మెజార్టీ అమెరికన్ల అభిప్రాయం
పడిపోతున్న ప్రజాదరణ
త్వరలో మధ్యంతర ఎన్నికలు
వాషింగ్టన్: మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్‌నకు ఎదురు గాలులు వీస్తున్నాయి. పెట్రోలు, డీజిళ్లతోపాటు నిత్యావసరాల ధరలు కూడా పైపైకి ఎగబాకుతూండటతో ట్రంప్ విధానాలపై ప్రజల్లో అసంతృప్తి ఎక్కువవుతోంది. అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్, షికాగో యూనివర్శిటీ పరిశోధన కేంద్రం ‘నేషనల్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్లు’సంయుక్తంగా (ఏపీ–ఎన్‌ఓఆర్‌సీ)నిర్వహించిన తాజా సర్వేలోనూ ఈ విషయం స్పష్టమైంది.
ధరల పెరుగుదలకు ట్రంప్ విధానాలే కారణమని అత్యధికులు భావిస్తున్నారు. దీంతో ఈ అసంతృప్తి ప్రభావం కాస్తా వచ్చే నెలలో జరిగే మధ్యంతర ఎన్నికలపై పడనుందని అధికార రిపబ్లికన్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక విధానాలపై ట్రంప్ అప్రూవల్ రేటింగ్ గత ఏడాది మార్చితో పోలిస్తే ఏకంగా 14 శాతం వరకూ తగ్గిపోయినట్లు ఈ సర్వే తెలిపింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయానికి వస్తే దాదాపు 60 శాతం రిపబ్లికన్లే ట్రంప్ తీరుపై మండిపడుతున్నట్లు తెలుస్తోంది.
ధరల పెరుగుదల విషయానికి వస్తే ఏపీ–ఎన్‌ఓఆర్‌సీ సర్వే ప్రకారం 65 శాతం అమెరికన్లకు ట్రంప్ వైఖరి ఏమాత్రం నచ్చడం లేదు. జీవన వ్యయం విషయంలో ట్రంప్ విధానాలు ఓకే అంటున్న వారు.. 17 శాతం మంది ఉండగా.. స్థూలంగా ఆర్థిక విధానాలు ఫర్వాలేదన్న వాళ్లు 26 శాతం మంది మాత్రమే. టారిఫ్‌ల విషయంలో ట్రంప్ దూకుడు, ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతూండటంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తరువాత ఇవి అత్యంత కనిష్టమైన రేటింగ్స్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరగనున్న మధ్యంతర ఎన్నికలు కీలకం కానున్నాయి. కాంగ్రెస్‌పై రిపబ్లికన్ల పట్టు కొనసాగుతుందా? లేదా అన్నది ఈ ఎన్నికలతో తేలనుంది. మరోవైపు ట్రంప్ తన ఎన్నికల ప్రచారాన్ని కూడా దూకుడుగానే మొదలుపెట్టారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు తానే పోటీలో ఉన్నానని అనుకోండని పిలుపునిచ్చారు కూడా.
అయితే ఈ ఎత్తుగడ అంత మంచి ఫలితాలిచ్చే అవకాశాలు లేవని, రిపబ్లికన్లలోనే ట్రంప్ తీరు, పాలనలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని ఈ సర్వే ద్వారా తెలిసింది. ‘‘మా అధ్యక్షుడు దేశానికి సాయం చేస్తాడని అనుకున్నాం. ఇప్పటివరకైతే ఆర్థిక విషయాల్లో కానీ.. ఇతరాల్లో కానీ ఆయన చేసిందేమీ లేదు. మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్ అన్నాడు కానీ.. ఆ దిశగా జరిగిన ప్రయత్నాలేవీ లేవు’’అని రాబర్ట్ గాల్ట్ అనే 66 ఏళ్ల పెన్సెల్వేనియా వ్యక్తి చేసిన వ్యాఖ్య పరిస్థితికి అద్దం పడుతోంది.
ట్రంప్ దృష్టి ఎక్కడో ఉంది...
ఇరాన్‌తో యుద్ధం విషయంలో 69 శాతం అమెరికన్లు ట్రంప్‌పై గుర్రుగా ఉంటే దాదాపు 28% మంది మాత్రమే ఒకే అంటున్నారు. వివిధ దేశాలతో వాణిజ్య, టారిఫ్‌లు విధించడంలో ట్రంప్ ‘‘మితిమీరి’’వ్యవహరిస్తున్నారని 64% మంది భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో 58 శాతం మంది మాత్రమే ఈ రకమైన అభిప్రాయం కలిగి ఉండేవారు. ఆసక్తికరంగా సుమారు 67 శాతం మంది రిపబ్లికన్లు అధిక ధరలకు ట్రంప్ చేతుల్లో లేని విషయాలే కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం చాలా కష్టం అని విస్‌కాన్సిన్‌కు చెందిన ట్రంప్ మద్దతుదారు ఫ్రెడ్ న్యూమన్ (51) అభిప్రాయపడ్డారు. ట్రంప్ టారిఫ్ విధానాలు, ఇరాన్‌తో యుద్ధం కూడా అవసరమైనవేనని అంటున్నారు.
నిత్యావసరాల ధరలు పైపైకి...
అమెరికాలో కొన్ని నెలలుగా నిత్యావసరాల ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నెలవారీ వెచ్చాలు, పెట్రోలు, డీజిళ్ల ధరలపై సగం మంది అమెరికన్లు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. రెండు నెలల క్రితం ఈ సంఖ్య 39 శాతంగా ఉండేది. అన్ని వస్తువుల ధరలూ పెరిగిపోవడంతో డబ్బులు ఏమాత్రం మిగలడం లేదని, గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదని, కాలిఫోర్నియాకు చెందిన పెడ్రో శాంచెజ్ వ్యాఖ్యానించారు. అయోవాలోని ఫెయిర్‌ఫ్యాక్స్‌కు చెందిన బెథనీ లెనికా (41) మాట్లాడుతూ....‘‘ఈ వారం ఒకలా (ధరలు) ఉంటే మరుసటి వారం ఇంకోలా ఉంటున్నాయి. ఖర్చులకు తగ్గట్టు ఆదాయం ఎలాగూ పెరగదు’’అని అన్నారు. రిపబ్లికన్ పార్టీ వైపే మొగ్గు చూపే లెనికా ‘‘పరిస్థితులు మారినట్టు కనిపించడం లేదు’’అని వ్యాఖ్యానించడం గమనార్హం.


