న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య మరోమారు మాటల యుద్ధం జరిగింది. పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్.. కశ్మీర్, సింధు జలాల ఒప్పందం, 2025లో భారత్-పాక్ మధ్య జరిగిన ఘర్షణపై మాట్లాడగా.. భారత్ తీవ్రంగా స్పందించింది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని ఐక్యరాజ్యసమితిలో భారత దౌత్యవేత్త పెటల్ గహ్లోత్ స్పష్టం చేశారు.
ఉగ్రవాదంపై భారత్ ఘాటు హెచ్చరిక
పాక్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ వ్యాఖ్యలకు స్పందిస్తూ, ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ పెటల్ గహ్లోత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ పదేపదే భారత్‌పై ఆరోపణలు చేసినంత మాత్రాన వాస్తవాలు మారవని అన్నారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ చాలాకాలంగా ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు.
‘టెర్రరిస్టులకు దాక్కునే అవకాశం లేదు’
గత ఏడాది భారత్ తమ వైఖరిని స్పష్టంగా చూపించిందని గహ్లోత్ పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఎక్కడా దాక్కునే అవకాశం ఉండదని అన్నారు. ఉగ్రవాదం, మోసం, ద్వంద్వ వైఖరి పాకిస్థాన్‌కు గానీ, ప్రపంచానికి గానీ ప్రయోజనం కలిగించవని ఆమె పేర్కొన్నారు.
ట్రంప్ జోక్యంతో యుద్ధం ఆగిందన్న షరీఫ్
యూఎన్ ప్రసంగంలో షెహ్‌బాజ్ షరీఫ్ 2025 మేలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఘర్షణను ప్రస్తావించారు. ఆ సమయంలో తమ దేశ స్పందన విజయవంతమైందని పేర్కొంటూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం వల్ల పరిస్థితి మరింత తీవ్రం కాలేదని అన్నారు. రెండు అణ్వాయుధ దేశాలు పూర్తిస్థాయి యుద్ధం అంచున ఉన్న సమయంలో ట్రంప్ జోక్యం కీలకంగా పనిచేసిందని షరీఫ్ వ్యాఖ్యానించారు. అయితే కాల్పుల విరమణ విషయంలో మూడో దేశం జోక్యం లేదని భారత్ గతంలోనే స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష సంప్రదింపుల ద్వారానే కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని భారత్ ఏనాడో స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: అమెరికా కోర్టులో ఆంత్రోపిక్‌కు ఎదురుదెబ్బ


