ప్రసవ నొప్పులు రాకపోతే? | Funday Health Advise Story On Labor Induction Pregnancy Delivery Guide | Sakshi
Sakshi News home page

గర్భిణులకు కీలక సమాచారం.. పెయిన్స్‌ రాకపోతే ఇదే ప్రక్రియ!

Sep 27 2026 10:09 AM | Updated on Sep 27 2026 10:09 AM

Funday Health Advise Story On Labor Induction Pregnancy Delivery Guide

ఫండే

హెల్త్‌

సందేహం

నాకు డెలివరీ డేట్‌ వచ్చేసింది. కానీ లేబర్‌ పెయిన్స్‌ రావడం లేదు. సిజేరియన్‌  చేస్తారేమో! అని భయంగా ఉంది.
– వాణి, గుంటూరు.

ఇలాంటి సందేహాలు చాలామంది గర్భిణులకు ఉంటాయి. అయితే నొప్పులు రాకపోయిన ప్రతిసారీ సిజేరియన్‌  చేయాల్సిన అవసరం లేదు. కొన్ని పరిస్థితుల్లో మందుల సహాయంతో లేబర్‌ను ప్రారంభించే ఇండక్షన్‌  ఆఫ్‌ లేబర్‌ పద్ధతిని ఉపయోగిస్తారు. అంటే మందుల సహాయంతో లేబర్‌ పెయిన్స్‌ను ప్రారంభించి, ప్రసవం జరిగేలా చేయడం.

ఇది ఎప్పుడు అవసరం అవుతుంది?
సాధారణంగా తల్లి లేదా బిడ్డకు సంబంధించిన కారణాలు ఉండొచ్చు. ఉదాహరణకు తల్లికి డయాబెటిస్, అధిక రక్తపోటు లేదా కొన్ని ఇతర వైద్య సమస్యలు ఉన్నప్పుడు, బిడ్డ ఎదుగుదల సరిగా లేకపోవడం, ఉమ్మనీరు తక్కువగా ఉండటం వంటి పరిస్థితుల్లో ఇండక్షన్‌ ను పరిగణిస్తాం. డెలివరీ తేదీ దాటిపోయినా పెయిన్స్‌ రాకపోవడం, లేదా ఉమ్మనీరు ముందుగానే పోయి పెయిన్స్‌ ప్రారంభం కాకపోవడం వంటి సందర్భాల్లోనూ ఇండక్షన్‌  అవసరం కావచ్చు.

వేచి చూడవచ్చా?
తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండి ఎలాంటి సమస్యలు లేకపోతే, సాధారణంగా కొంత సమయం వరకు బిడ్డ కదలికలు, ఫీటల్‌ మానిటరింగ్, ఇతర పరీక్షలను గమనిస్తూ ఉంటాం. 40 నుంచి 41 వారాల సమయంలో ఇండక్షన్‌  చేయాలా వద్దా అనేది పరిస్థితిని బట్టి డాక్టర్‌ నిర్ణయిస్తారు. తల్లికి ఉన్న సమస్యలు, వాటి నియంత్రణ, బిడ్డ పరిస్థితి వంటి అంశాలను బట్టి 37, 38 లేదా 39 వారాల్లోనే ఇండక్షన్‌  అవసరం కావచ్చు.

ప్రతి కేసులోనూ ప్రయత్నిస్తారా?
కాదు. బిడ్డ తల కిందకు లేకుండా బ్రీచ్‌ పొజిషన్‌ లో ఉండటం, బిడ్డ అడ్డంగా లేదా వేరే తప్పు పొజిషన్‌ లో ఉండటం, కొన్ని ట్విన్‌  ప్రెగ్నెన్సీ పరిస్థితులు, ప్లాసెంటా చాలా కిందకు ఉండటం వంటి సందర్భాల్లో ఇండక్షన్‌  సరైన ఎంపిక కాకపోవచ్చు.

తప్పకుండా నార్మల్‌ డెలివరీనేనా?
అలా చెప్పలేం. ముందుగా గర్భాశయ ముఖద్వారం అంటే సర్విక్స్‌ ప్రసవానికి ఎంతవరకు సిద్ధంగా ఉందో చూస్తాం. దీనినే సర్వికల్‌ ఫేవరబిలిటీ అంటారు. ఇందుకోసం సాధారణంగా మోడిఫైడ్‌ బిషప్‌ స్కోర్‌ వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. సర్విక్స్‌ మెత్తగా ఉందా, ఎంతవరకు తెరుచుకుంది, బిడ్డ తల ఎంత కిందకు దిగింది వంటి అంశాలను పరిశీలిస్తాం.

ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది?
సాధారణంగా దశలవారీగా చేస్తారు. ముందుగా తల్లి, బిడ్డ పరిస్థితిని పరిశీలిస్తాం. సర్విక్స్‌ సిద్ధంగా లేకపోతే దాన్ని ప్రసవానికి అనుకూలంగా మార్చేందుకు కొన్ని మందులు ఉపయోగిస్తారు. తర్వాత లేబర్‌ పెయిన్స్‌ పెరగడానికి అవసరాన్ని బట్టి మందులు లేదా ఆక్సిటోసిన్‌  డ్రిప్‌ ఇస్తారు. సర్విక్స్‌ కొన్ని సెంటీమీటర్లు తెరుచుకుని, లేబర్‌ ముందుకు సాగుతున్నప్పుడు అవసరమైతే ఆర్టిఫిషియల్‌ రప్చర్‌ ఆఫ్‌ మెంబ్రేన్స్‌  చేస్తారు. అంటే ఉమ్మనీటిని కృత్రిమంగా బయటకు వచ్చేలా చేయడం.

ఇక్కడ ప్రధానంగా మూడు విషయాలను గమనిస్తాం.
1. తల్లి పరిస్థితి, బిడ్డ పరిస్థితి, లేబర్‌ పురోగతి. 
2. తల్లి పల్స్, బీపీ, నీరసం వంటి అంశాలను చూస్తాం. 
3. నొప్పి తగ్గించే సహాయం, ధైర్యం చెప్పడం కూడా చాలా ముఖ్యం.

వీటితో పాటు బిడ్డకు ఫీటల్‌ హార్ట్‌రేట్‌ను గమనిస్తూ ఉంటాం. అలాగే లేబర్‌ పెయిన్స్‌ ఎంత తరచుగా వస్తున్నాయి, ఎంత బలంగా ఉన్నాయి, బిడ్డ తల కిందికి దిగుతోందా, సర్విక్స్‌ తెరుచుకుంటోందా వంటి అంశాలను పరిశీలిస్తాం. అలాగే ఉమ్మనీటి రంగు కూడా గమనించవచ్చు. అది క్లియర్‌గా ఉంటే సాధారణంగా బిడ్డ పరిస్థితి అప్పటివరకు బాగుందని అర్థం. గ్రీన్‌  కలర్‌లో ఉంటే బిడ్డ మెకోనియం పాస్‌ చేసిన అవకాశం ఉండటంతో, డెలివరీని మరింత జాగ్రత్తగా, త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉండొచ్చు.

సమస్యలు ఉంటాయా?
ఇచ్చిన మందులకు ప్రతి ఒక్కరూ ఒకేలా స్పందించరు. కొందరిలో అసలు పెయిన్స్‌ రాకపోవచ్చు. మరికొందరిలో చాలా ఎక్కువగా రావచ్చు. దాంతో బిడ్డ హార్ట్‌రేట్‌పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఉమ్మనీరు ముందుగానే పోవడం లేదా లేబర్‌ సరిగా ముందుకు సాగకపోవడం వల్ల చివరికి సిజేరియన్‌  అవసరం కావచ్చు. అయినప్పటికీ తల్లి, బిడ్డ భద్రత కోసం ఇండక్షన్‌ అవసరమైతే దాని ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం.

చివరగా, ఇండక్షన్‌  అంటే సిజేరియన్‌  తప్పనిసరి అని కాదు. అలాగే ఇండక్షన్‌  చేస్తే నార్మల్‌ డెలివరీ ఖాయం అని కూడా కాదు. తల్లి, బిడ్డ భద్రతే ప్రధానంగా తీసుకుని, ప్రతి కేసుకు అనుగుణంగా డెలివరీ విధానాన్ని డాక్టర్‌ నిర్ణయిస్తారు.

- డా. కప్పగంతుల అపర్ణ, సీనియర్‌ గైనకాలజిస్ట్, అబ్‌స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్‌ సర్జన్, సికింద్రాబాద్‌

ఇదీ చదవండి: ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. ఊపిరితిత్తుల సమస్య!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement