అలా చెప్పకుండా జారీచేసే ఉత్తర్వులు చెల్లవు
ప్రివెంటివ్ డిటెన్షన్ ఉత్తర్వులపై హైకోర్టు స్పష్టీకరణ
నెల్లూరు కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలు రద్దు
సాక్షి, అమరావతి: ప్రజల ప్రశాంత జీవనానికి ఆటంకాలు కలిగించే నిందితులను ముందుజాగ్రత్తగా అరెస్ట్ చేసి నిర్బంధించడానికి సంబంధించి ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద జారీ చేసే ముందస్తు నిర్బంధ ఉత్తర్వుల్లో సహేతుక కారణాలను పేర్కొని తీరాల్సిందేనని డీటైనింగ్ అథారిటీ అయిన జిల్లా కలెక్టర్లకు హైకోర్టు స్పష్టం చేసింది. అలా కారణాలు లేకుండా జారీ చేసిన ఉత్తర్వులు ఎంతమాత్రం చెల్లుబాటు కావని తేల్చిచెప్పింది. ఒక నిందితుడి విషయమై శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ జారీ చేసిన ముందస్తు నిర్బంధ (పీడీ) ఉత్తర్వులను హైకోర్టు తప్పుపట్టింది. జిల్లా కలెక్టర్ తన పీడీ ఉత్తర్వుల్లో సహేతుక, సంతృప్తికరమైన కారణాలను పేర్కొనలేదని స్పష్టం చేసింది.
జిల్లా కలెక్టర్ 2025 డిసెంబర్ 2న పీడీ ఉత్తర్వులను, ధ్రువీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీచేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. నిందితుడిని తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ చింతలపూడి పురుషోత్తం కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ కేసు అంశాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఇతర జిల్లాల పరిధిలో నేరాలకు పాల్పడిన నిందితులపై నమోదైన కేసులను పరిగణనలోకి తీసుకునే సమయంలో, ఆ ఘటనలు తమ జిల్లా పరిధిలో ప్రజా జీవనానికి, శాంతి భద్రతలకు ఏ విధంగా విఘాతం కలిగిస్తాయన్న విషయాన్ని డిటెన్షన్ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనాల్సిందేనని స్పష్టం చేసింది.


