గుండెపోటు కాదు.. ఆ ఒక్క అనుమానమే కేసును మలుపుతిప్పింది! | Heart Attack Or Murder The Dead Body Revealed The Killer | Sakshi
Sakshi News home page

గుండెపోటు కాదు.. ఆ ఒక్క అనుమానమే కేసును మలుపుతిప్పింది!

Sep 27 2026 11:35 AM | Updated on Sep 27 2026 11:35 AM

Heart Attack  Or Murder The Dead Body Revealed The Killer

ఫండే

క్లూషియల్‌

హైదరాబాద్‌ నగరంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త విక్రమ్‌ అగర్వాల్‌ సాయంత్రం ఆఫీస్‌ నుంచి తన లగ్జరీ కారులో ఒంటరిగా బయలుదేరాడు. దారిలో కాస్త నీరసంగా అనిపించడంతో, కారును రోడ్డు పక్కకు ఆపి డ్యాష్‌బోర్డ్‌ తెరిచి తన గుండెజబ్బు మాత్రల డబ్బా తీసి ఒక క్యాప్సూల్‌ వేసుకున్నాడు. తిరిగి కారు స్టార్ట్‌ చేశాడు.

సరిగ్గా నిమిషం గడిచిందో లేదో, అతని శరీరంలో అనూహ్యమైన మార్పులు ప్రారంభమయ్యాయి. గుండె కొట్టుకునే వేగం అమాంతం పెరిగిపోయి, ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అతని కళ్లలో తీవ్రమైన ఆశ్చర్యం, ప్రాణం పోతుందన్న భయం కనిపించాయి. అప్పటికే స్టీరింగ్‌ మీద నియంత్రణ కోల్పోయిన అతని  కారు పక్కనే ఉన్న డివైడర్‌ను బలంగా తాకుతూ వెళ్లి కీచుమనే పెద్ద శబ్దంతో ఆగింది.
∙∙ 
జనం గుమిగూడారు. పోలీసులు వచ్చారు. క్లూస్‌ టీమ్‌ వచ్చింది. ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యుని చూసి, పోలీసులు సెల్యూట్‌ చేసి పక్కకు తప్పుకున్నారు. ఆగివున్న కారులో బయటకు తలవాల్చి చనిపోయిన అరవైయేళ్ల అగర్వాల్‌ డెడ్‌బాడీ కనిపించింది.
‘ఏమైంది? ముందుగా డెడ్‌బాడీని చూసింది ఎవరు?’ అని అభిమన్యు అడిగాడు.
ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ముందుకొచ్చి, ‘నేనే సార్‌... రోడ్డు పక్కనే ఆగివున్న కారును దగ్గరికొచ్చి చూస్తే, కారు డివైడర్‌ను రాసుకుంటూ వెళ్లింది. లోపల ఆయన చనిపోయి ఉన్నారు’ అని బదులిచ్చాడు.

అతనెవరో తెలుసుకోవడానికి పెద్ద సమయం పట్టలేదు. అది గుండెపోటు మరణం అని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ చెబుతోంది. కానీ అభిమన్యు íసిక్త్స్‌ సెన్స్ మరోటి చెబుతోంది. రోడ్డు పక్కగా ఆగి ఉన్న ఆ కారు డ్రైవర్‌ వైపు గ్లాస్‌ కిందకు దించి ఉండటం, అగర్వాల్‌ తల కొద్దిగా కిటికీలోంచి బయటకు పెట్టి ఉండటం అభిమన్యులో మొదటి అనుమానాన్ని రేకెత్తించింది. గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి కారు గ్లాస్‌ ఎందుకు దించుతాడు? ఎవరికోసమైనా తల బయటకు పెట్టి ఎదురుచూశాడా? ఆయన కళ్ళు ఏదో భయానక, నమ్మలేని విషయాన్ని చూస్తున్నట్లు ఉన్నాయి.

అభిమన్యు ఆ మార్గంలో సీసీటీవీ ఫుటేజ్‌లను తెప్పించాడు. ఆ ఫుటేజ్‌ చూస్తున్న కొద్దీ అభిమన్యు బ్రెయిన్‌ క్రైమ్‌ సీ¯Œ ను రీక్రియేట్‌ చేస్తూనే ఉంది. అగర్వాల్‌ బిజినెస్‌ పార్ట్‌నర్‌ కేతన్‌ను విచారించాడు. లావాదేవీలు, ఫోన్‌ కాల్స్‌ చెక్‌ చేశాడు. మరో అనుమానితుడు అగర్వాల్‌ సెక్రెటరీ భూషణ్‌. అతని ఫోన్‌ కాల్‌ డేటాను పరిశీలించాడు. అగర్వాల్‌ భార్య ఏడాది క్రితమే మరణించింది. దాంతో ఆయన మానసికంగా కుంగిపోయాడు, వారసులు ఎవరూ లేరు.
∙∙ 
‘మిస్టర్‌ అభిమన్యు... అగర్వాల్‌ కేసు క్లోజ్‌ అయినట్టేగా, గుండెపోటు మరణం అని తేలింది కదా!’ అని కమిషనర్‌ అడిగాడు.
‘హంతకుడిని పట్టుకోకుండా కేసు ఎలా క్లోజ్‌ చేస్తాం సర్‌!’ కూల్‌గా అన్నాడు ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు. కమిషనర్‌ మొహంలో ఆశ్చర్యం తొంగి చూసింది.
అప్పుడే లోపలికి వచ్చారు అగర్వాల్‌ బిజినెస్‌ పార్ట్‌నర్‌ కేతన్, సెక్రటరీ భూషణ్‌.
‘సర్‌ మృతదేహాన్ని అప్పగిస్తే మా బాస్‌కి ఘనంగా వీడ్కోలు చెబుతాం’ భూషణ్‌ అన్నాడు.
ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు కేతన్‌ వైపు చూసి, ‘మీరేమంటారు మిస్టర్‌ కేతన్‌’ అని అడిగాడు.
‘ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు సార్‌... ఒక మంచి బిజినెస్‌ పార్ట్‌నర్‌ని, అంతకుమించి మంచి స్నేహితుడిని పోగొట్టుకున్నాను’ బాధగా అన్నాడు కేతన్‌.

‘మరి మీరేం పోగొట్టుకున్నారు మిస్టర్‌ భూషణ్‌... మంచి భవిష్యత్తును, సమాజంలో స్వేచ్ఛగా బతికే జీవితాన్ని పోగొట్టుకున్నారా?’ వ్యంగ్యంగా అడిగాడు అభిమన్యు.
‘అంటే?’ భూషణ్‌ మొహంలో రంగులు మారాయి.
అభిమన్యు అసలు నిజం బయటపెట్టాడు: ‘అగర్వాల్‌ రోజూ వాడే గుండె మాత్రల డబ్బాలో, క్షణాల్లో గుండె వేగాన్ని పూర్తిగా మార్చేయగల ఒక విషపూరిత డ్రగ్‌ను భూషణ్‌ ముందుగానే చేర్చాడు.

పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో నువ్వు తెప్పించిన డ్రగ్‌ ఆనవాళ్లు దొరికాయి. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు కేసును పూర్తిగా మార్చేశాయి. అగర్వాల్‌ కారు ఆగిన క్షణంలోనే, నువ్వు బైక్‌ మీద వేగంగా అక్కడకు చేరుకున్నావు. అగర్వాల్‌ గ్లాస్‌ కిందకు దించి తల బయటకు పెట్టి ‘భూషణ్‌... నువ్వా?’ అని అడుగుతుండగానే, నువ్వు చేసిన మోసాన్ని, ఆస్తులన్నీ నీవే అవుతాయని క్రూరంగా నవ్వుతూ చెప్పావు. దాంతో ఆయన తీవ్ర షాక్‌కు గురయ్యాడు. అతని కళ్ళలో కనిపించిన భయం ఆ నమ్మకద్రోహాన్నే చూపెట్టింది. నీ గురించి ఆరా తీస్తే అగర్వాల్‌ ఆస్తుల్లో కొన్నింటికి నువ్వే బినామీ అని తెలిసింది.

అగర్వాల్‌ ఛస్తే ఆస్తిని కొట్టేయొచ్చని, బినామీ ఆస్తులు నీ సొంతం అవుతాయని ఆలోచించావు కానీ, చేసిన నేరం నుంచి తప్పించుకోలేమని తెలుసుకోలేకపోయావు.’ అని ఆగి అతని మొహంలోకి చూస్తూ,
‘ఆ శవం చెప్పిన సాక్ష్యమే నీ నేరాన్ని పట్టించింది!’ అన్నాడు అభిమన్యు.
∙∙ 
అగర్వాల్‌ మృతదేహం శ్మశానానికి చేరకముందే భూషణ్‌ కటకటాల వెనక్కి చేరాడు.

- శ్రీసుధామయి

ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ శ్మశానం.. ఎందుకు కట్టారో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement