శాన్ ఫ్రాన్సిస్కో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అభివృద్ధి మానవాళిని అద్భుతాల వైపు నడిపిస్తున్నప్పటికీ, అది నియంత్రణ తప్పుతుందేమోనన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతోంది. సాంకేతికత ఎంత వేగంగా దూసుకెళ్తున్నా, సరైన నైతిక పునాదులు లేకపోతే ప్రమాదకరమని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ సందిగ్ధ పరిస్థితుల్లో ఏఐకి సరికొత్త దిశానిర్దేశం చేసేందుకు ప్రపంచంలోని అగ్రగామి సంస్థలు ఆధ్యాత్మిక, తత్వశాస్త్రం వైపు అడుగులు వేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్, ‘ఇంటర్నెట్ యుగపు స్వామి వివేకానంద’గా పేరొందిన వేదాంత గురువు స్వామి సర్వప్రియానందను తమ శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించింది. తమ అత్యాధునిక మోడల్ ‘క్లాడ్’ (Claude)కు శిక్షణ ఇచ్చే విధానాలు, సాంకేతికతలో నైతిక విలువల రూపకల్పన, భవిష్యత్తులో ఏఐ మానవుల తరహా చేతనను సాధించగలదా అనే అంశాలపై ఆయనతో విస్తృతంగా చర్చించారు.
సంస్థతో కుదిరిన నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ (ఎనడీఏ)కారణంగా సమావేశంలోని పూర్తి వివరాలను ఆయన వెల్లడించనప్పటికీ, పలు కీలక విషయాలను పంచుకున్నారు. ఈ మేధోమథనంలో సంస్థ వ్యవస్థాపకులలో ఒకరితో పాటు వివిధ మతాల ఆధ్యాత్మికవేత్తలు, మానసిక నిపుణులు, వైద్యులు పాల్గొని తమ విలువైన ఆలోచనలను అందించారని ఆయన తెలిపారు.
కేవలం గణిత అల్గారిథమ్‌లు, డేటాతోనే కాకుండా మానవీయ కోణాన్ని అర్థం చేసుకునేలా ఏఐని తీర్చిదిద్దడమే ఈ సమాలోచనల అసలు ఉద్దేశం. అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలను బాధ్యతాయుతంగా, మానవ సంక్షేమానికి అనుకూలంగా మలచాలంటే పురాతన తాత్విక జ్ఞానం ఎంతో అవసరమని సిలికాన్ వ్యాలీ దిగ్గజాలు గుర్తించడాన్ని ఈ పరిణామం స్పష్టంగా తెలియజేస్తోంది.
ఇదీ చదవండి: అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి


