శభాష్‌ వేల్‌ మురగన్‌.. సింగం కాప్‌పై సీఎం విజయ్‌ ప్రశంసలు | cm vijay congratulate head constable velmurugan | Sakshi
Sakshi News home page

శభాష్‌ వేల్‌ మురగన్‌.. సింగం కాప్‌పై సీఎం విజయ్‌ ప్రశంసలు

Sep 29 2026 9:29 PM | Updated on Sep 29 2026 9:36 PM

cm vijay congratulate head constable velmurugan

సాక్షి,చెన్నై: కోయంబత్తూరులో గట్కా స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అత్యంత సాహసోపేతంగా వ్యవహరించిన హెడ్‌ కానిస్టేబుల్ ఎం.వేలుమురుగన్‌ను తమిళనాడు సీఎం విజయ్ అభినందించారు. చెన్నైలోని సచివాలయానికి ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు.

కోయంబత్తూరు జిల్లా కోవిల్‌పాళయం పోలీస్ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వేలుమురుగన్, గత ఆదివారం (సెప్టెంబర్ 27న) తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో కర్ణాటక నుంచి అక్రమంగా నిషేధిత గుట్కా ఉత్పత్తులను తరలిస్తున్న అనుమానాస్పద ఎస్‌యూవీ కారును పోలీసులు ఆపడానికి ప్రయత్నించారు. 

పోలీసులు తనిఖీ చేస్తుండగా, కారులోని నిందితులు ఒక్కసారిగా వాహనాన్ని వేగంగా వెనక్కి తిప్పి పారిపోయేందుకు యత్నించారు. ఆ సమయంలో అప్రమత్తమైన కానిస్టేబుల్ వేలుమురుగన్ క్షణం కూడా ఆలోచించకుండా దూకి, వేగంగా వెళ్తున్న ఆ కారు పైకప్పును గట్టిగా పట్టుకున్నారు. నిందితులు కారును ఆపకుండా సుమారు 40 కిలోమీటర్ల దూరం వరకు వేగంగా పోనిచ్చినా, ప్రాణాపాయాన్ని లెక్కచేయకుండా వేలుమురుగన్ కారు పైకప్పు పైనే వేలాడుతూనే ఉన్నారు.

చివరికి తిరుపూర్ జిల్లా అవినాశి సరిహద్దు ప్రాంతంలో పోలీసులు ఆ కారును అడ్డగించి, మూడేళ్ల నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు భారీగా గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సాహస ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో సాహసం ప్రదర్శించిన కానిస్టేబుల్ వేలుమురుగన్ చూపిన తెగువను, ఆయన డ్యూటీ పట్ల నిబద్ధతను, సమయస్ఫూర్తి  సీఎం విజయ్ కొనియాడారు. భవిష్యత్తులో విధుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయనకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ మహేష్ కుమార్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement