‘సింగం’ తుకారాం రాజకీయాల్లోకి వస్తారా? కుండబద్దలుకొట్టిన అధికారి | Will Tukaram Mundhe join politics Singham reacts | Sakshi
Sakshi News home page

‘సింగం’ తుకారాం రాజకీయాల్లోకి వస్తారా? కుండబద్దలుకొట్టిన అధికారి

Aug 21 2026 8:39 PM | Updated on Aug 21 2026 8:53 PM

Will Tukaram Mundhe join politics Singham reacts

ముంబై: మహారాష్ట్ర ఆహార, ఔషధాల కమిషనర్‌ తుకారాం ముండే(2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి)కు ప్రజల నుంచి వచ్చిన ప్రశంసలు మరే ఇతర ఎఫ్‌డీఏ కమిషనర్‌కూ ఇ‍ప్పటివరకూ దక్కలేదనే చెప్పుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా రెస్టారెంట్లు, ఈటరీ కేంద్రాల్లో అపరిశుభ్రతపై కఠిన చర్యలు తీసుకోవడంతో ఆయన పేరు మారుమోగిపోయింది. 

నిబంధనలను కఠినంగా అమలు చేసే తీరుతో తరచూ “ఐఏఎస్ సింగం”గా ముండేను పిలుస్తారు. ఎలాంటి మొహమాటం లేకుండా వ్యవహరించే తీరుతో తన కెరీర్‌లో పలువురు రాజకీయ నాయకులతో తరచూ విభేదించారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార‍్యక్రమంలో ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. రాజకీయాల్లోకి వస్తారా? అని ఆయనను అడిగారు. దీనికి కూడా ఆయన నిజాయితీగా, సూటిగా సమాధానం ఇచ్చారు.

“అసలు లేదు. దానికి దాని సొంత అవసరాలు ఉంటాయి. నేను సూటిగా మాట్లాడే వ్యక్తిని, చాలా బహిరంగంగా, మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను. రాజకీయాలకు ఈ లక్షణాలు నచ్చుతాయో లేదో నాకు తెలియదు” అని ముండే అన్నారు.  ప్రజాసేవలో ఉండాల్సిన విధానానికి రాజకీయాల్లో ఎదురయ్యే సవాళ్లు పూర్తిగా భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు.

బ్యూరోక్రాట్‌గా తాను అన్ని పనులు చేసినట్టే రాజకీయాల్లోనూ కొత్త ఒరవడిని సృష్టించగలరా? అని ముండేను అడగగా.. ఆయన స్పందిస్తూ.. “నేను ఒక విషయంలో మంచిగా ఉంటే, దానినే కొనసాగించాలి” అని చమత్కరించారు. మహారాష్ట్ర ఎఫ్‌డీఏగా బాధ్యతలు చేపట్టి కేవలం 3 నెలలే అయినా, రాష్ట్రంలోని రెస్టారెంట్లు, గోదాములు, ఆహార దుకాణాలపై కఠిన చర్యలతో ముండే అందరి దృష్టిని ఆకర్షించారు.

నాకు నేనే సవాలు విసురుకుంటా.. 
వంటగదుల్లో బొద్దింకలు, గడువు ముగిసిన ఉత్పత్తులు కనిపించడంతో డొమినోస్, పిజ్జా హట్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేశారు. ముంబైలో చాలా కాలంగా కొనసాగుతున్న ఆహార వ్యాపార సంస్థల లైసెన్సులను కొంతకాలం నిలిపివేశారు. బ్లింకిట్, జెప్టోకు చెందిన డార్క్ స్టోర్లలో నిర్వహించిన దాడుల్లో బల్లులు, బొద్దింకలు, గడువు ముగిసిన ఉత్పత్తులు బయటపడ్డాయి. బాంబే హైకోర్టు క్యాంటీన్లలోనూ తనిఖీలు నిర్వహించడానికి ఆయన వెనుకాడలేదు. జూలై 31 నాటికి తన విభాగం 3,000 తనిఖీలు నిర్వహించిందని, రూ.55 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుందని, 165 సంస్థల లైసెన్సులను నిలిపివేసిందని ముండే తెలిపారు.

కఠిన పరిపాలనా నిర్ణయాలు తీసుకునే అధికారిగా ముండేకు ఉన్న పేరుతో 21 ఏళ్లలో ఆయన దాదాపు 25 సార్లు బదిలీ అయ్యారు. సవాళ్లు విసరడం ఇష్టమా? అని ఆయనను అడగగా.. ముండే వెంటనే స్పందిస్తూ.. “నాకు నేనే సవాలు విసురుకుంటాను” అని చెప్పారు.

కాగా, బీడ్‌లోని ఓ గ్రామంలో సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగి మహారాష్ట్ర ఎఫ్‌డీఏగా బాధ్యతలు చేపట్టే స్థాయికి ముండే చేరుకున్నారు. ఈ ప్రయాణంలో ఆయన పలువురు ముఖ్యమంత్రుల కింద పనిచేశారు. ఎవరైనా తనకు ఇష్టమైన ముఖ్యమంత్రి ఉన్నారా? అని అడగగా ముండే చమత్కరిస్తూ “అందరూ నాకు ఇష్టమైనవారే” అని అన్నారు.

ఇదీ చదవండి: ధర్నా విరమించిన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement