సాక్షి, ములుగు జిల్లా: వెంకటాపురం మండలంలో గోదావరి ఇసుకపాయలోకి ఒక్కసారిగా భారీగా వరద నీరు రావడంతో కలకలం రేగింది. 80 మంది కూలీలు, రైతులు లంకలో చిక్కుకున్నారు. ఉదయం మిర్చి తోటల్లోకి పనులకు వెళ్లిన కూలీలు, రైతులు గోదావరి అవతలి ఒడ్డున చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ తిరుపతిరెడ్డి, తహశీల్దార్ వేణుగోపాల్ నాటు పడవల సహాయంతో కూలీలు, రైతులను సురక్షితంగా ఒడ్డుకు తరలించారు. గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రైతులు ఎవరు కూడా మిర్చి తోటలకు వెళ్లొద్దని హెచ్చరించారు.
పేరూరు వద్ద క్రమక్రమంగా గోదావరి వరద పెరుగుతుంది. ప్రస్తుతం 15.00 మీటర్ల మేర గోదావరి ప్రవహిస్తుంది. పూసుర్ బ్రిడ్జి దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న ఇసుక వాగు వంతెనపై తాత్కాలికంగా నిర్మించిన డైవర్షన్ రోడ్డుపైకి గోదావరి వరద పోటెత్తడంతో తెలంగాణ-ఛతీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు 26 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వాజేడు మండలంలోని బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఈతకొలనులోకి దిగడానికి అనుమతిని అటవీశాఖ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పర్యాటకులకు జలపాతం సందర్శనకు మాత్రమే అనుమతిస్తున్నారు. ముంపు ప్రాంత ప్రజలు, మిరప చేనులకు వెళ్లే రైతులు, అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పశువుల కాపర్లు, మత్స్యకారులు ఎవరు గోదావరి వైపు వెళ్లొద్దని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమంలో కలకలం..


