అప్పుల పాలై.. 104 మంది ప్రాణాలు తీసిన పైలట్! | The Ultimate Betrayal: When Pilots Deliberately Crashed Their Own Planes | Sakshi
Sakshi News home page

అప్పుల పాలై.. 104 మంది ప్రాణాలు తీసిన పైలట్!

Oct 1 2026 7:11 PM | Updated on Oct 1 2026 8:17 PM

The Ultimate Betrayal: When Pilots Deliberately Crashed Their Own Planes

న్యూఢిల్లీ : దుబాయ్ నుండి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్‌ 1073లో ఊహించని విపత్తు ముంచుకొచ్చింది. విమానాన్ని హైజాక్ చేసి కూల్చివేయాలని కుట్ర పన్నిన కో-పైలట్..కాక్‌పిట్‌లో అత్యవసరంగా ఉపయోగించే గొడ్డలితో (క్రాష్‌ యాక్స్‌) పైలెట్‌ కెప్టెన్ స్మిత్‌మచ్చర్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. 

అయినప్పటికీ, తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ అసాధారణమైన సంకల్ప బలాన్ని ప్రదర్శించారు. క్షణాల వ్యవధిలో హైజాక్ కోడ్‌ను ప్రసారం చేయడమే కాకుండా, కాక్‌పిట్ తలుపులు అన్‌లాక్ చేశాడు. ప్రాణాలను పణంగా పెట్టి విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఫలితంగా 170 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ సాహసగాథ యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసినప్పటికీ, విమానయాన చరిత్రలో ఇలాంటి ఉద్దేశపూర్వక దాడులు, విషాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పైలట్లు లేదా సిబ్బంది మానసిక సమస్యలు, వ్యక్తిగత కక్షలు, తీవ్ర నిరాశ నిస్పృహల కారణంగా విమానాలను కూల్చివేసిన అత్యంత భయానక సంఘటనల చరిత్రను పరిశీలిస్తే...

ఫెడెక్స్ ఫ్లైట్ 705 (ఏప్రిల్ 4, 1994)
ఉద్యోగం నుండి తొలగిస్తారనే తీవ్రమైన భయం, ఆగ్రహంతో ఉన్న విధుల్లో లేని ఫెడెక్స్ ఫ్లైట్ ఇంజనీర్ ఆబర్న్ కల్లోవే.. తన కుటుంబం కోసం భారీ బీమా డబ్బును క్లెయిమ్ చేయాలనే దురుద్దేశంతో విమానం ఎక్కాడు. సుత్తి, ఈటె వంటి మారణాయుధాలను రహస్యంగా తీసుకువెళ్లి కాక్‌పిట్‌లోకి బలవంతంగా చొరబడ్డాడు. విమానం గాలిలో ఉండగానే ముగ్గురు సిబ్బందిపై (కెప్టెన్, ఫస్ట్ ఆఫీసర్,ఫ్లైట్ ఇంజనీర్) దాడి చేశాడు. సిబ్బంది  ప్రతిఘటన,సాహసం వల్ల ఆ విమానం కూలిపోకుండా తృటిలో తప్పించుకుంది.

సిల్క్‌ఎయిర్ ఫ్లైట్ 185 (డిసెంబర్ 19, 1997)
ఇండోనేషియా నుండి సింగపూర్‌కు బయలుదేరిన సిల్క్‌ఎయిర్ విమానం ప్రయాణంలో ఉండగా అనూహ్యంగా కూలిపోయింది. దర్యాప్తులో తేలిన సమాచారం ప్రకారం, తీవ్రమైన ఆర్థిక నష్టాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ విమాన కెప్టెన్ ఉద్దేశపూర్వకంగానే ఫ్లైట్ రికార్డర్లను (బ్లాక్ బాక్స్) ఆపివేశాడు. కో-పైలట్ కాక్‌పిట్ బయట ఉన్న సమయంలో తలుపులు లాక్ చేసి, విమానాన్ని అతివేగంగా నదిలోకి ముంచేశాడు. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 104 మంది ప్రాణాలు కోల్పోయారు. (ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ చాలా సంస్థలు దీనిని పైలట్ ఆత్మహత్యగా నిర్ధారించాయి).

ఈజిప్ట్ ఎయిర్ ఫ్లైట్ 990 (అక్టోబర్ 31, 1999)
న్యూయార్క్ నుండి కైరోకు వెళ్తున్న ఈజిప్ట్ ఎయిర్ విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయి 217 మంది ప్రాణాలు కోల్పోయారు. కెప్టెన్ విశ్రాంతి కోసం కాక్‌పిట్ నుంచి బయటకు వెళ్లిన తరుణాన్ని ఆసరాగా చేసుకున్న సహాయ కో-పైలట్ గమిల్ అల్-బటౌటి ఆటోపైలట్‌ను నిలిపివేసి, విమానాన్ని నిటారుగా సముద్రంలోకి దూసుకుపోయేలా చేశాడు. కెప్టెన్ తిరిగి వచ్చి నువ్వేం చేశావు?అని నిలదీసినట్లు బ్లాక్ బాక్స్ రికార్డింగ్‌లలో స్పష్టమైంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

 జర్మన్‌వింగ్స్ ఫ్లైట్ 9525 (మార్చి 24, 2015)
ఆధునిక ఏవియేషన్ చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనలలో ఇదొకటి. తీవ్రమైన మానసిక కుంగుబాటుతో బాధపడుతున్న కో-పైలట్ ఆండ్రియాస్ లుబిట్జ్.. కెప్టెన్ కాస్త టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో కాక్‌పిట్ తలుపును లోపలి నుండి గడియ పెట్టాడు. కెప్టెన్ ఎంతగా తలుపు పగలగొట్టడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. లుబిట్జ్ ఉద్దేశపూర్వకంగా విమానాన్ని ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వత శ్రేణులలోకి పోనిచ్చి కూల్చేశాడు. ఈ దుర్ఘటనలో 150 మంది ప్రాణాలు విడిచారు.

భద్రతా ప్రమాణాల్లో మార్పులు
జర్మన్‌వింగ్స్ విమాన ప్రమాదం తర్వాత ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో కఠినమైన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ‘కాక్‌పిట్‌లో ఇద్దరు’అనే నిబంధనను తెరపైకి తెచ్చారు. దీని ప్రకారం ఒక పైలట్ ఏదైనా అవసరాల కోసం బయటకు వెళితే, క్యాబిన్ సిబ్బందిలో మరొకరు విధిగా కాక్‌పిట్‌లోకి ప్రవేశించి సిట్టింగ్ చేయాల్సి ఉంటుంది.

అయినప్పటికీ, నేటికీ అప్పుడప్పుడు కొన్ని చోట్ల ఇలాంటి మానసిక వైపరీత్యాలు,ఉన్మాద చర్యలు పునరావృతమవుతూనే ఉన్నాయి. తాజాగా ఫ్లైదుబాయ్ విమానంలోనూ సరిగ్గా అలాంటి ఘటనే ఎదురైంది. కానీ, కెప్టెన్ స్మిత్ మచ్చర్ చూపిన అప్రమత్తత, తెగింపు వలనే వందలాది ప్రాణాలు అప్పట్లో గాల్లోనే గాల్లోనే కలిసిపోకుండా మిగిలాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement