తిరువనంతపురం: భారతీయ పౌరులను వివాహం చేసుకున్నంత మాత్రాన ఏ విదేశీయులకు కూడా దేశంలోకి ప్రవేశించేందుకు వీసా పొందే సహజసిద్ధమైన లేదా చట్టబద్ధమైన హక్కు దానంతట అదే లభించదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. భారత పౌరుడిని వివాహం చేసుకున్న ఒక పాకిస్థానీ మహిళ, భారతదేశంలో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వీసా దరఖాస్తు చేసుకునే ప్రక్రియ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. విదేశీ పౌరుల రాక, బసను నియంత్రించే పూర్తి సార్వభౌమ అధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని కోర్టు పునరుద్ఘాటించింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాల ప్రకారం.. సదరు పాకిస్థానీ మహిళ ఒక భారతీయ పౌరుడిని దుబాయ్‌లో వివాహం చేసుకుని, ప్రస్తుతం భర్తతో కలిసి విదేశాల్లో నివసిస్తున్నారు. భారతదేశంలో జరిగే ఒక కుటుంబ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆమె వీసా కోసం ప్రయత్నించగా, పాకిస్థానీ పౌరులకు వీసా దరఖాస్తు ప్రక్రియ అందుబాటులో లేకపోవడంతో ఆ దంపతులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తక్షణ అవసరాల కోసం స్వల్పకాలిక వీసాతో పాటు, భారత పౌరుడి భార్యగా తనకు దీర్ఘకాలిక వీసా పొందే అర్హత ఉందని, వీసా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 21 (జీవించే హక్కు)లను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు వాదించారు.
ఈ పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. విదేశీయుల రాక, దేశంలో వారి కదలికలు, తిరిగి వెళ్లడం అనేవి పూర్తిగా ప్రభుత్వ విధానాలు, చట్టాల పరిధిలోని అంశాలని కోర్టుకు నివేదించింది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం తలెత్తిన భద్రతా కారణాల దృష్ట్యా, ఫారెనర్స్ యాక్ట్, 1946 (సెక్షన్ 3) ప్రకారం పాకిస్థానీ పౌరులకు అన్ని రకాల వీసా సేవలను నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ ఉత్తర్వులు ఇప్పటికీ అమల్లోనే ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. విదేశీయుల ప్రవేశాన్ని నియంత్రించే అధికారం కేంద్ర ప్రభుత్వ విశేష సార్వభౌమ అధికారమని, ఇది దేశ భద్రత, సమగ్రత, శాంతిభద్రతలతో ముడిపడి ఉందని పేర్కొంది. భారత పౌరుడిని పెళ్లి చేసుకున్నప్పటికీ, వీసా మంజూరు చేయాలని లేదా కనీసం దరఖాస్తును పరిశీలించాలని డిమాండ్ చేసే చట్టపరమైన హక్కు విదేశీయులకు ఉండదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 14 భారత పౌరులు కానివారికి కూడా వర్తిస్తుందనేది నిజమే అయినప్పటికీ, ఆ వ్యక్తి భారత భూభాగంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ హక్కును పొందగలరని, విదేశాల్లో ఉంటూ భారత్‌లోకి ప్రవేశం కోసం దానిని క్లెయిమ్ చేయలేరని తేల్చిచెబుతూ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఇదీ చదవండి: ‘గోంధాల్’.. మహారాష్ట్రకు గర్వకారణం: సీఎం ఫడ్నవీస్


