సాక్షి, విజయనగరం జిల్లా: చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతులకి నష్టాలేనని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చీపురుపల్లి మండలంలో ఈదురుగాలులకు నేలకు ఒరిగిన బొప్పాయి, అరటి పంటలను బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ పరిశీలించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. అరటి, బొప్పాయి రైతులకు లక్షల్లో పెట్టుబడి నష్టం కలిగిందన్నారు.
‘‘ఈ సర్కార్‌కు దయ దాక్షిణ్యం లేదు. ఎంతసేపు దోచుకోవడమే. మీ ప్రభుత్వం తాలూకా రైతు విధానం ఏంటి? విపత్తుల్లో ప్రభుత్వం ఒక్క రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. చాలా కర్కశంగా ఉంది. బొప్పాయి, అరటికి పెట్టుబడి నష్టం ఇవ్వండి. అరటి, బొప్పాయికి ఎకరాకు లక్ష రూపాయలు ఇవ్వాలి. మొక్కజొన్నకి రూ.50 వేలు ఇవ్వాలి. గత తుపాను నష్టం కూడా ఇప్పుడు కలిపి ఇవ్వాలి’’ అని బొత్స డిమాండ్ చేశారు.
‘‘మూడు రోజులుగా గ్రామాల్లో కరెంటు లేదు.. ఇప్పటికి పునరుద్ధరణ చేయలేదు. కరెంటు ఆగితే ప్రత్యామ్నాయం ఎందుకు చేయలేదు. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలు నష్టం జరిగింది క్రాప్ ఇన్సూరెన్స్ కాకి ఎత్తుకెళ్లిపోయింది. గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టేది. ఈ ప్రభుత్వం కట్టడం లేదు.. ఈ ప్రభుత్వంలో రైతులు ఎలా బతుకుతారు?. ఏమైనా అడిగితే, సమాధానం చెప్పకుండా రాజకీయం చేస్తున్నారు’’ అంటూ బొత్స దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: 8 చక్కెర కర్మాగారాల అమ్మకం


