ముజామిల్‌ఖాన్
అయోధ్యనగర్‌లో ఎన్‌ఐఏ దాడులు
ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గుజరాత్ సైబర్ టెర్రరిజం కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు రామగుండంలో నిర్వహించిన సోదాలు కలకలం రేపాయి. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత ప్రభుత్వ సంస్థలకు చెందిన 54 వెబ్‌సైట్లపై అధునాతన డీడీఓఎస్ (డిస్టర్బ్ డేనియల్ ఆఫ్ సర్వీస్) సైబర్ దాడులకు యత్నించిన కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్‌ఐఏ బృందాలు తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల్లోని ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేప ట్టాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఎన్‌ఐఏ, సైబర్ క్రైమ్ అధికారుల బృందం సోమవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో ప్రత్యేక వాహనాలతోపాటు స్థానిక పోలీసుల సహకారంతో అయోధ్యనగర్‌కు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని ఓ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ఈఈఈ చదువుతున్న ముజామిల్ ఖాన్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదులతో, సైబర్ దాడుల కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో అధికారులు అతడిని ప్రశ్నించినట్టు తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముజామిల్ ఖాన్‌ను అదుపులోకి తీసుకొని ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో విచారణ కొనసాగించినట్టు సమాచారం.
టెలిగ్రామ్ గ్రూపుపై ప్రత్యేక ఆరా...
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం టెలిగ్రామ్ యాప్‌లో ‘ఏఐపై ప్రత్యేక శిక్షణ’ఇస్తామంటూ వచ్చిన సందేశం ఆధారంగా ముజామిల్ ఓ గ్రూపులో చేరినట్టు తెలుస్తోంది. ఆ గ్రూపులో కొన్ని వివాదాస్పద సందేశాలపై గొడవలు జరగడంతో సుమారు ఏడాదిన్నర క్రితమే తాను ఆ గ్రూపు నుంచి బయటకు వచ్చినట్లు విద్యార్థి అధికారులకు వివరించినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ టెలిగ్రామ్ గ్రూపులో సంఘవిద్రోహ లేదా సైబర్ దాడులకు సంబంధించిన చర్చలు జరిగాయా? అందులోని సభ్యులెవరు? గతంలో గ్రూపులో ఉన్న వ్యక్తులతో ఇప్పటికీ సంబంధాలు కొనసాగుతున్నాయా? అనే కోణాల్లో ఎన్‌ఐఏ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. సోదాల సందర్భంగా ముజామిల్‌కు చెందిన సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌తోపాటు ఇతర ఎల్రక్టానిక్ పరికరాలను అధికారులు పరిశీలించారు. సోదాల్లో మొత్తం 3 ల్యాప్‌టాప్‌లు, 5 మొబైల్ ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లతో పాటు ఇతర డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలను స్వా«దీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. విచారణకు అవసరమైనప్పుడు హాజరు కావాలని విద్యార్థికి సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.


