బ్యాంకులు, అప్పులవారి కన్నుపడని ఆర్థిక కానుక! | Why Banks Cant Touch Your Insurance Money MWP Act Secret Every Family Needs | Sakshi
Sakshi News home page

బ్యాంకులు, అప్పులవారి కన్నుపడని ఆర్థిక కానుక!

Aug 24 2026 5:47 PM | Updated on Aug 24 2026 5:49 PM

Why Banks Cant Touch Your Insurance Money MWP Act Secret Every Family Needs

ప్రస్తుత రోజుల్లో కుటుంబ ఆర్థిక భద్రత కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ప్రతి ఒక్కరికీ అనివార్యంగా మారింది. అయితే, పాలసీదారుడు అకాల మరణం చెందితే ఆ బీమా పరిహారం నిజంగానే ఆయన భార్యాపిల్లలకు అందుతుందా? లేక పాలసీదారులకు ఉన్న అప్పులు, వ్యాపార బాధ్యతల కింద బ్యాంకులకు చెల్లుతుందా? ఈ ప్రశ్నకు చట్టపరమైన పరిష్కారమే ‘మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ (ఎండబ్ల్యూపీ) యాక్ట్, 1874’. దీని గురించి తెలుసుకుందాం.

మనం టర్మ్ ఇన్సూరెన్స్ అప్లికేషన్ ఫారమ్ నింపే సమయంలో ‘I would like to buy this policy under Married Women’s Property Act’ అనే ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది. దీన్ని ఎంచుకోవడం వల్ల పాలసీ ద్వారా వచ్చే డెత్ బెనిఫిట్ (బీమా పరిహారం) పూర్తిగా ఒక ప్రత్యేక లీగల్ ట్రస్ట్‌గా మారుతుంది. 1874 నాటి ఈ చట్టం (సెక్షన్ 6) ప్రకారం, ఈ నిధులపై కేవలం భార్య, పిల్లలకు మాత్రమే సంపూర్ణ హక్కులు ఉంటాయి.

ఎండబ్ల్యూపీ యాక్ట్‌తో లభించే ప్రయోజనాలు

  • పాలసీదారుడి పేరు మీద గృహ రుణాలు, బిజినెస్ లోన్లు లేదా వ్యక్తిగత అప్పులు ఎంత ఉన్నప్పటికీ ఆయన మరణానంతరం బ్యాంకులు గానీ, అప్పు ఇచ్చినవారు గానీ ఈ బీమా సొమ్మును జప్తు చేయడానికి కోర్టుల ద్వారా కూడా వీల్లేదు.

  • విల్లు లేదా ఇతర వారసత్వ వివాదాలతో సంబంధం లేకుండా ఇతర కుటుంబ సభ్యులు (Extended Family) ఈ సొమ్ముపై ఎలాంటి హక్కులు కోరలేరు. పరిహారం నేరుగా నామినేట్ చేసిన భార్యాపిల్లలకే చేరుతుంది.

  • ఒకసారి పాలసీని ఎండబ్ల్యూపీ యాక్ట్ కింద తీసుకుంటే భవిష్యత్తులో పాలసీదారుడు కూడా లబ్ధిదారులను మార్చడానికి వీలుండదు. ఇది లబ్ధిదారుల హక్కును శాశ్వతంగా కాపాడుతుంది.

ఎవరికి ఇది అత్యవసరం?

ముఖ్యంగా సొంత వ్యాపారం చేసేవారు, భారీగా రుణాలు ఉన్న ఉద్యోగులు, ఉమ్మడి కుటుంబాల్లో నివసించేవారు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ ఆప్షన్‌ను ఎంచుకోవడం శ్రేయస్కరం. అయితే.. టర్మ్ పాలసీ కొనుగోలు చేసేటప్పుడు మాత్రమే ఈ చెక్ బాక్స్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి పాలసీ జారీ అయిన తర్వాత దీన్ని జోడించడం సాధ్యం కాదు. చిన్న అజాగ్రత్తతో కుటుంబ భవిష్యత్తును ప్రమాదంలో పడేయకుండా టర్మ్ పాలసీతో పాటు ఎండబ్ల్యూపీ యాక్ట్ ఆప్షన్‌ను ఎంచుకుని భార్యాపిల్లల ఆర్థిక స్వతంత్రతను కాపాడటం కుటుంబ పెద్ద బాధ్యత అని గమనించాలి.

ఇదీ చదవండి: ట్రంప్‌ ఆరోగ్యంపై నిజనిజాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement