PC: BCCI X
టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తరచూ గాయాల బారిన పడటం ఆందోళనకరంగా పరిణమించింది. ఈ ఏడాది ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఇప్పటికే అతడు ఎన్నో మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజాగా శ్రీలంకతో కీలక టెస్టు సిరీస్‌కు కూడా బుమ్రా అందుబాటులో లేకుండా పోయాడు.
ఆర్నెళ్లు లేదంటే ఏడాది బ్రేక్ తీసుకో
గతంలో వెన్నునొప్పితో సుదీర్ఘకాలం జట్టుకు దూరమైన బుమ్రా.. ఈసారి మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్ కర్సాన్ ఘవ్రీ బుమ్రాను ఉద్దేశించి కీలక సూచనలు చేశాడు. మిడ్-డేతో మాట్లాడుతూ..
‘‘బుమ్రా ఐదు నుంచి ఆరు నెలలు.. లేదంటే ఓ సంవత్సరం పాటు విరామం తీసుకోవాలి. వందశాతం ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే తిరిగి మైదానంలో అడుగుపెట్టాలి. అలా కాకుండా ప్రతీసారి హడావుడిగా జట్టుతో చేరి.. మధ్యలోనే గాయం వల్ల నిష్క్రమిస్తే కూర్పు దెబ్బతింటుంది.
జట్టు ప్రణాళికలు అప్పటికప్పుడు మార్చుకోవాల్సి వస్తుంది. పనిభారం తగ్గించేందుకు మధ్య మధ్యలో విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. ఇదంతా వృథా ప్రయాస. ఏదైనా సిరీస్ లేదంటే.. టోర్నీ మొత్తం పనిభారం అనే ప్రస్తావన లేకుండా జట్టుతో కొనసాగే ఆటగాడికే పెద్దపీట వేయాలి.
భువీ, షమీలను పిలిపించండి
బుమ్రా కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే అతడిని జట్టులో చేర్చాలి. నిజానికి భారత వెటరన్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఐపీఎల్‌లో నిలకడగా ఆడుతున్నారు. గాయాల బెడద లేకుండా వరుస టోర్నీల్లో పాల్గొంటున్నారు. వారిని తిరిగి టీమిండియాలోకి తీసుకుంటే బాగుంటుంది.
సెలక్టర్లు షమీ, భువీల పేర్లు పరిగణనలోకి తీసుకోవాలి. ఫాస్ట్ బౌలర్లలకు గాయాలు సహజం. అయితే, బుమ్రా గత రెండు- మూడేళ్ల నుంచి తరచూ గాయపడుతున్నాడు. మెజారిటీ, కీలక మ్యాచ్‌లకు అతడు దూరమవుతున్నాడు. టీమిండియాకు ఇది ఎంతమాత్రమూ శుభసూచకం కాదు’’ అని ఘవ్రీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
బుమ్రా స్థానంలో..
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమైన శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరం కాగా.. అతడి స్థానంలో జమ్మూ కశ్మీర్ పేస్ బౌలర్ ఆఖిబ్ నబీకి మొదటిసారి భారత జట్టు పిలుపు లభించింది.
కాగా 29 ఏళ్ల నబీ దేశవాళీ క్రికెట్‌లో గత రెండేళ్లుగా అద్భుతంగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీ రెండు వరుస సీజన్లలో కలిపి అతను ఏకంగా 104 వికెట్లు పడగొట్టాడు. 2025–26 సీజన్‌లో 60 వికెట్లు తీసిన నబీ... జమ్మూ కశ్మీర్ క్రికెట్ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
చదవండి: సన్‌రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం


