విచారణ సాకుతో నిర్బంధమా? | Allahabad High Court Orders Police Officers to Pay Compensation for Illegally Detaining Innocent Man | Sakshi
Sakshi News home page

విచారణ సాకుతో నిర్బంధమా?

Oct 2 2026 4:56 AM | Updated on Oct 2 2026 4:56 AM

Allahabad High Court Orders Police Officers to Pay Compensation for Illegally Detaining Innocent Man

రెండు కేసుల్లో పోలీసుల తీరుపై అలహాబాద్‌ హైకోర్టు ఆగ్రహం 

రెండేళ్ల పాపతోసహా నిందితుల కుటుంబసభ్యులను నిర్బంధిస్తారా?

రోజుల తరబడి పోలీస్‌స్టేషన్లలోనే ఉంచేస్తారా? 

ఇలాంటి పరిణామాలు దారుణం 

ఈ దారుణాలకు బాధితులకు పరిహారం చెల్లించాల్సిందే 

ఆ పరిహారాన్నీ పోలీసుల జీతాల నుంచే వసూలు చేయాలి 

కోర్టు అసంతృప్తిని వారి సర్వీస్‌ రికార్డులో నమోదుచేయాలి 

పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలు నిరంతరం పనిచేయాల్సిందే 

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు 

హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై సంచలన తీర్పులు

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ:  పోలీసుస్టేషన్‌లో సామాన్య పౌరులను చట్టవిరుద్ధంగా నిర్బంధించి, వేధింపులకు గురిచేసిన ఘటనలపై అలహాబాద్‌ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాన్ని అతిక్రమించే పోలీసు అధికారులకు చెంపపెట్టు వంటి రెండు తీర్పులు ఇచ్చింది. ఒక కేసులో రెండేళ్ల పసిపాపతోసహా పలువురు కుటుంబసభ్యులను అలాగే మరోకేసులో నిందితుడి సోదరుడిని అక్రమంగా నిర్బంధించడంపై నిప్పులు చెరిగింది. పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్‌ అతుల్‌ శ్రీధరన్, జస్టిస్‌ దివేష్‌ చంద్ర సమంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పులు వెలువరించింది.  

10 రోజులు నిర్బంధం 
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియో జిల్లా గౌరీబజార్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన ఒక హత్య కేసుకు సంబంధించి విచారణ సాకుతో పోలీసులు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారు. నిందితుల బంధువులైన నందిని గౌర్, ఆమె రెండేళ్ల పసిపాప సహా ముగ్గురు మహిళలను పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్‌ 13 నుంచి 23వ తేదీ వరకూ పది రోజుల పాటు  పోలీసు స్టేషన్‌లోనే నిర్బంధించారు.

ఎలాంటి అరెస్టు చూపలేదు. 24 గంటల్లోగా మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచాల్సి ఉన్నా ఆ నిబంధనలన్నింటినీ తుంగలోకి తొక్కారు. ఈ దారుణ ఘటనపై బాధితులు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో మహేంద్ర గౌర్‌ అనే మరో బాధితుడు కూడా పిటిషన్‌ దాఖలు చేశారు. తనను అదుపులోకి తీసుకున్న పోలీసులు 48 గంటలకుపైగా నిర్బంధించారని, తీవ్రంగా కొట్టారని, రూ.25 వేలు వసూలు చేసి తనను వదిలిపెట్టారని కోర్టులో వాదనలు వినిపించారు.  

సీసీటీవీ ఆధారాలు మాయం... 
ఈ కేసులో విచారణ సందర్భంగా అప్పటి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) డాక్టర్‌ మహేంద్ర కుమార్‌ కోర్టుకు హాజరయ్యారు. పిటిషనర్లు పోలీసుస్టేషన్‌లో ఉన్న సమయంలో సీసీ టీవీ కెమెరాలు పనిచేయలేదని, సాంకేతిక లోపం తలెత్తిందని చెప్పుకొచ్చారు. దీంతో ధర్మాసనం... ఈ కేసులో డియోరియో సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు (ఎస్‌పీ) సమర్పించిన నివేదికను పరిశీలించింది.

సీసీ కెమెరాల డేటా కేవలం పిటిషనర్లు పోలీసుస్టేషన్‌లో ఉన్న సమయాల్లోనే కట్‌ అవ్వడం లేదా రికార్డు కాకపోవడంపై సందేహం వ్యక్తం చేసింది. పోలీసులు తమ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగించి ఉంటారని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘సీసీ టీవీ అందుబాటులో లేకపోవడం, స్టేషన్‌ రికార్డుల్లో ఎలాంటి నమోదు లేకపోవడం వల్ల పిటిషనర్లు చెప్పిన అక్రమ నిర్బంధ ఆరోపణలు నిజమేనని కోర్టు నిర్ధారణకు వస్తోంది’’ అని వ్యాఖ్యానించింది. ఎస్‌హెచ్‌వో డాక్టర్‌ మహేంద్ర కుమార్‌ ప్రవర్తనపై కోర్టు వ్యక్తం చేసిన తీవ్ర అసంతృప్తిని ఆయన సర్వీస్‌ రికార్డులో నమోదు చేయాలని ఆదేశించింది.

సీసీ కెమెరాలపై సుప్రీం తీర్పు శిరోధార్యం 
పోలీసుస్టేషన్లలో సీసీ  24 గంటలూ పనిచేసేలా చూడాలి. ఒకవేళ పనిచేయకపోతే జనరల్‌ డైరీలో నమోదుతో పాటు ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని పరమ్‌వీర్‌ సింగ్‌ సైనీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలి.

అక్రమ నిర్బంధానికి పరిహారం 
పది రోజుల పాటు అక్రమ నిర్బంధంలో ఉన్న ముగ్గురు పిటిషనర్లకు రూ.20వేల చొప్పున, రెండ్రోజుల నిర్బంధంలో ఉన్న మహేంద్ర గౌర్‌కు రూ.5  వేలు నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలి.  ఈ పరిహారం సొమ్మును బాధ్యులైన పోలీసు అధికారుల జీతాల నుంచే రికవరీ చేయాలి.

ఇది వ్యక్తి స్వేచ్ఛను హరించడమే.. 
⇒ నిందితుడికోసం అతడి సోదరుడిని ఎలా నిర్బంధిస్తారు? 
⇒ మరోకేసులోనూ హైకోర్టు ఆగ్రహం 
ఇదిలాఉండగా, నిందితుడిని లొంగిపోయేలా ఒత్తిడి చేసేందుకు అతడి కుటుంబంలోని అమాయక వ్యక్తిని పోలీసులు జూన్‌ 23 నుంచి 26వ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు నిర్బంధించిన మరో కేసులో కూడా జస్టిస్‌ అతుల్‌ శ్రీధరన్, జస్టిస్‌ దివేష్‌ చంద్ర సమంత్‌లతో కూడిన ధర్మాసనం పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అలాంటి నిర్బంధం వ్యక్తి స్వేచ్ఛను చట్టవిరుద్ధంగా హరించడమేనని పేర్కొంది.

అక్రమంగా నిర్బంధించిన వ్యక్తికి పరిహారం పొందే హక్కు ఉంటుందని స్పష్టంచేసింది. ప్రయాగ్‌రాజ్‌లోని జార్జ్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో తనను అక్రమంగా నిర్బంధించారంటూ అరవింద్‌ కుమార్‌ యాదవ్‌ దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను విచారించిన  ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అరవింద్‌ కుమార్‌కు రూ.40 వేల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయనను అక్రమంగా నిర్బంధించడంలో బాధ్యులైన పోలీసు సిబ్బంది జీతాల నుంచి ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగిన నిష్పత్తిలో వసూలు చేయాలని స్పష్టం చేసింది.   సీసీటీవీ ఫుటేజీ, మొబైల్‌ కాల్‌ డీటెయిల్‌ రికార్డు (సీడీఆర్‌) ద్వారా పోలీసుల దారుణాలను హైకోర్టు గుర్తించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement