అంతుచిక్కని ప్రశ్నలు! | Israel and UAE step in to investigate to Flydubai place crash | Sakshi
Sakshi News home page

అంతుచిక్కని ప్రశ్నలు!

Oct 2 2026 5:56 AM | Updated on Oct 2 2026 5:56 AM

Israel and UAE step in to investigate to Flydubai place crash

దర్యాప్తునకు రంగంలోకి దిగిన ఇజ్రాయెల్, యూఏఈ 

అమెరికా, ఒమన్‌ సైతం విచారణ చేపట్టే ఛాన్స్‌ 

కోపైలట్‌ను మతఛాందస వ్యక్తిగా అభివర్ణించిన నెతన్యాహూ 

అతడిని తమకు అప్పగించాలని కోరనున్న ఇజ్రాయెల్‌

జెరూసలేం/దుబాయ్‌: ఫ్లై దుబాయ్‌ ఉదంతంలో కెప్టెన్‌ను కోపైలట్‌ అంత దారుణంగా ఎందుకు పొడిచాడు? ప్రయాణికులందర్నీ చంపబోయిన తనను అడ్డుకున్నందుకు కోపైలట్‌ పట్టరాని ఆవేశంతో విచక్షణారహితంగా కెప్టెన్‌పై దాడిచేశాడా? అనేవి అంతుచిక్కని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. పిచ్చెక్కినట్లు కీలక వ్యవస్థలను అతను ఎందుకు నాశనంచేయబోయాడు? అనే దానికి కూడా ఏ దర్యాప్తు సంస్థా ఇంకా జవాబు చెప్పే పరిస్థితిలేదు.

 ప్రస్తుతం సౌదీ పోలీసుల కస్టడీలో ఉన్న కోపైలట్‌ నోరు విప్పితేగానీ విమాన క్రాష్‌ల్యాండింగ్‌ కుట్ర వెనక ఉన్నదెవరు? అనే విషయాలు వెల్లడికానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే యూఏఈ పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఘటన జరిగిన విమానం యూఏఈ ప్రభుత్వరంగ పౌరవిమానయాన సంస్థ కావడంతో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు యూఏఈ అటార్నీ జనరల్‌ కౌన్సిలర్‌ హమాద్‌ అల్‌ షామీ తెలిపారు. ఇజ్రాయెల్‌ సైతం దర్యాప్తు మొదలెట్టింది. 

మరో 9/11 తరహా ఉగ్రదాడి ఘటనగా ఇది పేరొందటంతో అమెరికా సైతం రంగంలోకి దిగబోతోంది. పట్టుబడిన కోపైలట్‌ ఒమన్‌ దేశస్తుడని ప్రచారంకావడంతో ఆ దేశం సైతం తమ వైపు నుంచి దర్యాప్తు ఆరంభించే ఆస్కారముంది. ఇన్ని దేశాల దర్యాప్తుల్లో ఏమేం విషయాలు బయటికొస్తాయా అని ప్రపంచదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ‘‘ఉగ్రవాదం మొదలు కోపైలట్‌ వ్యక్తిత్వం, మానసిక సమస్యల దాకా అన్ని కోణాల్లో దర్యాప్తు జరగబోతోంది’’అని సంబంధిత ఉన్నతాధికారి వెల్లడించారు. మరోవైపు ఈ ఘటన వెనుక ఇస్లామిక్‌ ఉగ్రవాదుల హస్తముందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ ఆరోపించారు.

 ఫాక్స్‌న్యూస్‌ ఛానల్‌ వారి ‘ఫాక్స్‌ అండ్‌ ఫ్రెండ్స్‌’ కార్యక్రమంలో నెతన్యాహూ మాట్లాడారు. ‘‘అతనో ఉగ్రవాది. ఇస్లామిక్‌ మతఛాందసవాది’’అని అన్నారు. ఈ ఘటనలో ఇరాన్‌ ప్రమేయముందా అని మీడియా అడగ్గా ‘‘ఇప్పుడే దీనిపై మాట్లాడటం తొందరపాటు చర్యే అవుతుంది’’అని అన్నారు.  అయితే తన వాదనలకు గల బలమైన సాక్ష్యాధారాలను ఆయన బయటపెట్టలేదు.  కోపైలట్‌ను ప్రశ్నించేందుకు ఇజ్రాయెల్‌ నిఘా, భద్రతాధికారులు ఇప్పటికే సౌదీకి చేరుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జయీద్‌ అల్‌ నహ్యాన్‌తో నెతన్యాహూ ఫోన్‌ మంతనాల తర్వాత ఇజ్రాయెల్‌ బృందం సౌదీకి చేరుకుంది. దర్యాప్తు నిమిత్తం అతడిని తమకు అప్పగిస్తే స్వదేశానికి తీసుకెళ్తామని ఇజ్రాయెల్‌ జాతీయభద్రతా మంత్రి ఇతామర్‌ బెన్‌ గవిర్‌ చెప్పారు. అయితే ఈ అభ్యర్థనపై సౌదీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement