లండన్: కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రముఖ పిల్లల కథ ‘లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్’పై వివాదాస్పద హెచ్చరికను జారీ చేసింది. హ్యూమానిటీస్ విద్యార్థుల కోసం నిర్వహించిన ఒక ఆన్‌లైన్ వెబ్‌నార్ సందర్భంగా, ఈ పిల్లల కథలో ‘పెద్దల కంటెంట్’, ‘హింసాత్మక అంశాలు’ ఉన్నాయని పేర్కొంటూ ఈ హెచ్చరికను జతచేశారు.
క్లేర్ కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత ఆన్‌లైన్ కోర్సు ద్వారా ఏ-లెవల్, జీసీఎస్‌ఈ విద్యార్థులు విశ్వవిద్యాలయ విద్యకు సన్నద్ధమవుతారు. ఈ కోర్సులో భాగంగా చిన్ననాటి కథలను క్షుణ్ణంగా పరిశీలించాలని, కథల అంతరార్థాలను అర్థం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అయితే, దీనికి సంబంధించిన అధికారిక నోట్‌లలో ‘కంటెంట్ హెచ్చరిక: అద్భుత కథల ప్రస్తావనతో పాటు హింసాత్మక అంశాలు వంటి కొన్ని పెద్దల కంటెంట్‌పై ఈ సెషన్‌లో చర్చ ఉంటుంది’ అని పేర్కొన్నారు.
1697లో తొలిసారి ప్రచురితమైనప్పటి నుంచి ‘రెడ్ రైడింగ్ హుడ్’ కథలో అనేక మార్పులు జరిగాయి. అసలు కథలో తోడేలు.. బామ్మను, రెడ్ రైడింగ్ హుడ్‌ను కూడా చంపుతుంది. 19వ శతాబ్దంలో గ్రిమ్ సోదరులు దీనికి భిన్నమైన వెర్షన్‌ను తీసుకువచ్చారు. ఇందులో తోడేలు ఆ బాలికను, ఆమె బామ్మను మింగేస్తుంది. ఆ తర్వాత అటుగా వెళ్తున్న ఒక వేటగాడు నిద్రపోతున్న తోడేలు కడుపు కోసి ఇద్దరినీ సజీవంగా బయటకు తీసుకువస్తాడు. అనంతరం దాని కడుపులో రాళ్లతో నింపడంతో తోడేలు నీటిలో మునిగి చనిపోతుంది.
ఈ ట్రిగ్గర్ హెచ్చరికపై ఫ్రీ స్పీచ్ యూనియన్‌కు చెందిన లార్డ్ టోబీ యంగ్ స్పందిస్తూ ‘అద్భుత కథలపై ఇలాంటి హెచ్చరికలు పెట్టడం కేంబ్రిడ్జ్ లాంటి సంస్థకు కూడా చిన్నపిల్లల చేష్టల్లా అనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ విశ్వవిద్యాలయంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2017లో ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ క్లాసికల్ గ్రంథాలపై, షేక్స్పియర్ నాటకాలపై ఇలాంటి హెచ్చరికల చిహ్నాలను ఉంచింది.
ఇది కూడా చదవండి: జింబాబ్వే: పడవ బోల్తా పడి 15 మంది జలసమాధి!


