షుగర్‌ ఫ్యాక్టరీస్‌.. ఫర్‌ సేల్‌! | Chandrababu Govt Plans to scam Rs 3,000 crore worth lands and assets | Sakshi
Sakshi News home page

షుగర్‌ ఫ్యాక్టరీస్‌.. ఫర్‌ సేల్‌!

Sep 27 2026 5:30 AM | Updated on Sep 27 2026 5:30 AM

Chandrababu Govt Plans to scam Rs 3,000 crore worth lands and assets

రూ.3 వేల కోట్ల విలువైన భూములు, ఆస్తులు కొట్టేసేందుకు కుట్రలు

భీమ్‌సింగ్, ఏటికొప్పాక, తాండవ షుగర్, శ్రీవెంకటేశ్వర, చిత్తూరు, కోవూరు, తుమ్మపాల, కడప, జంపని ఫ్యాక్టరీలకు లిక్విడేషన్‌ 

జాతీయ రహదారుల పక్కనే ఉన్న ఈ ఫ్యాక్టరీల 770.59 ఎకరాల భూములపై కన్ను  

ఇటీవలే మూతపడేలా చేసిన చోడవరం ఫ్యాక్టరీని కూడా లిక్విడేషన్‌ చేసేందుకు సిద్ధం.. తన అనుయాయులకు కారుచౌకగా కట్టబెట్టేలా కుతంత్రం 

గతంలో బాబు నిర్వాకంతో మూతపడిన 4 ఫ్యాక్టరీలను తెరిపించిన ఘనత వైఎస్సార్‌దే  

చంద్రబాబు బకాయిపెట్టిన బకాయిలు రూ.450 కోట్లకు పైగా చెల్లించిన వైఎస్‌ జగన్‌ 

ఈ కర్మాగారాలను సహ ఉత్పత్తి పరిశ్రమలు, ఆహారశుద్ధి పరిశ్రమలుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు ప్రణాళిక  

ఇందుకు భిన్నంగా కమీషన్లు దండుకొని పప్పుబెల్లాలకు తన వాళ్లకు అప్పనంగా దోచి పెట్టేందుకు బాబు సన్నాహాలు  

సర్కారు తీరుపై రైతులు, రైతు సంఘాల నేతల ఆగ్రహం.. ఉద్యమానికి సిద్ధం  

⇒ సహకార రంగంలో ఉన్న డెయిరీలనే కాదు.. చక్కెర కర్మాగారాలకు సైతం సమా«ధి కట్టిన చరిత్ర చంద్రబాబుదే. 
⇒ 1995కు పూర్వం 11 సహకార, 19 ప్రైవేటు చక్కెర కర్మాగారాలుండేవి. 
చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే చిత్తూరు, రేణిగుంట, కోవూరు, ఎన్‌వీఆర్‌ అండ్‌ ఏడీఆర్‌ జంపని సహకార చక్కెర కర్మాగారాలను మూసేయించారు. ఆ తర్వాత  వైఎస్సార్‌ అధికారంలోకి వచ్చీరాగానే వాటిని పునరుద్దరించారు. వాటికి ఆర్ధిక చేయూతనిచ్చి లాభాల బాట పట్టేలా చేశారు. 
⇒ చంద్రబాబు 2019లో వెళ్తూ వెళ్తూ అనకాపల్లి జిల్లా వీవీ రమణ షుగర్స్‌ (తుమ్మపాల)ఫ్యాక్టరీని మూతేయించారు.  
⇒ మూతపడిన 9 పరిశ్రమలను పునరుద్ధరించడానికి ఒక్కో చక్కెర కర్మాగారానికి రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు అవసరం. ఆ దిశగా చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదు. చెరకు రైతులను, కార్మికు లను ఆదుకుందామనే ఉదార బుద్ధీ లేదు. 
⇒ 9 చక్కెర కర్మాగారాలకు సంబంధించి రూ.2,500 కోట్ల విలువైన 771 ఎకరాల భూములపై సర్కారు కన్ను పడింది. వాటిలోని యంత్రాలు, ఇతర సామగ్రిని కలిపితే మొత్తం ఆస్తుల విలువ రూ.3 వేల కోట్లకు పైమాటే. వీటికి ఉన్న అప్పులు రూ.1300 కోట్లకు మించిలేవు. ఈ లెక్కన సర్కారు కుతంత్రం ఏమిటో ఇట్టే తెలుస్తోంది. ఈ ఫ్యాక్టరీలకు లిక్విడేషన్‌ ప్రక్రియ చేపట్టడం పట్ల ఉద్యమించడానికి రైతులు సిద్ధమవుతున్నారు.  

సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రంలో నిజాం షుగర్స్, ఆల్విన్‌ వంటి 53 ప్రభుత్వ రంగ సంస్థలను అస్మదీ­యులకు ధారాదత్తం చేసిన చంద్రబాబు తాజాగా రూ.3 వేల కోట్ల విలువైన 9 సహకార చక్కెర కర్మాగా­రాల భూములు, ఆస్తులను కారుచౌకగా అనుయా­యులకు తెగనమ్మేందుకు సిద్ధమయ్యారు. ఇదే లక్ష్యంతో ప్రస్తుత చంద్రబాబు సర్కారు మూడు కర్మాగారాలకు నేరుగా లిక్విడేషన్‌ (పరిశ్రమను శాశ్వతంగా మూసేసి ఆస్తులు తెగనమ్మడం) ప్రకటించగా, మరో ఐదు కర్మాగారాలకు లిక్విడేషన్‌ ప్రకటించేందుకు ఆదేశాలు జారీ చేసింది. కడప ఫ్యాక్టరీకి ఇదివరకే లిక్విడేషన్‌ ప్రకటించింది. పొరుగునున్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉత్పత్తి పరివర్తన ప్రోత్సాహకం (టీపీఐ– ట్రాన్సిషన్‌ ప్రొడక్షన్‌ ఇన్సెంటివ్‌) కింద ఆర్థిక చేయూతనిస్తూ చెరకు రైతులకు భరోసా కల్పిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం ఏకంగా టన్నుకు రూ.600 ఇవ్వడమే కాకుండా, కనీస మద్దతు ధరగా ఈ ఏడాది రూ.4 వేలు నిర్ణయించి చెరకు రైతులకు అండగా నిలుస్తుంటే.. ఒకప్పుడు దక్షిణాదిన చెరకు సాగుకు కేరాఫ్‌గా నిలిచిన ఏపీలో మాత్రం చంద్రబాబు సర్కారు చెరకు రైతులను పీకనులిమే కార్యక్రమాలకు తెగబడింది. అధికారంలోకి వచ్చింది మొదలు ప్రభుత్వ భూములను తమ తాబేదార్లకు కారుచౌకగా కట్టబెడుతున్న చంద్రబాబు బృందం.. అదే బాటలో చక్కెర కర్మాగారాల భూము­లు, ఆస్తులను కూడా గుటకాయ స్వాహా చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. కమీషన్లు దండుకుని  తన వాళ్లకు పప్పు బెల్లాల్లా దోచిపెట్టేందుకు సిద్ధమవుతోంది. దాదాపు రూ.2,500 కోట్ల విలువైన భూములతో పా­టు దాదాపు రూ.500 కోట్లకు పైగా విలువైన మిష­నరీ, ఇతర విలువైన ఆస్తులను సైతం దొడ్డి దారిన కాజేయాలని బాబు సర్కారు ఎత్తుగడ వేసింది. 

చక్కెర కర్మాగారాలకు సమాధి కట్టింది చంద్రబాబే
రాష్ట్రంలో సహకార రంగంలో ఉన్న డెయిరీలనే కాదు.. చక్కెర కర్మాగారాలకు సైతం సమా«ధి కట్టిన చరిత్ర చంద్రబాబుదే. 1995కు పూర్వం 11 సహకార, 19 ప్రైవేటు చక్కెర కర్మాగారాలుండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే చిత్తూరు, రేణిగుంట, కోవూరు, ఎన్‌వీఆర్‌ అండ్‌ ఏడీఆర్‌ జంపని సహకార చక్కెర కర్మాగారాలను మూసేయించారు. ఆ తర్వాత  వైఎస్సార్‌ అధికారంలోకి వచ్చీరాగానే వాటిని పునరుద్దరించారు. వాటికి ఆర్ధిక చేయూతనిచ్చి లాభాల బాట పట్టేలా చేశారు. చంద్రబాబు..  2019లో వెళ్తూ వెళ్తూ అనకాపల్లి జిల్లా వీవీ రమణ షుగర్‌ (తుమ్మపాల) ఫ్యాక్టరీని మూతేయించారు. సహకార రంగంలో నడుస్తున్న ఏకైక షుగర్‌ ఫ్యాక్టరీ అయిన చోడవరం షుగర్స్‌ (గోవాడ)లో 2025­–26లో క్రషింగ్‌ నిలిపి వేసి మూతపడేలా చేశారు. దీంతో సహకార రంగంలో ఉన్న కర్మాగారా­లన్నీ శాశ్వతంగా మూత పడినట్లైంది. చంద్రబాబు దివాళ కోరు చర్యల కారణంగా ప్రైవేటు రంగంలో నడిచే 16 ప్రైవేటు కర్మాగారాలు సైతం మూత పడ్డాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లా ఉయ్యూరు, చిత్తూరులోని నింద్ర, శ్రీకాకుళం జిల్లాలోని సంకలి షుగర్‌ ఫ్యాక్టరీలు మాత్రమే అరకొర క్రషింగ్‌తో ప్రైవేటు రంగంలో కొనసాగుతున్నాయి. అది కూడా 45 లక్షల టన్నుల క్రషింగ్‌ సామర్థ్యం కల్గిన ఈ కర్మాగారాలు కేవలం 12 లక్షల టన్నులకు మించి క్రషింగ్‌ చేయలేని స్థితికి చేరాయి. ఒకప్పుడు దాదాపు 3 లక్షల ఎకరాల్లో సాగైన చెరకు ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 45 వేల ఎకరాలకు పరిమితమైందంటే చంద్రబాబు నిర్వాకమేనని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 

 ఇటీవలే మూతపడిన చోడవరం కో ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ (గోవాడ)   

రూ.800 కోట్లు ఖర్చు చేస్తే పూర్వ వైభవం 
మూతపడిన 8 పరిశ్రమలను పునరుద్ధరించడానికి ఒక్కో చక్కెర కర్మాగారానికి రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు అవసరం. ఈ లెక్కన రూ.800 కోట్ల వరకు ఖర్చు పెడితే వీటికి పూర్వ వైభవం వస్తుందనేది సుస్పష్టం. కానీ ఆ దిశగా చంద్రబాబు ఏనాడు ఆలోచన చేసిన పాపాన పోలేదు. మరొక వైపు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా బోనస్‌ ప్రకటిస్తే రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా చెరకు రైతులకు ఆదాయం పెరగడమే కాకుండా కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ఇవేమీ పట్టని చంద్రబాబు సర్కారు లిక్విడేషన్‌కు తెరతీసింది. భీమ్‌సింగ్, ఏటికొప్పాక, తాండవ షుగర్‌ ఫ్యాక్టరీలకు నేరుగా లిక్విడేషన్‌కు అనుమతిచ్చింది. శ్రీవెంకటేశ్వర, చిత్తూరు, కోవూరు, తుమ్మపాల, జంపని ఫ్యాక్టరీలను సైతం లిక్విడేషన్‌ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే మూత పడేలా చేసిన చోడవరం ఫ్యాక్టరీని కూడా లిక్విడేషన్‌ చేసేందుకు సిద్ధమైంది. కడప ప్యాక్టరీకి ఇదివరకే లిక్విడేషన్‌ ప్రకటించింది. కార్మికులు, అన్నదాతల ప్రయోజనాలకు గండి కొడుతూ దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ కర్మాగారాలను కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడానికి సిద్ధపడింది. 10 వేల టన్నుల క్రషింగ్‌ సామర్థ్యం ఉన్న ఈ కర్మాగారాల్లో 1,944 మందికి పైగా కార్మికులు ఉన్నారు. 65 వేల మందికి పైగా రైతులు చెరకు సరఫరా చేస్తున్నారు.

అన్నదాతల్లో తీవ్ర ఆగ్రహం 
లిక్విడేషన్‌ ఇచ్చేసిన ఎనిమిది చక్కెర కర్మాగారాలు ఆయా జిల్లాల్లో జాతీయ రహదారుల పక్కనే ఉన్నాయి. వీటికి సుమారు 771 ఎకరాల భూములు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో ఎకరం విలువ రూ.10 కోట్ల వరకు ఉంది. ఈ లెక్కన వాటి ధర మొత్తంగా దాదాపు రూ.2,500 కోట్ల పైమాటే. వాటిలోని యంత్రాలు, ఇతర సామగ్రిని కలిపితే కర్మాగారాల మొత్తం ఆస్తుల విలువ రూ.3 వేల కోట్లకు పైగానే ఉంది. వీటికి ఉన్న అప్పులు దాదాపు రూ.1300 కోట్లకు మించి లేవు. అయితే ప్రభుత్వం వీటికి లిక్విడేషన్‌ ప్రక్రియ చేపట్టడం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మూత పడిన చక్కెర కర్మాగారాలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తామంటూ ఎన్నికలప్పుడు నమ్మబలికి, ఓట్లు దండుకున్న చంద్రబాబు.. ఇప్పుడు కర్మాగారాలను పూర్తిగా మూత వేయడమే కాకుండా వాటి భూములు, ఆస్తులు కొల్లగొట్టాలని చూస్తుండడం పట్ల మండిపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయా ఫ్యాక్టరీల పరిధిలోని రైతులు, రైతు సంఘాలు ఆందోళన బాట పడుతున్నాయి.

అండగా నిలిచిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 
సహకార చక్కెర కర్మాగారాలకు సంబంధించి బాబు ఎగ్గొట్టిన బకాయిలతో సహా ఐదేళ్లలో రైతులకు రూ.93.56 కోట్లు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెల్లించి అండగా నిలిచింది. చోడవరం, విజయరామ, తాండవ, ఏటికొప్పాక ఫ్యాక్టరీలు ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన రుణ బకాయిలు రూ.252.91 కోట్లను సైతం చెల్లించింది. ఉద్యోగుల బకాయిలు రూ.100 కోట్లకు పైగా చెల్లించింది. మొత్తంగా రూ.450 కోట్లు చె­ల్లించి అండగా నిలిచింది. చెరకు రైతులకు వైఎ­స్సార్‌ రైతు భరోసా కింద ప్రతి ఏటా మూడు వి­డ­తల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించింది. పంట నష్ట పరిహారంతో పాటు సున్నా వడ్డీ రాయితీ, పైసా భారం పడకుండా పంటల బీమా పరిహారం అందించింది. మరో వైపు మంత్రి వర్గ ఉప సంఘం సిఫార్సుల మేరకు బాబు హయాంలో మూత పడిన అనకాపల్లి, తాండవ, ఏటికొప్పాక, విజయ రాయ కర్మాగా­రా­లతో పాటు గతంలో బాబు నిర్వాకంతో మూత పడిన ఇతర సహకార చక్కెర కర్మాగారాల ఆస్తులు పూ­ర్తిగా రైతులకు మాత్రమే చెందాలన్న సంకల్పంతో వీటిని ఆహార శుద్ధి పరిశ్రమలుగా మార్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. స్థాని­కంగా లభించే పంట ఉత్పత్తులను ప్రాసెసింగ్‌ చేయడం ద్వారా వాటికి అదనపు విలువ చేకూ­ర్చి, తద్వారా రైతులకు అదనపు లబ్ధి చేకూర్చా­లని సంకల్పించింది. పైగా ఈ పరిశ్రమలన్నింటినీ ప్రభుత్వమే స్వయంగా నిర్మించి.. లీజు పద్ధతిన వాటి నిర్వహణను మాత్రమే ఆసక్తి గల రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అప్పగించాలని యో­చించింది. కర్మాగారాల ఆస్తులపై కానీ, స్థలాల­ను లీజుకిచ్చే ఆలోచన కూడా చేయలేదు.

అప్‌గ్రేడ్‌ చేయాలిలా
⇒ చక్కెర తయారీతో పాటు చెరకుపిప్పి ఆధారిత సహ ఉత్పత్తి, విద్యుత్‌ ఉత్పత్తి, ఇథనాల్, బయోమాస్, (గ్యాస్‌), బయో ఫెర్టిలైజర్‌ తదితరాలు ఉత్పత్తి చేసేలా అప్‌గ్రేడ్‌ చేయాలి. విద్యుత్‌ను సొంత అవసరాలకు ఉపయో­గించుకుని, మిగతాది గ్రిడ్‌కు విక్రయించవచ్చు.

⇒ చెరకు రసం నుంచి పంచదార తయారీలో మిగిలి పోయిన ద్రావణం నుంచి జ్యూస్, బిృహెవీ, సిృహెవీ మొలాసిస్‌ తయారు చేయొచ్చు.

⇒ క్రషింగ్‌ సీజన్‌ ముగిశాక కూడా బాయిలర్‌ను ఉపయోగించి విద్యుత్‌ ఉత్పత్తి చేసి విక్రయించవచ్చు.

⇒ సీబీజీ (బయోగ్యాస్‌ తయారీ). ఇది చూడటానికి, వాడటానికి మనం వాహనాలకు వాడే సీఎన్‌జీ (కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) లాగే ఉంటుంది. మంచి ప్రత్యామ్నాయ ఇంధనంగా పని చేస్తుంది. వీటన్నింటి ద్వారా అదనపు ఆదాయ మార్గాలు సృష్టించాలి.

రాష్ట్రంలోని 11 సహకార చక్కెర కర్మాగారాల పరిస్థితి.. 
1. చోడవరం కో–ఆపరేటివ్‌ షుగర్స్‌ లిమిటెడ్, గోవాడ, అనకాపల్లి జిల్లా (2025–26 క్రషింగ్‌ సీజన్‌ నుంచి పని చేయడం లేదు)
2. ఆమదాలవలస కో–ఆపరేటివ్‌ షుగర్స్‌ లిమిటెడ్, ఆమదాలవలస,  శ్రీకాకుళం జిల్లా (సుప్రీంకోర్టులో వ్యాజ్యం) 
3. శ్రీ విజయరామ గజపతి కో–ఆపరేటివ్‌ షుగర్స్‌ లిమిటెడ్, భీమసింగి, విజయనగరం జిల్లా (లిక్విడేషన్‌)    
4. ఏటికొప్పాక కో–ఆపరేటివ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొసైటీ లిమిటెడ్, దార్లపూడి, అనకాపల్లి జిల్లా (లిక్విడేషన్‌)
5. తాండవ కో–ఆపరేటివ్‌ షుగర్స్‌ లిమిటెడ్, పాయకరావుపేట, అనకాపల్లి జిల్లా (లిక్విడేషన్‌)
6. ఎన్‌వీఆర్‌ అండ్‌ ఏడీఆర్‌ కో–ఆపరేటివ్‌ షుగర్స్‌ లిమిటెడ్, జంపని, బాపట్ల జిల్లా (లిక్విడేషన్‌)
7. కడప కో–ఆపరేటివ్‌ షుగర్స్‌ లిమిటెడ్, తౌలతాపురం, వైఎస్సార్‌ కడప జిల్లా (లిక్విడేషన్‌)
8. అనకాపల్లి వి.వి.రమణ కో–ఆపరేటివ్‌ షుగర్స్‌ లిమిటెడ్, తుమ్మపాల, అనకాపల్లి జిల్లా (లిక్విడేషన్‌)
9. కోవూరు కో–ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ లిమిటెడ్, నెల్లపోరె, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా (లిక్విడేషన్‌)
10 శ్రీ వెంకటేశ్వర కో–ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ లిమిటెడ్, గాజులమండ్యం, తిరుపతి జిల్లా (లిక్విడేషన్‌)
11. చిత్తూరు కో–ఆపరేటివ్‌ షుగర్స్‌ లిమిటెడ్, చిత్తూరు, చిత్తూరు జిల్లా (లిక్విడేషన్‌)

రాష్ట్రంలోని 19 ప్రైవేట్‌ చక్కెర కర్మాగారాల పరిస్థితి 
1.    ఈఐడీ ప్యారీ (ఇండియా) లిమిటెడ్, సంకిలి, శ్రీకాకుళం జిల్లా
2.    కేఎస్పీ షుగర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్, వుయ్యూరు, కృష్ణా జిల్లా
3.    ఎస్‌ఎన్‌జే షుగర్‌ అండ్‌ డిస్టిలరీస్‌ లిమిటెడ్, నింద్రా, చిత్తూరు జిల్లా
చంద్రబాబు సర్కారు ప్రోత్సాహం కరువై మూత పడిన కర్మాగారాలు.. 
4. రాయలసీమ షుగర్స్‌ లిమిటెడ్, నంద్యాల జిల్లా 
5. కేబీడీ షుగర్స్‌ అండ్‌ డిస్టిలరీస్‌ లిమిటెడ్, పుంగనూరు, చిత్తూరు జిల్లా    
6. జయపూర్‌ షుగర్స్‌ లిమిటెడ్, చాగల్లు, తూర్పు గోదావరి జిల్లా
7. వీఆర్‌కే షుగర్స్‌ లిమిటెడ్, పోతవరం, పశ్చిమ గోదావరి జిల్లా    
8. ది ఆంధ్రా షుగర్స్‌ లిమిటెడ్, యూనిట్‌–1, తణుకు, పశ్చిమ గోదావరి    
9. డెల్టా షుగర్స్‌ లిమిటెడ్, హనుమాన్‌ జంక్షన్, కృష్ణా జిల్లా 
10. ఎంపీ షుగర్స్‌ లిమిటెడ్, నాయుడుపేట, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు
11. కేఎస్‌ పీ షుగర్స్‌ లిమిటెడ్, లక్ష్మీపురం, కృష్ణా జిల్లా    
12. సుదాలగుంట షుగర్స్‌ లిమిటెడ్, యూనిట్‌–1, బి.ఎన్‌. కండ్రిగ, చిత్తూరు     
13. సుదాలగుంట షుగర్స్‌ లిమిటెడ్, యూనిట్‌–2, పొదలకూరు, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా 
14. శ్రీ సర్వారాయ షుగర్స్‌ లిమిటెడ్, చెల్లూరు, తూర్పు గోదావరి జిల్లా 
15. నవభారత్‌ వెంచర్స్‌ లిమిటెడ్, సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా 
16. ది ఆంధ్రా షుగర్స్‌ లిమిటెడ్, యూనిట్‌–3, భీమడోలు, పశ్చిమ గోదావరిజిల్లా 
17. నాటెమ్స్‌ షుగర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, నింద్రా, చిత్తూరు    
18. ఎన్‌సీఎస్‌ షుగర్స్‌ లిమిటెడ్, విజయనగరం జిల్లా
19. ది ఆంధ్రా షుగర్స్‌ లిమిటెడ్, యూనిట్‌–2, తాడువాయి, పశ్చిమ గోదావరి జిల్లా

చోడవరం క్రషింగ్‌ కొనసాగించాలి
3 ఎకరాల్లో దశాబ్దాలుగా చెరకు సాగుచేసే వాడిని. చోడవరం క్రషింగ్‌ నిలిపి వేయడంతో రెండేళ్లుగా చెరకు సాగును వదిలేశాను. క్రషింగ్‌ నిలిపి వేయడం వల్ల 1,500 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. 24 వేల మంది రైతులతో పాటు దాదాపు లక్ష మందికి పైగా వ్యవసాయ కూలీలకు ఉపాధి లేకుండా పోయింది. ఇప్పటికైనా ఫ్యాక్టరీని పునరుద్ధరించి క్రషింగ్‌ను కొనసాగించాలి.
– సత్యారావు, ఖండిపల్లి, చోడవరం మండలం, అనకాపల్లి జిల్లా

జీవో 250ని వెంటనే రద్దు చేయాలి
రాష్ట్రంలోని 8 సహకార చక్కెర పరిశ్రమలను మూసేస్తూ సహకార చక్కెర పరిశ్రమల ఆస్తులను అమ్మేందుకు తెచ్చిన జీవో 250ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. చెరకు రైతులకు గిట్టుబాటు ధరకు తోడ్పడే రాష్ట్ర సలహా బోర్డును 2002లోనే చంద్రబాబు మూసేశారు. చెరకు పరిశోధన కేంద్రాలకు ఆయనే మంగళం పాడారు. సహకార ఫ్యాక్టరీలు, వాటికి చెందిన భూములు, ఆస్తులన్నీ చెరకు రైతులకు చెందినవే. ఫ్యాక్టరీల జనరల్‌ బాడీ ఆమోదం, సమ్మతి లేకుండా నష్టాల సాకుతో అమ్మడం కుదరదు. ఇది సహకార చట్టాల స్ఫూర్తికి విరుద్ధం. న్యాయ పోరాటం, ఉద్యమాలతో చెరకు కార్మాగారాలను కాపాడుకుంటాం.
– వి.క్రిష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement