మెడనూ మెరిపిస్తుంది..
చర్మ సంరక్షణలో ఎక్కువ శ్రద్ధ ముఖానికే ఇస్తాం. కానీ మెడ, ఛాతీ పైభాగం విషయానికి వస్తే మాత్రం చాలాసార్లు పట్టించుకోం. ఈ సమస్యకు సాంకేతిక పరిష్కారంగా ఇప్పుడు సరికొత్త బ్యూటీ పరికరం అందుబాటులోకి వచ్చింది. అదే ఎల్‌ఈడీ ఈస్తటిక్స్ రూపొందించిన ‘గ్లోటెక్ కాలర్’.
మెడ, ఛాతీ పైభాగానికి కాంతి చికిత్స అందించేలా దీనిని రూపొందించారు. ఈ డివైజ్ ప్రధానంగా రెడ్ లైట్, నియర్ – ఇన్‌ఫ్రారెడ్ లైట్ అనే రెండు రకాల కాంతుల ఆధారంగా పనిచేస్తుంది. రెడ్ లైట్ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తికి తోడ్పడటం ద్వారా ముడతలు, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. అలాగే రెండో రకమైన నియర్ –ఇన్‌ఫ్రారెడ్ లైట్ చర్మంలోకి మరింత లోతుగా వెళ్లి చర్మం సాగే గుణాన్ని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
సహజ జాగ్రత్తలతోనే కేశాలు పదిలం!
హెయిర్ స్టైల్స్ వల్ల జుట్టు ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. పోనీటెయిల్, జడ, బన్ వంటివి చాలా బిగుతుగా కట్టడం వల్ల జుట్టు కుదుళ్లపై ఒత్తిడి పడి తెగిపోతుంటుంది. వీలైనంత వరకు వదులుగా కట్టడం మంచిది. స్ట్రెయిటెనర్, కర్లింగ్ ఐరన్, బ్లో డ్రయ్యర్ వంటి పరికరాలను తరచుగా ఉపయోగించకండి. ఉపయోగించాల్సి వస్తే ముందుగా హీట్ ప్రొటెక్షన్ ను వాడటం మంచిది. తడి జుట్టుని ఎప్పుడూ దువ్వవద్దు.
ఎందుకంటే తడి జుట్టు సులభంగా సాగి తెగిపోతుంది. జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వడం, స్టైల్ చేయడం మంచిది. అలాగే బిగుతైన రబ్బర్ బ్యాండ్లు, పదునైన క్లిప్పులు జుట్టును లాగి తెంచవచ్చు. సాఫ్ట్ హెయిర్ యాక్సెసరీస్‌ని ఉపయోగించడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. పార్టీలు, ప్రత్యేక సందర్భాల్లో హెయిర్ స్టైలింగ్ చేసుకున్నా, రోజువారీగా మాత్రం సహజంగా ఉంచడం మంచిది.
బరువుతో చెలగాటం!
బరువు తగ్గాలంటే ఇప్పుడు డైట్‌లు, వ్యాయామాలు చేస్తున్నారు. కానీ 20వ శతాబ్దంలో మహిళలు సన్నగా కనిపించాలనే కోరికతో పరాన్న జీవి అయినటువంటి టేప్ వార్మ్ గుడ్లను మాత్రల రూపంలో తీసుకునేవారు. ఈ జీవి శరీరంలో పెరిగి ఆహారంలోని పోషకాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని అప్పట్లో నమ్మేవారు.
అనుకున్న బరువుకు చేరుకున్న తరువాత మళ్లీ ఈ జీవులను చంపేసే మందులను తీసుకునే వారు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన పద్ధతి. టేప్‌వార్మ్ వల్ల మెదడులో సిస్టులు, మెదడు వాపు, మూర్ఛ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: 118 కేజీల నుంచి 84 కేజీలకు! జస్ట్ ఆరు నెల్లలోనే..)


