ఆకాశంలో వేల అడుగుల నుంచి అమాంతం కిందకు జారిన విమానం.. కాక్‌పిట్‌లో రక్తపు మడుగులో పైలట్.. మరో పైలట్ విమానాన్ని నేలవైపు మళ్లించే ప్రయత్నం.. బయట ప్రయాణికుల హాహాకారాలు.. ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి. అలాంటి సమయంలో కొందరు ప్రయాణికులు ప్రాణాలకు తెగించి కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లారు. సమయస్ఫూర్తిని ప్రదర్శించి.. చివరకు 174 మంది ప్రాణాలతో బయటపడగలిగారు. దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఈ ఘటనలో ఇప్పుడు ఐదుగురిని హీరోలుగా కొనియాడుతున్నారు.
విమానంలో ప్రయాణిస్తున్న ఒమన్‌కు చెందిన కో–పైలట్.. భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసి కత్తితో పొడిచినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చార్ కాక్‌పిట్ తలుపును తెరవగలిగారు. దీంతో బయట ఉన్న ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లే అవకాశం లభించింది. ఇదే సమయంలో విమానం వేల అడుగుల ఎత్తును అత్యంత వేగంగా కోల్పోయింది. చివరకు ప్రయాణికులు, సిబ్బంది కలిసి కో–పైలట్‌ను అదుపులోకి తీసుకోవడం, విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ‘హమ్మయ్యా’ అనుకున్నారు.
భారత పైలట్‌కు ప్లంబర్ ధైర్యం
ఇజ్రాయెల్‌కు చెందిన ప్లంబర్ యానివ్ హయూన్ ఈ ఘటనలో కీలకంగా వ్యవహరించారు. గాయపడిన మచ్చార్‌కు సాయం చేసిన అతను.. రక్తపు దుస్తులతోనే ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టాడు. నేరుగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కలిసి జరిగింది వివరించారు. మచ్చార్ గాయపడినప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరవడం వల్లే మిగతావారు లోపలికి వెళ్లగలిగారని హయూన్, నెతన్యాహుతో చెప్పారు. దీంతో ఆయన మచ్చార్‌ను ప్రశంసించారు. ఆ సమయంలో జరిగింది ఏంటో ఆయన మీడియాకు వివరించారు.
AMAFOTO: Minisitiri w'Intebe wa Israel, @netanyahu, yashimiye Yaniv Hayoun, umwe mu bagenzi bafashije guhagarika ishimutwa ry’indege ya @flydubai no gusubiza indege ku murongo.
Hayoun yavuze ko yinjiye mu cyumba cy’abapilote, afata umupilote wungirije wari ku bikoresho... pic.twitter.com/kPyGvitwE6— BIGEZWEHO TV (@bigezweho_tv) October 1, 2026
కాక్‌పిట్‌లోకి వెళ్లిన ఆయన.. తీవ్రంగా గాయపడి నేలపై పడివున్న మచ్చార్‌ను చూసి ‘‘నువ్వు చనిపోవు బ్రో.. నీకేం కాదు’’ అంటూ ధైర్యం చెప్పారు. అనంతరం కో–పైలట్‌ను వెనక్కి లాగి కాక్‌పిట్ నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. విమానం అదుపు తప్పుతున్న సమయంలో కంట్రోల్ స్టిక్‌ను వెనక్కి లాగి దాన్ని స్థిరీకరించేందుకు కూడా హయూన్ ప్రయత్నించారు.
Il premier israeliano Benjamin Netanyahu ha incontrato Yaniv Hayoun, passeggero del volo FlyDubai atterrato in emergenza in Arabia Saudita dopo che un pilota avrebbe aggredito un collega.
Netanyahu ha definito Hayoun un eroe per aver contribuito a neutralizzare l'aggressore. pic.twitter.com/lIEXD38d1u— LaPresse (@LaPresse_news) October 1, 2026
ఇక్కడే ఓ ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. విమానం కంట్రోల్స్‌ను ఎలా ఆపరేట్ చేయాలో తనకు పెద్దగా తెలియదని చెబుతున్న హయూన్.. టీవీలో వచ్చే ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్(Air Crash Investigation) కార్యక్రమం చూసిన అనుభవం గుర్తొచ్చిందని చెప్పారు. ‘‘నేను ఆ షో చూస్తుంటాను’’ అంటూ నెతన్యాహుతో జరిగిన భేటీలో ఆయన చెప్పడం.. చిరునవ్వులు చిందించడం ఇప్పుడు వైరల్‌గా మారింది.
బ్యాంకర్.. బిజినెస్‌మన్ కూడా రంగంలోకి
కో–పైలట్‌ను అదుపులోకి తీసుకోవడంలో మరో ఇద్దరు ఇజ్రాయెలీ ప్రయాణికులు జ్వికా మానెస్, అసఫ్ రాజువాన్ కీలకంగా వ్యవహరించారు. బ్యాంక్ లియూమి అండర్‌రైటింగ్ కంపెనీ సీఈవో అయిన మానెస్.. విమానంలో ఇచ్చిన హెడ్‌ఫోన్ కేబుళ్లతో దాడి చేసిన వ్యక్తిని కట్టేసినట్లు చెప్పారు. విమానం వేగంగా కిందికి దూసుకెళ్తుండగా ప్రయాణికులు భయంతో కేకలు వేస్తున్నారని ఆయన వివరించారు. ఇన్సూరెన్స్ ఏజెన్సీ నిర్వహించే రాజువాన్ కూడా కాక్‌పిట్‌లోకి వెళ్లి కో–పైలట్‌ను అదుపులోకి తీసుకోవడంలో సహకరించారు. కొంతసేపు అతడిని అదుపులోనే ఉంచి, విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యే వరకు పరిస్థితిని అదుపులో ఉంచినట్లు ఆయన తెలిపారు.

డెంటిస్ట్ ప్రాణదాతగా..
ఈ ఘటనలో డాక్టర్ షోటా ముసాయెవ్ పాత్ర కూడా కీలకంగా మారింది. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన తీవ్రంగా గాయపడిన కెప్టెన్ మచ్చార్ వద్దకు వెళ్లారు. తలకు, చేతులకు తీవ్ర గాయాలై రక్తస్రావం అవుతున్న మచ్చార్‌కు ప్రాథమిక వైద్యం అందించి రక్తస్రావాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యే వరకు ఆయన పరిస్థితిని స్థిరంగా ఉంచడంలో ముసాయెవ్ సహకరించారు.
ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు కూడా..
కాక్‌పిట్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు కంట్రోల్స్ చేపట్టారు. వారి సహాయంతో విమానం మళ్లీ స్థిరపడింది. అనంతరం అత్యవసర పరిస్థితిని ప్రకటించి సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించారు. అలా విమానంలోని మొత్తం 174 మంది సురక్షితంగా బయటపడ్డారు. లేకుంటే మరో 9/11 అయ్యేది.
హెర్జోగ్ కీలక నిర్ణయం
ఈ ఘటనలో ప్రాణాలకు తెగించి స్పందించిన నలుగురు ఇజ్రాయెలీలకు దేశ అత్యున్నత పౌర వీరత్వ పురస్కారానికి సిఫార్సు చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ప్రకటించారు. యానివ్ హయూన్, జ్వికా మానెస్, అసఫ్ రాజువాన్, డాక్టర్ షోటా ముసాయెవ్‌ల పేర్లను ఆయన సిఫార్సు చేశారు. కాక్‌పిట్‌లోకి వెళ్లి దాడిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, విమానాన్ని స్థిరీకరించడం, తీవ్రంగా గాయపడిన పైలట్‌కు ప్రాణరక్షక వైద్యం అందించడం వంటి చర్యలను హెర్జోగ్ ప్రశంసించారు.
ఫ్లైదుబాయ్ ఘటన వెనుక కో–పైలట్ ఉద్దేశం ఏమిటన్నది ఇంకా దర్యాప్తులోనే ఉంది. ఫ్లైదుబాయ్ కూడా అధికారులతో కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఘటన అనంతరం FZ1073 టబుక్‌లో సురక్షితంగా దిగిందని, ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని సంస్థ అధికారికంగా వెల్లడించింది.
ఇదీ చదవండి: కెప్టెన్ మచ్చార్.. యూ ఆర్ రియల్ హీరో


