వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా: ట్రంప్‌ | I Do What They Say: Trump On Plane Switch Row | Sakshi
Sakshi News home page

వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా: ట్రంప్‌

Aug 12 2026 9:08 AM | Updated on Aug 12 2026 9:14 AM

I Do What They Say: Trump On Plane Switch Row

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయాణంలో జరిగిన రహస్య మార్పు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నాటో సదస్సు తర్వాత అంకారా నుంచి బయలుదేరే సమయంలో ఆయన్ని ఎవరి కంటా పడకుండా మరో విమానంలో తరలించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ఎక్కినట్లు కనిపించేలా ఓ డమ్మీ ఆపరేషన్‌ నిర్వహించి.. అనంతరం ఓ క్యాటరింగ్‌ ట్రక్కు ద్వారా ట్రంప్‌ను మరో సైనిక విమానంలోకి తరలించినట్లు సమాచారం. అయితే ఈ ప్రచారంపై ట్రంప్‌కు తాజాగా ప్రశ్న ఎదురైంది. 

భద్రతా కారణాలతో ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ నుంచి మరో విమానానికి తనను తరలించారన్న ప్రచారాన్ని ట్రంప్‌ ధృవీకరించారు. ‘‘విమానం మార్చాలన్న నిర్ణయం పూర్తిగా సీక్రెట్‌ సర్వీస్‌, సైనిక అధికారులదే. వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“నేను సీక్రెట్‌ సర్వీస్‌, మిలిటరీ చెప్పినట్లే చేస్తాను. వారు వేరే విమానంలో వెళ్లాలని చెప్పారు. అది కూడా అంతే భద్రత కలిగిన విమానమే. వారు కోరడంతో నేను అలా చేశాను. వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా” అని ట్రంప్‌ అన్నారు. అయితే ఆ ముప్పు ఇరాన్‌ నుంచే ఉందా? అనే విషయంపై ఆయన ధాటవేత ధోరణి ప్రదర్శించారు. తనపై ఉన్న ముప్పు వివరాలను తాను సీక్రెట్‌ సర్వీస్‌ వాళ్లను ఎక్కువగా అడగలేదని ఆయన చెప్పారు. “నాకు చాలా బెదిరింపులు వస్తుంటాయి” అని పేర్కొన్నారు.

“మీకు తెలియని చాలా బెదిరింపులు నాకు ఉన్నాయి. ప్రభావవంతమైన అధ్యక్షులకు ఇలాంటి బెదిరింపులు సహజమే. దాదాపు ఆరు సంవత్సరాల కాలంలో నా కంటే ఎక్కువ చేసిన అధ్యక్షుడు ఎవరూ లేరని నేను భావిస్తున్నాను. నిజం చెప్పాలంటే నేను దేని గురించి ఆందోళన చెందను. ఏదైనా సరే.. నా వైఖరి అదే” అని అన్నారు.

ఇరాన్‌ను నమ్మను: ట్రంప్‌
ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కూడా ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నేను ఇరాన్‌ను నమ్మను. వారు నాతో నిరంతరం అబద్ధాలు చెప్పారు. ఇరాన్‌ను నమ్మే చివరి వ్యక్తి నేనే” అని అన్నారు. హర్ముజ్‌ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని పేర్కొంటూ.. అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

“ప్రస్తుతం హార్ముజ్‌ జలసంధిపై మాకు పూర్తి నియంత్రణ ఉంది. ఎవరైనా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని ట్రంప్‌ అన్నారు.

ఆనాడు జరిగింది ఇదే..
టర్కీలోని అంకారా నుంచి బయలుదేరే సమయంలో ట్రంప్‌ తొలుత ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం ఎక్కారు. అయితే కొద్దిసేపటికే భద్రతా వ్యూహాన్ని మార్చిన అధికారులు ఆయనను రహస్యంగా మరో విమానంలోకి తరలించారు. సాధారణంగా విమానాలకు ఆహారం, సరఫరాలు తరలించే క్యాటరింగ్‌ ట్రక్‌ను ఉపయోగించి ట్రంప్‌ను విమానాశ్రయంలో మరో ప్రాంతానికి తీసుకెళ్లి, ఎయిర్‌ఫోర్స్‌ C-32A విమానంలో ఎక్కించారు.

అదే సమయంలో అసలు ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం మాత్రం ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ ఆపరేషన్‌ను భద్రతా వర్గాలు ఒక “డీకాయ్‌ ఆపరేషన్‌”గా పరిగణిస్తున్నాయి. ఇరాన్‌కు చెందిన వర్గాల నుంచి ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకునే ముప్పు ఉందన్న నిఘా సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 

అగ్ర దేశాధినేతల ప్రయాణాలు ఎప్పుడూ అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగుతుంటాయి. అయితే “దేనికీ భయపడను” అంటూ చెప్పుకునే ట్రంప్‌ విషయంలో ఇరాన్‌ ముప్పు నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ రహస్య విమాన మార్పు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా చెప్పుకునే ట్రంప్‌ ప్రయాణంలో జరిగిన ఈ “సీక్రెట్‌ స్విచ్‌” భవిష్యత్తులో అధ్యక్షుల రక్షణ వ్యూహాలకు మరో కొత్త అధ్యాయంగా మారుతుందా? అన్నదే ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement