‘సాంకేతిక ఆధారిత ప్రొఫెషనల్ సేవలకు అంతర్జాతీయ హబ్‌గా హైదరాబాద్’ | Kaveti International AI Firm Launched in Hyderabad to Simplify Global Legal Services | Sakshi
Sakshi News home page

‘సాంకేతిక ఆధారిత ప్రొఫెషనల్ సేవలకు అంతర్జాతీయ హబ్‌గా హైదరాబాద్’

Aug 24 2026 10:10 PM | Updated on Aug 24 2026 10:10 PM

Kaveti International AI Firm Launched in Hyderabad to Simplify Global Legal Services

సాక్షి,హైదరాబాద్: అంతర్జాతీయ న్యాయ నైపుణ్యాన్ని కృత్రిమ మేధ సాంకేతికతతో అనుసంధానం చేస్తూ, వివిధ దేశాలకు సంబంధించిన న్యాయ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘కవేటి ఇంటర్నేషనల్ ఏఐ ఫర్మ్’ హైదరాబాద్ కార్యాలయాన్ని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..అంతర్జాతీయ న్యాయ సేవలకు సంబంధించిన వినూత్న సంస్థ హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వృత్తిపరమైన సేవలతో సహా అనేక రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం వేగంగా విస్తరిస్తోందని, ఇది అపారమైన అవకాశాలను సృష్టిస్తూనే కొత్త సవాళ్లను కూడా ముందుకు తెస్తోందన్నారు.

అందువల్ల ఏఐ వినియోగంలో బాధ్యత, నైతిక విలువలు, పారదర్శకత అత్యంత కీలకమని పేర్కొన్నారు. బలమైన ఐటీ, సాంకేతిక వ్యవస్థ, అత్యున్నత నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ దేశాలతో మెరుగైన అనుసంధానం హైదరాబాద్‌కు ప్రత్యేక బలాలని మంత్రి చెప్పారు. ఈ అనుకూలతలతో ఏఐ ఆధారిత ప్రొఫెషనల్, న్యాయ సేవలకు హైదరాబాద్ ఒక ప్రధాన అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగే సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. తెలంగాణను అంతర్జాతీయ నైపుణ్యంతో అనుసంధానించే ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రానికి ప్రపంచస్థాయిలో మరింత గుర్తింపు తీసుకొస్తాయని అన్నారు.

న్యూయార్క్‌లోని కవేటి లా ఫర్మ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ అటార్నీ డాక్టర్ శ్రీనివాస్ రావు కవేటి, కవేటి ఇంటర్నేషనల్ ఏఐ ఫర్మ్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడాన్ని మంత్రి అభినందించారు. తెలంగాణకు చెందిన డాక్టర్ కవేటికి భారత్‌తో పాటు అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈ దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ న్యాయ వ్యవహారాల్లో 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ‘ఇంటర్నేషనల్ లీగల్ యాక్సెస్ హబ్’గా తీర్చిదిద్దాలని సంస్థ ప్రతిపాదించింది. భారత్‌లోని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రవాస భారతీయులు (NRIs), పెట్టుబడిదారులు వివిధ దేశాల్లో న్యాయ సేవలు అందిస్తున్న న్యాయవాదులు, న్యాయ నిపుణులతో అనుసంధానం కావడానికి ఈ కేంద్రం వేదికగా పనిచేయనుంది. అంతర్జాతీయ న్యాయ నిపుణులు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భాల్లో ప్రత్యక్ష సంప్రదింపులు, న్యాయ వ్యూహాలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించే అవకాశాన్ని కూడా కల్పించనున్నారు.

సంస్థ సేవలు వివిధ దేశాల్లోని పలు న్యాయ విభాగాలను కవర్ చేయనున్నాయి. అమెరికాలో ఇమ్మిగ్రేషన్, కుటుంబ చట్టాలు, సివిల్ లిటిగేషన్, అంతర్జాతీయ విడాకులు, కార్పొరేట్, క్రిమినల్ లా అంశాలు; యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఇమ్మిగ్రేషన్, కుటుంబ చట్టాలు, సివిల్ లిటిగేషన్; యూఏఈలో కార్మిక పరిహారం, ఉద్యోగ సంబంధిత సమస్యలు, ఒప్పంద వివాదాలకు సంబంధించిన సేవలను అందించనున్నట్లు సంస్థ తెలిపింది. భారత్‌లో కంపెనీ, ట్రేడ్‌మార్క్ చట్టాలు, సివిల్, క్రిమినల్, కార్మిక చట్టాలు, రిట్ పిటిషన్లు, రుణాల రికవరీ, వినియోగదారుల చట్టాలు, స్పెషల్ లీవ్ పిటిషన్లు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు సంబంధించిన సేవలను అందించనుంది.

హైదరాబాద్ కేంద్రం కార్యకలాపాల్లో న్యాయ సేవల్లో కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా వినియోగించడం ప్రధాన అంశంగా ఉండనుంది. ముఖ్యంగా సంక్లిష్టమైన అంతర్జాతీయ న్యాయ వ్యవహారాల్లో లీగల్ రీసెర్చ్, సమాచార సేకరణ, డాక్యుమెంట్ల విశ్లేషణ, డిస్కవరీ, కేసులకు సంబంధించిన ప్రాథమిక మ్యాపింగ్ తదితర అంశాల్లో ఏఐ సహకారాన్ని వినియోగించాలని ప్రతిపాదించారు.

అయితే ఏఐ న్యాయవాదులకు ప్రత్యామ్నాయం కాదని, వారికి సహకరించే సాధనంగా మాత్రమే ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. న్యాయ సలహాలు, ప్రాతినిధ్యం వంటి సేవలను ఆయా దేశాల్లో అమలులో ఉన్న చట్టాలు, వృత్తిపరమైన నైతిక ప్రమాణాలకు అనుగుణంగా అర్హత కలిగిన న్యాయ నిపుణులు మాత్రమే అందిస్తారని పేర్కొంది.

సాంకేతిక పరిజ్ఞానం అంతిమంగా ప్రజలకు ఎదురయ్యే అడ్డంకులను తగ్గించడానికి, సేవల్లో సామర్థ్యాన్ని పెంచడానికి, ప్రత్యేక నైపుణ్యంతో కూడిన సేవలను మరింత విస్తృత వర్గాలకు చేరువ చేయడానికి ఉపయోగపడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచస్థాయి ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌లతో అనుసంధానించే ఇటువంటి సంస్థలు తెలంగాణను ఆవిష్కరణలు, విజ్ఞాన ఆధారిత సేవలకు అంతర్జాతీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో దోహదపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement