చెన్నై: తమిళనాడులో సినిమాను తలపించేలా సాహసోపేతమైన ఘటన చోటుచేసుకుంది. నిషిద్ధ గుట్కాను అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకునేందుకు ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వేగంగా వెళ్తున్న కారు పైకప్పుపై వేలాడుతూ సుమారు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తమిళనాడు కోయంబత్తూరు సమీపంలోని విళంపరిచి ప్రాంతంలో కోవిల్‌పాళయం పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబరుతో ఉన్న ఓ కారును ఆపి తనిఖీ చేయగా, దాని వెనుక భాగంలో నిషిద్ధ గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులు ఉన్నట్లు గుర్తించారు.
కారు వెనుక ఉన్న పొగాకు ఉత్పత్తులను పరిశీలించేందుకు ఎస్సై ముందుకు వెళ్లగా, కారులో ఉన్న ముగ్గురు నిందితులు పోలీసులను నెట్టేసి, కారుతో పరారయ్యేందుకు ప్రయత్నించారు. నిందితులు కారును వేగంగా పోనిస్తుండగా అప్రమత్తమైన హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ వెంటనే కారు పైకప్పుపైకి దూకి గట్టిగా పట్టుకున్నారు.

కారు వేగంగా వెళ్తున్నప్పటికీ వేల్మురుగన్ ప్రమాదకర రీతిలో కారు పైకప్పుపైనే వేలాడుతూ ప్రయాణించారు. కోయంబత్తూరు సరిహద్దుల మీదుగా సాగిన ఈ కారు ఓ టోల్ ప్లాజా వద్దకు రాగా, డ్రైవర్ ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లించి అక్కడి నుంచి హైవేపై మరింత వేగంగా దూసుకెళ్లాడు. ఈ దృశ్యాన్ని దారిలో వెళ్తున్న వాహనదారులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న సమీప తిరుపూర్ జిల్లా పోలీసులు, ఆంబులెన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలీసులు, ఆంబులెన్సులు కారును నలువైపుల నుంచి చుట్టుముట్టి సుమారు 40 కిలోమీటర్ల దూరం తర్వాత అవినాశి రోడ్డులో ఆ కారును అడ్డుకున్నారు.
కారు నిలిపివేయగానే అందులో ఉన్న నిందితుల్లో ఒకరిని వెంటనే అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారు. అయితే గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఆ ఇద్దరిని కూడా పట్టుకున్నారు. నిందితులను రాజస్థాన్‌కు చెందిన బాಬು ధార (27), రాజేష్ (23), సురేష్‌లుగా గుర్తించారు. బెంగుళూరు నుంచి కోయంబత్తూరుకు ఈ నిషిద్ధ పొగాకు ఉత్పత్తులను అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది.
కారు పైకప్పుపై ప్రాణాలకు తెగించి ప్రయాణించి స్మగ్లర్లను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ ధైర్యసాహసాలను ప్రజలు, ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు.
Headconstable Velmurugan of Kovilpalayam police station in #Coimbatore clung onto the roof rails of an SUV for about 40 km as three men from Rajasthan tried escape from the police with over 250 kg of gutkha. The video was shot by the crew of an NHAI ambulance. @THChennai pic.twitter.com/7pAt9m4ZVd
— Wilson Thomas (@wilson__thomas) September 27, 2026


