బీజేపీకి అవసరమైన చోటే ఓట్ల చోరీ: టీపీసీసీ చీఫ్‌ | TPCC Chief Mahesh Kumar Sensational Comments On BJP | Sakshi
Sakshi News home page

బీజేపీకి అవసరమైన చోటే ఓట్ల చోరీ: టీపీసీసీ చీఫ్‌

Sep 26 2026 1:44 PM | Updated on Sep 26 2026 2:30 PM

TPCC Chief Mahesh Kumar Sensational Comments On BJP

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై తెలంగాణ కాంగ్రెస్‌ పోరును మరింత ఉధృతం చేసింది. నిజామాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీకి అవసరమైన చోట ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపించిన ఆయన.. తన ఓటును కూడా తొలగించే కుట్ర జరిగిందని అన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ నిరసనలు చేపడతామని ప్రకటించారు.

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మహారాష్ట్ర, కర్ణాటకలో కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తుంటే.. ఇతర రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఒకే ప్రజలు ఓట్లు వేస్తున్నప్పుడు ఫలితాల్లో ఇంత వ్యత్యాసం ఎలా వస్తుందని ప్రశ్నిస్తూ.. బీజేపీ ఏ రాష్ట్రంలో గెలవాలనుకుంటే అక్కడే గెలుస్తోందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. సర్‌ ప్రక్రియలో ఓట్ల తొలగింపు జరుగుతోందన్నది వాస్తవమని ఆయన ఆరోపించారు. అయితే దీనిని యాంత్రికంగా రుజువు చేయలేకపోవచ్చని అన్నారు. సర్‌పై యువతలో ఆందోళన ఉందని, అందుకే జెన్‌జీ తరహా నిరసనలు రోడ్లపైకి వస్తున్నాయని వ్యాఖ్యానించారు.

తెలంగాణ కాంగ్రెస్‌ గతంలోనూ సర్‌ ప్రక్రియలో 2002 ఓటర్ల జాబితాతో లింక్‌ చేసే నిబంధనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఆయన ఒక రాజకీయ పార్టీకి మారాడన్న కారణంగానే సమస్య వస్తోందని ఆరోపించారు. సీఈసీ వ్యవహారంపై కాంగ్రెస్‌ ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణలోనూ ఈ ఆందోళనలను చేపట్టనున్నట్టు తెలిపారు. తనకు పదిసార్లు ఓటు వేసిన నిజామాబాద్‌లోనే తన ఓటును తొలగించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. కుట్రపూరితంగా నోటీసులు ఇచ్చారని అన్నారు. లౌకికవాదుల ఓట్లను తొలగించే ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు. రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే కలిసి సీఈసీపై అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి: టార్గెట్‌ కొండా సురేఖ.. పట్టుబిగిస్తున్న మంత్రి సీతక్క!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement