మూతపడిపోవాల్సిన వ్యాపారాన్ని కూతురు నిలబెట్టింది..! ఇవాళ అదికాస్తా.. | Daughter saves father's 34 year old shoe store from shutting down | Sakshi
Sakshi News home page

మూతపడిపోవాల్సిన వ్యాపారాన్ని కూతురు నిలబెట్టింది..! ఇవాళ అదికాస్తా..

Aug 11 2026 4:55 PM | Updated on Aug 11 2026 5:13 PM

Daughter saves father's 34 year old shoe store from shutting down

పిల్లలు తల్లిదండ్రులకెప్పుడూ చిన్నపిల్లలుగానే కనిపిస్తారు. వాళ్లకు ఏం తెలియదనే అనుకుంటారు. అలానే భావించాడు ఈ తండ్రి. కానీ అతడి కూతురు వ్యాపారం సవ్యంగా సాగక ఇబ్బంది పడుతున్న తండ్రి కష్టాన్ని గమనించింది. తనకు తోచిన విధంగా ఏదైనా సాయం అందించి తండ్రి వ్యాపారాన్ని కాపాడేందుకు ప్రయత్నించింది. చివరికి ఆమె కారణంగానే మూతపడాల్సిన వ్యాపారం కాస్త ఊహించన విధంగా లాభాల బాటపట్టింది. పేరెంటింగ్‌కి కొత్త నిర్వచనం నేర్పేలా తండ్రి ఉపాధిని రక్షించింది. 

అసలేం జరిగిందంటే..లండన్‌కి చెందిన రషీద్‌ లజ్రాక్‌ షోర్‌డిచ్‌లో షూ దుకాణాన్ని నడిపేవారు. వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుని కొద్ది కాలంలోనే చిన్న దుకాణాన్ని కాస్త పెద్ద వ్యాపారంగా మార్చారు. అయితే చూస్తుండగానే అతడి 34 ఏళ్ల నాటి షాపు ఉన్న ప్రాంతం ఆధునికరించబడటంతో..అక్కడ ఉండే స్థానిక కస్టమర్ల ఆలోచనలు కూడా మారాయి. చుట్టూ చైన్‌ స్టోర్‌లు, కాఫీ షాపులు వంటి కొత్త దుకాణాల రాకతో..కుటుంబ వ్యాపారం కాస్త కష్టాల్లో పడింది. 

ఇక తన షూ షోరూమ్‌ 'రిచ్ కలెక్షన్ ఇటాలియా'ని మూసేయ్యడానికి రెడీ అయిపోయాడు. అప్పుడే అతడి కూతురు జినెబ్ లజ్రాక్, రంగంలోకి దిగి, ఏళ్ల తరబడి అమ్ముతున్న బూట్లు కచ్చితంగా సరికొత్త తరానికి నచ్చుతాయని గుర్తించింది.  దశాబ్దాలుగా అతను అమ్ముతున్న బూట్లను యువ వినియోగదారులకు చూపించడానికి టిక్‌టాక్‌ను ఉపయోగించి..ప్రమోషన్‌ ఇచ్చే పని చేసింది. జినెబ్ టిక్‌టాక్ ద్వారా చేస్తున్న ప్రచారంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆఖరికి కస్టమర్లు క్యూలో నిలబడి మరి కొనేలా క్రేజ్‌ సంపాదించుకుంది ఆ షాపు. 

