చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఉపఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ మంత్రి, సీనియర్ అన్నాడీఎంకే(AIADMK) నేత ఎస్. సెమ్మలై అధికార టీవీకే పార్టీలో చేరారు. టీవీకే పార్టీ అధినేత, సీఎం విజయ్ ధారాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో తన మద్దతుదారులతో కలిసి సెమ్మలై టీవీకే కండువా కప్పుకున్నారు.
తమిళనాడులో ధారాపురం ఉపఎన్నికలో టీవీకే అభ్యర్థి, మాజీ అన్నాడీఎంకే నేత పి. సత్యబామకు మద్దతుగా నిర్వహించిన సభలో వీరి చేరిక జరిగింది. సేలం జిల్లాకు చెందిన సెమ్మలై.. అన్నాడీఎంకేలో సుదీర్ఘకాలం పనిచేశారు. 1984లో తారమంగళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆయన అనంతరం అన్నాడీఎంకేలో చేరారు. 2001లో జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి తనకు టికెట్ దక్కకపోవడంతో సెమ్మలై పార్టీకి దూరమయ్యారు.
Former ADMK Minister Semmalai, who joined @TVKPartyHQ today, met Chief Minister Vijay!
A setback for @EPSTamilNadu ahead of by-polls! pic.twitter.com/IGa6fcsTl3— George (@georgeviews) September 30, 2026
జయలలిత మరణం తర్వాత తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు నిరాకరించారని, ప్రస్తుతం అన్నాడీఎంకేలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఆ పార్టీలో కొనసాగేందుకు తన మనస్సాక్షి అంగీకరించడం లేదని గతంలో ఆయన ప్రకటించారు. ఈ ఏడాది మే నెలలోనే టీవీకేలో చేరే తన నిర్ణయాన్ని సెమ్మలై వెల్లడించారు. తాజాగా టీవీకే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ధారాపురం, మదురాంతకం (ఎస్సీ) నియోజకవర్గాలకు అక్టోబర్ 6న ఉపఎన్నికలు జరగనున్నాయి. అన్నాడీఎంకేకు చెందిన పి. సత్యబామ, మరగతం కుమారవేల్ రాజీనామా చేయడంతో ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ ఉపఎన్నికల్లో టీవీకే తరఫున మాజీ అన్నాడీఎంకే నేత పి. సత్యబామ ధారాపురం నుంచి బరిలో ఉన్నారు.
సీఎం విజయ్ ప్రచారం..
ధారాపురం ఉపఎన్నికలో టీవీకే అభ్యర్థి సత్యబామకు మద్దతుగా విజయ్ బుధవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ నియోజకవర్గం పశ్చిమ తమిళనాడులో అన్నాడీఎంకేకు బలమైన ప్రాంతంగా ఉంది. కాగా, ధారాపురం సభలో సత్యబామ భావోద్వేగానికి గురయ్యారు. తనపై సోషల్ మీడియాలో అవమానకర వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ ఆమె మాట్లాడిన సమయంలో విజయ్ ఆమెను ఓదార్చారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. పీసీసీ చీఫ్ రాజీనామా


