హాల్‌మార్కింగ్ ఛార్జీల పెంపుతో నకిలీ ముద్రలు | gold Hallmark Fee Hike Fuels Fake Stamps How to Verify Your Gold | Sakshi
Sakshi News home page

హాల్‌మార్కింగ్ ఛార్జీల పెంపుతో నకిలీ ముద్రలు

Oct 1 2026 9:42 AM | Updated on Oct 1 2026 10:07 AM

gold Hallmark Fee Hike Fuels Fake Stamps How to Verify Your Gold

బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ ఛార్జీలు పెరగడంతో నకిలీ ముద్రలు వాడే అక్రమార్కులు పెరుగుతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వినియోగదారుల అవగాహన తక్కువగా ఉండే టైర్‌-2, 3, 4 నగరాల్లో ఈ ముప్పు అధికమని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ ఛార్జీలను ఆభరణాలు కొనే వినియోగదారులే చెల్లిస్తారు. అయితే, హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ) నంబర్‌ను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్‌) ‘కేర్’ మొబైల్ యాప్‌లో సరిచూసుకోవచ్చన్న విషయం చాలామందికి తెలియదు.

అఖిల భారత రత్నాభరణ మండలి (జీజేసీ) ఛైర్మన్ రాజేశ్ రోక్డే ప్రకారం, దేశంలోని దాదాపు అన్ని జిల్లాల్లో కేవలం 10 శాతమే బీఐఎస్‌ యాప్‌పై తగిన అవగాహన ఉంది. దీంతో హాల్‌మార్కింగ్‌ నమూనాను ఫోర్జరీ చేసే మోసగాళ్లకు వినియోగదారులు సులభంగా చిక్కే ప్రమాదం ఉంది. ఈ అంశాన్ని జీజేసీ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బీఐఎస్‌ దృష్టికి తీసుకెళ్లింది. ఒక్కో ఆభరణానికి ప్రస్తుతం ఉన్న రూ.75 రుసుమును గతంలోని రూ.45కు తగ్గించాలని కోరింది. తాజా సవరణ 66.67 శాతం పెంపునకు సమానమని తెలిపింది.

రూ.400 కోట్లు భారం

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గుర్తింపు పొందిన అస్సేయింగ్‌, హాల్‌మార్కింగ్ కేంద్రాలు 2022 జులైలో 1,220 ఉండగా 2026 జులై నాటికి 1,577కి పెరిగాయి. హెచ్‌యూఐడీతో హాల్‌మార్క్ చేసిన ఆభరణాల సంఖ్య మొత్తం 65 కోట్లు దాటింది. 2025-26లో 13.22 కోట్ల ఆభరణాలకు హాల్‌మార్కింగ్ జరిగింది. కొత్త ధరతో వ్యవస్థపై అదనంగా రూ.400 కోట్లు, దీనికి తోడు సుమారు రూ.80 కోట్ల జీఎస్టీ భారం పడుతుందని జీజేసీ అంచనా.

అదనపు వ్యయం

అదనపు పరికరాలు, సిబ్బంది, ప్రాసెసింగ్‌, నిల్వ వ్యయాలతో కూడిన సమగ్ర వ్యయ అంచనాను ఇవ్వాలని బీఐఎస్‌ను మండలి కోరింది. తప్పనిసరి ఫొటోగ్రఫీకి అయ్యే అదనపు ఖర్చునూ ప్రశ్నించింది. ఫొటోలను కూడా మోసగాళ్లు నకిలీ చేయవచ్చని వాదించింది. అంతేకాక, హాల్‌మార్కింగ్ సమయం ఆరు గంటల నుంచి 24–36 గంటలకు పెరగడంతో వ్యాపారుల నిర్వహణ మూలవ్యయం పెరుగుతుందని పేర్కొంది.

బీఐఎస్ కేర్‌ యాప్ ద్వారా వినియోగదారులు తమ ఆభరణం హాల్‌మార్క్ నిజమైనదో కాదో సులభంగా సరిచూసుకోవచ్చు. ముందుగా దీన్ని గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

  • యాప్‌లో Verify HUID ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

  • ఆభరణంపై ముద్రించిన 6 అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID కోడ్‌ను నమోదు చేయాలి.

  • వెంటనే ఆ ఆభరణానికి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.

ఏ వివరాలు తెలుస్తాయంటే..

  • ఆభరణం రకం (ఉంగరం, గొలుసు వంటివి)

  • బంగారం స్వచ్ఛత (22 క్యారెట్, 18 క్యారెట్ తదితరాలు)

  • హాల్‌మార్కింగ్ చేసిన కేంద్రం (ఏహెచ్‌సీ) వివరాలు

  • జ్యువెలర్ నమోదు వివరాలు

  • హాల్‌మార్కింగ్ చేసిన తేదీ

ఎందుకు ఉపయోగకరం?

హెచ్‌యూఐడీ ప్రతి ఆభరణానికి ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి యాప్‌లో చూపే వివరాలు, మీరు కొన్న ఆభరణం, బిల్లులో ఉన్న వివరాలతో సరిపోలాలి. సరిపోలకపోతే లేదా నంబర్ చెల్లదని చూపితే ముద్ర నకిలీ కావచ్చని అనుమానించాలి. ముఖ్యంగా కొనుగోలు సమయంలోనే దుకాణంలో ఈ పరీక్ష చేసుకోవడం మంచిది. యాప్ ద్వారా ఫిర్యాదు చేసే సౌకర్యం కూడా ఉంది. అలాగే నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన లైసెన్స్ వివరాలను కూడా ఇందులో చూడవచ్చు.

ఇదీ చదవండి: సోషల్‌ మీడియా ఫిర్యాదులకు మోక్షమెప్పుడు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement