి దిగారు. అనతికాలంలోనే భారీగా మద్యం అమ్ముతూ ‘జేనాబాయి దారువాలీ’గా మారారు. ఈ క్రమంలోనే వరదరాజన్ ద్వారా హాజీ మస్తాన్, కరీం లాలాలతో ఆమెకు బలమైన పరిచయాలు ఏర్పడ్డాయి.
దావూద్ కుటుంబంతో బంధం
అక్రమ మద్యం వ్యాపారంతో విపరీతమైన సంపదను ఆర్జించిన జేనాబాయి, అండర్‌వరల్డ్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. 1962లో ఆమె ఇంట్లోని వాటర్ ట్యాంక్‌లో మద్యం నిల్వలు దొరకడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ తర్వాత నాటి ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్‌ను కలిసి తన పేదరికాన్ని వివరించినట్లు కథనాలు వచ్చాయి. తదనంతరం ఆమె పోలీసులకు కీలక ఇన్ఫార్మర్‌గా మారారు. ఈ క్రమంలోనే పోలీస్ కానిస్టేబుల్ ఇబ్రహీం కాస్కర్, ఆయన భార్య అమీనాలతో జేనాబాయికి సాన్నిహిత్యం పెరిగి కుటుంబ సభ్యురాలిగా మారారు. వారి కుమారుడే దావూద్ ఇబ్రహీం.
దావూద్‌ను కాపాడిన మహిళా గాడ్‌మదర్
చిన్నతనంలో దావూద్ గ్యాంగ్ వార్స్‌లో తిరుగుతూ తండ్రికి తలనొప్పిగా మారేవాడు. ఒకసారి మనీష్ మార్కెట్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ హమీద్ ‘చూహా’పై దావూద్ తీవ్ర దాడి చేయడంతో అతను ఐసీయూ పాలయ్యాడు. కొడుకు ఆగడాలతో విసిగిపోయిన కానిస్టేబుల్ ఇబ్రహీం కాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో దావూద్ వారం రోజుల పాటు ఇంటికి దూరంగా దాక్కున్నాడు. ఆ సమయంలో జేనాబాయి రంగంలోకి దిగి దావూద్ తల్లిదండ్రులను శాంతింపజేయడమే కాకుండా, పోలీసు అధికారులతో మాట్లాడి కేసు నుంచి దావూద్‌ను రక్షించారు. నాటి నుంచి దావూద్ ఆమెను కన్నతల్లిలా గౌరవించేవాడు.
రక్తపాతానికి ముగింపు.. గ్యాంగ్‌స్టర్ల మధ్య సంధి
దావూద్ ఇబ్రహీంకు, ఇతర ముస్లిం గ్యాంగ్‌లకు మధ్య తీవ్రమైన ఆధిపత్య పోరు నడుస్తున్న సమయంలో జేనాబాయి కీలక మధ్యవర్తిత్వం వహించారు. పఠాన్ గ్యాంగ్ లీడర్ కరీం లాలా, హాజీ మస్తాన్‌లతో దావూద్‌కు సమావేశం ఏర్పాటు చేశారు. జేనాబాయి చొరవతో కరీం లాలా వర్గం, దావూద్, అతని సోదరుడు సాబిర్, మాజిద్ కాలియా, హుస్సేన్ సోమ్జీ తదితరులు చేతులు కలిపారు. పరస్పరం కొట్టుకు చచ్చే ముఠాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి, ముంబై అండర్‌వరల్డ్‌లో సరికొత్త నేర సిండికేట్‌ను నడిపించిన ఘనత జేనాబాయికే దక్కింది.
ఇది కూడా చదవండి: బెంగాల్ విభజనకు తావులేకుండా గూర్ఖాలాండ్‌కు పరిష్కారం


