భారత్‌ను గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. రూ.62,500 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా ప్రకటించిన ‘మొబైల్ ఫోన్ మేన్యుఫాక్చరింగ్ స్కీమ్’ (ఎంపీఎంఎస్) మార్గదర్శకాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ పథకం 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది.
ఈ మార్గదర్శకాల ప్రకారం, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) పొందడానికి ప్రస్తుత మొబైల్ తయారీ సంస్థలు, కాంట్రాక్ట్ తయారీదారులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో (FY26) కనీసం రూ.10,000 కోట్ల టర్నోవర్ కలిగి ఉండటం తప్పనిసరి. అదే సమయంలో 51 శాతం స్వదేశీ భాగస్వామ్యం ఉన్న ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్) కంపెనీలకు టర్నోవర్ పరిమితిని రూ.1,000 కోట్లుగా నిర్దేశించారు.
భారతీయ బ్రాండ్లకు ప్రోత్సాహకాలు
కేవలం అసెంబ్లీ రంగానికే పరిమితం కాకుండా దేశీయ బ్రాండ్లను ప్రోత్సహించడం, డిజైన్, పరిశోధన-అభివృద్ధి రంగాల్లో భారత్ సాధికారత సాధించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ మార్గదర్శకాల్లో భాగంగా.. మార్కెట్లో ఉన్న బ్రాండ్లు తమ ఐదేళ్ల కాలవ్యవధిలో ఏటా FY26 విక్రయాల కంటే అదనంగా రూ.5,000 కోట్ల విక్రయాల వృద్ధి (ఇంక్రిమెంటల్ సేల్స్) నమోదు చేయాలి. కొత్తగా వచ్చే బ్రాండ్లు రూ.10,000 కోట్ల వార్షిక విక్రయాలు సాధించాలి. అర్హత సాధించిన విక్రయాలపై 2.25%-2.75% వరకు ప్రోత్సాహక సాయం అందుతుంది.
డిస్‌ప్లే మోడ్యూల్స్, బ్యాటరీలు, ఛార్జర్లు వంటి భాగాలను దేశీయంగా సేకరిస్తే అదనంగా 1.5% ప్రోత్సాహకం, డిజైన్, ఆర్ అండ్ డీ చేపట్టే భారతీయ బ్రాండ్లకు మరో 3% అదనపు ప్రయోజనం కల్పిస్తారు. ఐదేళ్ల వ్యవధిలో దేశంలో రూ.39 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఉత్పత్తి సాధించడం, అలాగే దాదాపు 60,000 ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


