టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి- అనుష్క శర్మ దంపతులకు భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ మద్దతుగా నిలిచాడు. భార్యాభర్తలు పరస్పరం ఇష్టాలు గౌరవించుకుంటారని.. తమకు నచ్చినట్లు ఉండే స్వేచ్ఛ వారికి ఉందని పేర్కొన్నాడు.
భారత్‌కు వచ్చిన ప్రతిసారీ
కోహ్లికి ప్రతీ విషయంలోనూ పూర్తి స్పష్టతతో ఉంటాడని.. అతడిని ఎవరూ పెద్దగా ప్రభావితం చేయలేరని షమీ పేర్కొన్నాడు. కాగా కోహ్లి గత కొన్నేళ్లుగా ఆధ్యాత్మిక బాట పట్టిన సంగతి తెలిసిందే. భార్య అనుష్క, పిల్లలు వామిక, అకాయ్‌లతో కలిసి లండన్‌లో సెటిల్ అయినప్పటికీ.. భారత్‌కు వచ్చిన ప్రతిసారీ ప్రేమానంద్ మహర్షిని కలిసేందుకు అతడు బృందావనం (UP) వెళ్తూ ఉంటాడు.
జెన్ జీ నిరసనల సమయంలోనూ..
ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జెన్ జీ నిరసనలు చేస్తున్న వేళ కూడా అనుష్కతో కోహ్లి బృందావనానికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో విరుష్క జోడీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఓవైపు విద్యార్థులు, యువత ప్రభుత్వ జవాబుదారీతనం కోసం పోరాడుతుంటే.. అందరికీ రోల్‌మోడల్‌గా భావించే కోహ్లి కనీసం స్పందించకపోవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి.
అనుష్కను పెళ్లి చేసుకున్న తర్వాతే కోహ్లి ఇలా మారిపోయాడని.. విద్యార్థుల పక్షాన నిలబడే చిన్న ప్రయత్నం కూడా చేయలేదని నెటిజన్లు అతడిపై మండిపడ్డారు. ఈ విషయం గురించి.. ఇటీవల ‘టైమ్స్ నౌ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీకి ప్రశ్న ఎదురైంది.
ఒక్కసారి నమ్మితే ప్రాణం పెడతాడు
ఇందుకు స్పందిస్తూ.. ‘‘అవును అతడు ఆధ్యాత్మిక భావనలో ఉన్నాడు. ఇదేమీ అకస్మాత్తుగా ఇప్పుడే జరిగింది కాదే. తాను నమ్మిన వ్యక్తి, వ్యవస్థ కోసం కోహ్లి నిలబడతాడు. ఒక్కసారి నమ్మితే ప్రాణం పెడతాడు. మహారాజ్‌ను కలవడం అతడి సొంత ఇష్టం.
అనుష్క శర్మ అలా చేస్తే తప్పేంటి?
ఇందులో మనం అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదు. ఎవరి నమ్మకాలు, ఇష్టాలు వాళ్లవి. మీరు ఏది నమ్మితే దానికే ప్రాధాన్యం ఇస్తారు కదా. కోహ్లి కూడా అంతే. అనుష్క- కోహ్లి భార్యాభర్తలు. ఒకవేళ ఆమె అతడిని ఆధ్యాత్మికత వైపు నడిపించి ఉంటే.. అందులో తప్పేముంది?
దాని వల్ల ఎవరికైనా నష్టం వాటిల్లిందా? అసలు ఇందులో ఆమెను తప్పుబట్టడానికి ఏముందో నాకైతే అర్థం కావడం లేదు’’ అని షమీ విరుష్క జోడీని సమర్థించాడు. కాగా కోహ్లి ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. ఇక షమీ గతేడాది చివరగా భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.


