ఫండే
పిల్లల కథ
అనగనగా వెంకటాపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో రామేశ్వరమ్మ అనే ఇల్లాలు జీవించేది. ఆమె మంచి దైవ భక్తురాలు. అడిగితే లేదనకుండా ఉన్నంతలో దానం చేసేది. ఆమె భర్త ఆమెకు పూర్తి సహకారం అందించేది.
ఒక రోజున ఆ ఊరికి ప్రేమ, ధనం, ప్రతిష్ఠ అనే పేర్లు గల ముగ్గురు సాధువులు వచ్చారు. వారి దినచర్యలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేసేవారు. ఇలా ఒక రోజున ఆ ఊరిలో దైవ భక్తురాలైన రామేశ్వరమ్మ ఇంటికి కూడా వచ్చారు.
‘భిక్షాందేహి’ అంటూ ఇంటి ముందు ఆ సాధువులు నిలబడి అన్నారు. లోపల ఉన్న రామేశ్వరమ్మ గడప వద్దకు వచ్చి, ‘అదేం భాగ్యం అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది కదా!’ అనుకొని ‘‘కొద్దిసేపు ఆగండి. వంటపని ఇంకా పూర్తి కాలేదు. పూర్తి చేసి మీకు భోజనం పెడతాను. ఈలోపు బజారుకు వెళ్లిన మా భర్త కూడా వస్తాడు’’ అని చెప్పి ఆ ముగ్గురు సాధువులను లోపలికి వచ్చి కూర్చోమన్నది.
‘‘ఏం ఫర్వాలేదు. మేము వెలుపల వున్న అరుగు మీద ఎదురుచూస్తూ కూర్చుంటాం. మీ పని కానివ్వండి’’ అని సాధువులు బదులిచ్చారు.
ఈలోగా తన భర్త కూడా బజారు నుంచి ఇంటికి వచ్చాడు. భార్య భర్తతో సాధువులు వచ్చిన సంగతి చెప్పింది. వంట పూర్తి అయింది కదా. వారిని పిలిచి వడ్డించమని భార్యకు చెప్పాడు భర్త.
రామేశ్వరమ్మ బయటకు వచ్చి ఆరుబయట ఎదురు చూస్తున్న సాధువులను ‘భోజనం సిద్ధంగా ఉంది రమ్మ’ని కోరింది.
అయితే ఆ సాధువులు ‘‘ముగ్గురం ఒకేసారి లోపలికి రాకూడదు. మా నియమం ప్రకారం ఒకరి తర్వాత ఒకరం మాత్రమే వస్తాం. ప్రేమ, ధనం, ప్రతిష్ఠ అనే మా ముగ్గురిలో ముందు ఎవరు రావాలో మీరే నిర్ణయించి పిలవండి’’ అని చెప్పారు.
ఈ మాటలు విన్న రామేశ్వరమ్మ లోపలికి వెళ్లి భర్తతో చెప్పింది. భర్త బాగా ఆలోచించి ‘‘ధనం ఉంటేనే కదా! ప్రేమ ప్రతిష్ఠలు కలిగేది. కాబట్టి ముందుగా డబ్బు లేదా ప్రతిష్ఠలలో ఎవరో ఒకరిని పిలువు’’ అని చెప్పాడు.
భర్త మాట ప్రకారం ఆమె వెలుపలికి వచ్చి ముందుగా ఆ ఇద్దరినీ పిలిచింది.
సాధువులు మాత్రం ‘‘ఎవరినో ఒకరిని మాత్రమే పిలవ వలసి ఉంటుంది’’ అని మళ్ళీ చెప్పారు. డబ్బు, ప్రతిష్ఠ అనే మీ ఇద్దరిలో ఎవరో ఒకరు అనేది మీరే నిర్ణయించుకోండి. ఆ ఒక్కరే లోపలికి రమ్మని ఇల్లాలు కోరింది.
‘‘లేదు... లేదు... ఒకరినే పిలవండి’’ అని మళ్ళీ అన్నారు.
రామేశ్వరమ్మ ఆలోచించి ముందుగా డబ్బును ఆహ్వానించింది లోపలికి.
అప్పుడు డబ్బు అనే సాధువు ‘‘అమ్మ! లోకమంతా డబ్బునే రమ్మని ముందుగా ఆహ్వానిస్తున్నారు. లోకమంతా డబ్బుకే దాసోహం అయినట్లు ఇలా పిలవడం సరికాదు కదా! ముందుగా ప్రేమ ఉంటే తర్వాత డబ్బు, ప్రతిష్ఠ వాటంతట అవే వస్తాయి. అందుకే ముందుగా నీవు ప్రేమను పిలిచి ఉంటే మా నియమం ప్రకారం అందరం ఒకేసారి లోపలికి వచ్చేవాళ్ళం. నీ ఆతిథ్యం స్వీకరించే వాళ్ళం. కానీ అలా జరగలేదు’’ అంటూ ముగ్గురు తినకుండానే వెనుదిరిగి పోయారు.
పాపం రామేశ్వరమ్మ జరిగిన విషయాన్ని లోపలికి వెళ్లి భర్తతో చెప్పి బాధపడింది. ముందుగా ఈ లోకంలో అందరూ ప్రేమ కలిగి ఉండాలని భార్యాభర్తలు తమ తమ మనసులో అనుకున్నారు.
పరోపి హితవాన్ బంధుః బంధురప్యహితో పరః
అహితర్దేహజర్వ్యాధి హితోరరణ్యమౌషధం
పరుడైనా మేలు కోరేవాడు బంధువు. బంధువైనా కీడు కోరేవాడు పరుడు. కీడు కోరేవాడు శరీరంలోని రోగం లాంటి వాడు. మేలు కోరేవాడు అరణ్యంలో దొరికే వనౌషధం లాంటి వాడు.
- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి
ఇదీ చదవండి: ఏనుగమ్మో ఏనుగు!