ఇంతకుమునుపు ఆధునీకరణ కారణంగా రెగ్యులర్‌ కస్టమర్లు తగ్గిపోయారు. దాంతో ఆ టైంలో తన తండ్రికి ప్రాథమిక కస్టమర్లు ఆఫ్రికన్లేనని చెప్పిందామె. వాళ్లు కూడా రాను రాను మానేశారు. దాంతో వ్యాపారం ఇక కొనసాగించ లేని పరిస్థితి ఎదురైందని వెల్లడించింది. దాదాపు మూతపడుతుంది అనుకున్న తరుణంలో కూతురు జినెబ్‌ టిక్‌టాక్‌ వీడియోలతో నిలదొక్కుకునేలా చేసింది.  ఆ వీడియోలలో తన తండ్రి షాపులో షూ కలక్షన్ల గురించి పూసగుచ్చినట్లుగా తెలిపింది. దాంతో ఒక ఫ్రెంచ్‌ టిక్‌టాకర్‌ ఆ దుకాణాన్ని సందర్శించి..ఆ షాపుని "దాగి ఉన్న ఆణిముత్యం"గా వర్ణించడంతో..ఊహించని విధంగా కస్టమర్ల రద్దీ పెరిగింది. 

అలాగే తన తండ్రి ప్రధానంగా "వయసు పైబడిన మహిళల కోసం ఆంటీ షూస్" అమ్ముతారంటూ..వాటి వివరాలను కూడా వివరించింది. అలాగే ఆ షాపులో కొన్ని రకాల కలెక్షన్లు..Y2K ఫ్యాషన్ ట్రెండ్‌కు సరిపోతాయని ఆమెకు తెలియదు. ఏదో సరగా తన తండ్రి దుకాణం గురించి వివరిస్తూ..Y2K-శైలి చెప్పుల శైలి గురించి మాట్లాడింది. అంతే ఒక్కసారిగా కస్టమర్ల తాకిడి ఎక్కువై..ఊహించని విధంగా అమ్మకాలు జోరందుకున్నాయి. ఫలితంగా ఒంటి చేత్తో షాపుని నిర్వహించడం కష్టమైపోయింది. చివరికి హెల్పర్లు అవసరమయ్యారు. దాంతో జినెబ్‌ స్వయంగా రిటైల్ అనుభవం లేనప్పటికీ, షాపులో పనిచేయడం ప్రారంభించింది. 

అలాగే ఎప్పటికప్పుడూ కొత్త సరుకుని తీసుకువచ్చి..కస్టమర్లను ఆకర్షిస్తూ..లాభల బాటలో దూసుకుపోతోంది. అంతేగాదు జినాబ్‌ త్వరలో ఆన్‌లైన్‌ బ్రాండ్‌ని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వివిధ దేశాల ప్రజలు నుంచి డిమాండ్‌ అధికమవ్వడంతో 'టిక్‌టాక్ షాప్' (TikTok Shop)ను కూడా ప్రారంభించింది. కాగా కూతురు కారణంగా మూసేద్దాం అనుకున్న షాపు దినదినాభివృద్ధి చెందడంతో అతడికి సోషల్‌మీడియా పట్ల ఉన్న దృక్ఫథం మారిపోయింది. ఒక చిన్న వ్యాపారానికి సోషల్ మీడియా ఉండటం ఎంత ముఖ్యమో తెలిసొచ్చింది. 

పైగా పరిస్థితులు కష్టంగా మారినప్పుడు కూడా ఎలా వ్యాపారాన్ని కొనసాగించాలో తెలుసుకున్నారు రషీద్‌. అంతేగాదు ఈ తండ్రీ కూతుళ్ల కథ ఒక ఆచరణాత్మక పాఠాన్ని కూడా అందిస్తోంది. అదేమిటంటే, పిల్లల కొత్త పోకడలు, సాంకేతికత, మారుతున్న వినియోగదారుల  అభిరుచిని పేరెంట్స్‌ అంచనా వేయలేకపోయినా..పిల్లలు అర్థం చేసుకోగలరని తెలియజేసింది. అలాగే తనకు ఉన్న వ్యాపార అనుభవానికి సోషల్‌ మీడియా వంటి సాంకేతిక శక్తి కూడా తోడైతే..విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహించొచ్చని రషీద్‌ కథ తెలుపుతోంది కదూ..!.

(చదవండి: ప్రోస్టేట్‌ కేన్సర్‌ ఎముకలకు వ్యాపిస్తుందా..? అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్‌ కూడా..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement