కుక్కకాటుకు తగిన చెప్పుదెబ్బ | Sakshi Editorial Special Story On Rabies Dog Bite First Aid Vaccine World Rabies Day | Sakshi
Sakshi News home page

కుక్కకాటుకు తగిన చెప్పుదెబ్బ

Sep 27 2026 2:07 PM | Updated on Sep 27 2026 2:07 PM

 Sakshi Editorial Special Story On Rabies Dog Bite First Aid Vaccine World Rabies Day

రేబీస్‌... నేటికీ నిర్దిష్టమైన చికిత్స విధానం లేని అత్యంత ప్రాణాంతకమైన జూనోటిక్‌ వ్యాధి. (జంతువుల నుంచి మనుషులకు, అలాగే మనుషుల నుండి జంతువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్స్‌ అంటారు). లూయీ పాశ్చర్‌ 1885లో తొలిసారిగా రేబీస్‌ నిరోధక టీకాను అభివృద్ధి చేశారు.

ఆయన అందించిన ఈ ఆవిష్కరణే నేటికీ మానవాళికి రేబీస్‌ బారినుంచి రక్షణ కల్పించే ఏకైక ఆయుధంగా ఉపయోగపడుతోంది. లూయీ పాశ్చర్‌ వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 28న ‘ప్రపంచ రేబీస్‌ దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ‘కలిసికట్టుగా... మరింత బలంగా’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 59 వేల మంది రేబీస్‌తో మరణి స్తున్నారు. ఇందులో 95 శాతానికి పైగా మరణాలు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే సంభవిస్తున్నాయి. భారత దేశంలో ఏటా సుమారు 5,700 మంది మరణిస్తున్నారని జాతీయ అధ్యయ నాలు స్పష్టం చేస్తున్నాయి. బాధితుల్లో ఎక్కువ శాతం 15 ఏళ్లలోపు పిల్లలే ఉండటం విచారకరం. ఈ నేపథ్యంలో 2030 నాటికి కుక్కల కాటు వల్ల సంభ వించే రేబీస్‌ మరణాలను పూర్తిగా నిర్మూలించాలనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ జంతు ఆరోగ్య సంస్థలు నిర్దేశించుకున్న ‘జీరో బై 30’ ప్రధాన లక్ష్యం.

ఏడాది తర్వాతా బయటపడొచ్చు!
రేబీస్‌ అనేది ‘లైసావైరస్‌’ అనే వైరస్‌ ద్వారా వ్యాప్తి చెంది కేంద్ర నాడీ వ్యవస్థపై దాడి చేసే తీవ్రమైన వ్యాధి. మానవుల్లో నమోదయ్యే రేబీస్‌ కేసుల్లో దాదాపు 99 శాతం కుక కాటు ద్వారానే వస్తున్నాయి. వ్యాధిగ్రస్థ కుక్కలతో పాటు పిల్లులు, నక్కలు, తోడేళ్లు, గబ్బిలాలు వంటి జంతువుల లాలాజలం ద్వారా కూడా ఈ వైరస్‌ శరీరంలోకి ప్రవేశిస్తుంది.

రేబీస్‌ సంక్రమించినప్పుడు జంతువు విపరీతమైన కోపంతో కనిపిస్తుంది. కనపడిన ప్రతి వస్తువును చివరికి చెక్కముక్కలు, రాళ్లను కూడా కొరుకుతుంది. నోటి నుంచి విపరీతంగా లాలాజలం (సొల్లు) కారుస్తుంది. మొరిగే స్వరం మారుతుంది. తన యజమానిని కూడా గుర్తించ లేని స్థితిలో దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కొన్ని సంద ర్భాలలో వ్యాధిగ్రస్థ కుక్క లేదా జంతువు నిశ్శబ్దంగా ఉండి, అంటు డొక్కలు పడి, వెలుతురును కూడా చూడలేని స్థితిలో ఆహారం, నీరు తీసుకోకుండా ఏదైనా ఒక చీకటి లేదా మరుగు ప్రదేశంలో ఉండి దాదాపు వారంలో చనిపోతుంది. దీనినే ‘డంబ్‌ రేబీస్‌’ అంటారు.

అలాగే మనుషులు పిచ్చికుక్క కాటుకు గురైన తర్వాత 2–3 నెలల నుండి ఏడాది లోపు ఎప్పుడైనా రేబీస్‌ లక్షణాలు కనపడవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో సంవత్సరం తర్వాత కూడా ఈ వ్యాధి సంక్ర మిస్తుంది. మనుషులు వ్యాధిగ్రస్థులు అయినపుడు కుక్క కాటు పడిన చోట దురద, మంట, జ్వరం మొదలవుతాయి. వ్యాధి ముదిరిన తర్వాత నీటిని చూస్తే గొంతు కండరాలు బిగుసుకుపోయి భయ పడటం (హైడ్రోఫోబియా), గాలి తగిలినా వణికిపోవడం (ఏరో ఫోబియా), తీవ్రమైన ఆందోళన వంటి నాడీ సంబంధిత సమస్యలు కనిపిస్తాయి. మనిషి గొంతుక మారిపోయి కుక్క వలె అరుస్తూ దాడి చేసేందుకు ప్రయత్నిస్తారు. చివరకు కోమాలోకి వెళ్ళి మరణిస్తారు.

నీటుగా కడగటం అతిముఖ్యం
జంతువు కరిచిన వెంటనే గాయాన్ని ధారాళమైన నీటిధార (రన్నింగ్‌ వాటర్‌) కింద సబ్బుతో కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు రుద్ది కడగాలి. సబ్బులోని క్షారగుణం వైరస్‌ పైపొరను నాశనం చేసి, వైరస్‌ తీవ్రతను దాదాపు 70–80 శాతం అక్కడే తుడిచి పెట్టేస్తుంది. అలాగే గాయంపై కారం, పసుపు, సున్నం, కాఫీ పొడి, ఆకుల పసర్లు వంటివి ఉపయోగించి తమకు తోచిన నాటువైద్యం చేయకూడదు. గాయంపై గట్టిగా కట్టుకట్టడం గానీ, వైద్యుడి సలహా లేకుండా వెంటనే కుట్లు వేయడం గానీ చేయరాదు. ప్రథమ చికిత్స అనంతరం పోవిడోన్‌ అయోడిన్‌ వంటి యాంటీ సెప్టిక్‌ ద్రావణాన్ని పూసి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లి టీకాలు వేయించుకోవాలి.

ఇంట్రామస్కులర్‌ పద్ధతిలో 0, 3, 7, 14, 28వ రోజుల్లో మొత్తం ఐదు డోసులు ఇస్తారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందు బాటులో ఉన్న ఇంట్రాడెర్మల్‌ పద్ధతిలో 0, 3, 7, 28వ రోజుల్లో... మొత్తం నాలుగు మోతాదులుగా టీకాలు వేస్తారు. టీకాలు క్రమం తప్పకుండా వేయించుకోవడం ద్వారా మాత్రమే రేబీస్‌ నుండి రక్షణ పొందవచ్చు.

దీని నిర్మూలన ఒక్క వైద్య, ఆరోగ్య శాఖతోనే సాధ్యం కాదు. పశు సంవర్ధక శాఖ, స్థానిక సంస్థలు, పెంపుడు జంతువుల యజమానులు, బ్లూ క్రాస్‌ తదితర జంతుసంక్షేమ సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలి. ఇళ్లలో పెంచు కునే కుక్కలు, పిల్లులకు వాటి యజమానులు మూడవ నెల వయసులోనే మొదటి మోతాదు రేబీస్‌ టీకా వేయించాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా బూస్టర్‌ డోస్‌ ఇప్పించి రికార్డు లను భద్రపరచాలి.

వీధి కుక్కల నియంత్రణలో భాగంగా స్థానిక సంస్థలు గ్రామ, నగర స్థాయిలలో పెద్ద ఎత్తున ‘యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌’ (ఏబీసీ), సామూహిక రేబీస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలి. వీధి కుక్కలను రాయితో కొట్టడం, వాటి ఆహారాన్ని కదిలించడం లేదా నిద్రిస్తున్నప్పుడు వాటిని భయపెట్టడం చేయకూడ దని పిల్లలకు స్పష్టంగా చెప్పాలి. జంతువుల ఆరోగ్యం, మానవ ఆరోగ్యం పరస్పరం ముడిపడి ఉన్నాయనే ‘వన్‌ హెల్త్‌’ విధానమే రేబీస్‌ రహిత సమాజానికి ఏకైక పరిష్కారం.
– కె. బాలబ్రహ్మం, వెటర్నరీ లైవ్‌ స్టాక్‌ ఆఫీసర్‌ (రిటైర్డ్‌), ఏపీ పశు సంవర్ధక శాఖ (రేపు ప్రపంచ రేబీస్‌ దినం) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement