త్వరలోనే తెలంగాణ ప్రభుత్వ సొంత ‘రైడ్-హెయిలింగ్’ యాప్! | Telangana Govt Launch Ride Hailing App Auto Fares Revised Rs 1 5L EV Subsidy | Sakshi
Sakshi News home page

త్వరలోనే తెలంగాణ ప్రభుత్వ సొంత ‘రైడ్-హెయిలింగ్’ యాప్!

Aug 24 2026 7:57 PM | Updated on Aug 24 2026 7:58 PM

Telangana Govt Launch Ride Hailing App Auto Fares Revised Rs 1 5L EV Subsidy

తెలంగాణలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు సఫలం కావడంతో డ్రైవర్లు సమ్మెను విరమించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం, ఆదాయ మార్గాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం కొన్ని సంచలనాత్మక నిర్ణయాలను వెల్లడించింది.

సొంత యాప్ రూపకల్పన

ఓలా, ఊబర్ వంటి ప్రైవేట్ అగ్రిగేటర్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వమే ప్రత్యేకంగా ఒక 'రైడ్-హెయిలింగ్ యాప్'ను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీనిద్వారా ప్రైవేట్ యాప్‌ల కమిషన్ల భారం తగ్గి డ్రైవర్ల నికర ఆదాయం పెరిగే అవకాశముందని చెప్పారు.

2012 తర్వాత తొలిసారిగా ఛార్జీల పెంపు

రవాణా రంగ కార్మికుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2012 తర్వాత మొదటిసారిగా ఆటో ఛార్జీల సవరణకు ప్రభుత్వం నిర్ణయాత్మకంగా ఆమోదం తెలిపింది. కొత్త ఛార్జీలకు సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

ఈవీ కన్వర్షన్‌కు రూ.1.50 లక్షల సాయం

హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణతో పాటు ఇంధన భారాన్ని తగ్గించేందుకు డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు (రెట్రోఫిట్టింగ్) ఒక్కో వాహనానికి రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు స్పష్టం చేశారు.

బైక్ ట్యాక్సీలు.. సంక్షేమంపై స్పష్టత

వాణిజ్య అవసరాలకు మాత్రమే ఉపయోగించే ‘పసుపు రంగు నంబర్ ప్లేట్’ ఉండే ద్విచక్రవాహనాలను మాత్రమే బైక్ ట్యాక్సీలుగా అనుమతించే అంశంపై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, ఎన్నికల హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక సహాయం అందించే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి వివరించారు. సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది.

ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement