ఫండే
వింతలు విశేషాలు
ఉప్పు అంటే కూరలో చిటికెడు, మిరియాలు అంటే సూప్‌లో కాస్తంత! కానీ అమెరికాలోని లిండా షుల్జ్‌కు మాత్రం ఇవే ప్రపంచ రికార్డుకు కావాల్సినంత సరుకు! 67 ఏళ్ల లిండా ఉప్పు, మిరియాల ప్యాకెట్లను ఎక్కడున్నా వెతికి పట్టుకుని దాచేస్తారు. అలా దాచుకుంటూ పోయి ఏకంగా ప్రపంచ రికార్డునే తన వంటింటి షెల్ఫ్‌పైకి తెచ్చుకున్నారు!
ఇప్పటివరకు 754 జంటలను పోగేశారు. దీంతో అతిపెద్ద ఉప్పు మిరియాల ప్యాకెట్ల సేకరణగా గిన్నిస్ రికార్డును మరోసారి సొంతం చేసుకున్నారు. అంటే మనం రెస్టరెంట్‌లో భోజనం అయిపోయాక టేబుల్‌పై మిగిలిన చిన్న ప్యాకెట్‌ను పట్టించుకోకుండా వదిలేస్తే లిండా మాత్రం వాటితోనే రికార్డు సాధించారు. ఈ రికార్డు లిండాకు కొత్తేమీ కాదు.
2024లో 494 జంటలతో తొలిసారి రికార్డు సాధించిన ఆమెను, మరుసటి ఏడాది 594 జంటలతో సలాక్నిబ్ సోనీ మోలినా దాటేశారు. కానీ లిండా అక్కడితో ఆగలేదు. మళ్లీ ప్యాకెట్ల వేట మొదలుపెట్టి ఈసారి 754 జంటలతో రికార్డును తిరిగి పట్టేశారు! ఆమె సేకరణలో ఎన్నో రకాల డిజైన్లు, ప్రత్యేక ప్యాకెట్లు ఉన్నాయి. అయితే లిండాకు అన్నింటికంటే ఇష్టమైనవి హవాయియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన హవాయియన్ షర్ట్ డిజైన్ నట. మొదట సరదాగా మొదలైన హాబీ... చివరికి గిన్నిస్ రికార్డుగా మారింది.
ఇదీ చదవండి: ఆకాశం నుంచి.. వెండితెర పైకి!


