సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క ఉమ్మడి వరంగల్‌పై ప్రత్యేక దృష్టి సారించారా? అన్న చర్చ మొదలైంది. ప్రధానంగా ములుగు నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తూ వస్తున్న మంత్రి.. శుక్రవారం తొలిసారిగా ఉమ్మడి ఖమ్మంతోపాటు వరంగల్ జిల్లాల అధికారులతో హనుమకొండ ఐడీఓసీ వేదికగా సమీక్ష నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.
సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఎల్‌నినో, వీబీ–జీ రామ్‌జీ, ఆర్‌డబ్ల్యూఎస్, హ్యామ్ రోడ్లపై మంత్రి చర్చించారు. కొండా సురేఖ మంత్రివర్గంనుంచి ఈ నెల 3న బర్తరఫ్ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌నుంచి కేబినెట్‌లో సీతక్క ఒక్కరే మంత్రిగా ఉన్నారు. ఈనేపథ్యంలో తొలిసారిగా అధికార యంత్రాంగంతో మంత్రి నిర్వహించిన సమీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఉమ్మడి జిల్లాల అధికారులతో తొలి సమీక్ష.. పనుల పురోగతిపై ఆరా..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీతక్క.. తొలిసారిగా ఒక్కరే ఉమ్మడి జిల్లాల అధికారులతో శుక్రవారం హనుమకొండ ఐడీఓసీలో సమీక్ష నిర్వహించడం.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్ పనులు, నిధుల వినియోగం, గ్రామీణ మౌలిక వసతులు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై ఆరా తీయడం ప్రాధాన్యంసంతరించుకుంది.
ఉమ్మడి జిల్లాల అధికార యంత్రాంగంతో నేరుగా సమన్వయం చేసుకునేలా ఈ సమావేశం సాగినట్లు అధికార వర్గాలు కూడా చెబుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన సమీక్షతోనే ఈ ప్రక్రియ ముగుస్తుందా? లేక ఇకపై వరుస సమీక్షలు కొనసాగుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇస్తున్న సీతక్క.. ఇక ఉమ్మడి జిల్లా వ్యవహారాల్లో మరింత చురుగ్గా వ్యవహరించే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ఇదీ చదవండి: బీఆర్‌ఎస్ బిగ్ ప్లాన్


