ఆకిబ్‌ నబీ జీవితంలో ఆసక్తికర విశేషాలు | Auqib Nabi India Call Up: From Baramulla to Indian Test Squad | Sakshi
Sakshi News home page

ఆకిబ్‌ నబీ జీవితంలో ఆసక్తికర విశేషాలు

Aug 4 2026 4:18 PM | Updated on Aug 4 2026 4:44 PM

Auqib Nabi Earns Maiden India Call Up: The Untold Story of The Baramulla Express

అది జమ్మూకశ్మీర్‌లోని బరాముల్లా పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న షీరీ అనే గ్రామం. అక్కడ క్రికెట్‌ ఆడేందుకు పెద్దగా సౌకర్యాలు లేవు. నిత్యం రాజకీయ ఉద్రిక్తతలు ఉండే ఆ ప్రాంతంలో ఒక బాలుడు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాలని కలలు కన్నాడు. కలలు కనడమే కాకుండా పట్టుదల, కృషితో వాటిని సాకారం చేసుకున్నాడు.

అతడి పేరే ఆకిబ్ నబీ. త్వరలో శ్రీలంకతో జరుగబోయే టెస్ట్‌ సిరీస్‌కు బుమ్రా ప్రత్యామ్నాయంగా ఎంపికైన ఆటగాడు. నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్ల పాలిట సింహస్వప్నమైన అతడిని క్రికెట్‌ సర్కిల్స్‌లో బారాముల్లా ఎక్స్‌ప్రెస్‌ అని పిలుస్తారు. లంకతో తొలి టెస్ట్‌తో టీమిండియా అరంగేట్రం చేసే అవకాశం ఉన్న నబీ జీవిత విశేషాలు ఈ కథనంలో చూద్దాం.

29 ఏళ్ల నబీ చిన్నతనంలో ఫుట్‌బాల్‌పై ఆసక్తి చూపినప్పటికీ.. ఆ తర్వాత పేస్‌ బౌలింగ్‌పై మక్కువ పెంచుకున్నాడు. అదే ఆసక్తి అతడిని దేశవాళీ క్రికెట్‌లో తిరుగులేని పేసర్‌గా మార్చి, టీమిండియాలోకి తీసుకొచ్చింది. తద్వారా భారత టెస్ట్ జట్టుకు ఎంపికైన తొలి జమ్మూకశ్మీర్‌ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించేలానూ చేసింది.

డాక్టర్‌ కావాలని తండ్రి ఆశ..
నబీకి క్రికెట్‌ కెరీర్‌ ఎంచుకోవడం అంత సులభంగా జరగలేదు. 12వ తరగతి చదువుతున్న సమయంలో అతడు బయోసైన్స్‌ విద్యార్థి. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడైన అతడి తండ్రి గులాం నబీ దార్‌ తన కొడుకు డాక్టర్‌ కావాలని కోరుకున్నారు.

కానీ అదే సమయంలో నబీకు బీసీసీఐ నిర్వహించిన పేస్‌ బౌలింగ్‌ క్యాంప్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ క్యాంప్‌కు ఆస్ట్రేలియా దిగ్గజం గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ కోచ్‌గా వ్యవహరించాడు.

కొడుకు చదువును పక్కన పెట్టి క్రికెట్‌ కోసం వెళ్లడం తండ్రికి అస్సలు నచ్చలేదు. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం ప్రమాదకరమైన నిర్ణయమని ఆయన భావించారు.

అయితే ఈ విషయంలో నబీ తొలి కెప్టెన్‌ జుబైర్‌ దార్‌ జోక్యం చేసుకున్నారు. మెక్‌గ్రాత్‌ వంటి దిగ్గజం దగ్గర నేర్చుకునే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని చెప్పి నబీను క్యాంప్‌కు పంపించేందుకు తండ్రిని ఒప్పించారు. అది నబీ క్రికెట్‌ జీవితాన్ని మార్చిన కీలక మలుపుల్లో ఒకటి.

స్పైక్స్‌ కూడా తెలియని స్థాయి నుంచి ‘బరాముల్లా ఎక్స్‌ప్రెస్‌’గా..
నబీ ప్రతిభను తొలిసారి గుర్తించింది కూడా జుబైర్‌ దారే. 14 ఏళ్ల వయసులో ప్రత్యర్థి జట్టు తరఫున ఆడుతున్న నబీను ఆయన చూశారు. ఓటమి ఎదురైనా బ్యాట్‌, బంతితో నబీ చూపిన తెగువ జుబైర్‌ను ఆకట్టుకుంది. నబీ ప్రతిభకు ముగ్ధుడైన జుబైర్‌.. బరాముల్లా  క్లబ్‌లో చేరాలని ఆహ్వానించారు.

అయితే అప్పట్లో నబీకు క్రికెట్‌లోని కనీస విషయాలు కూడా తెలీవు. శ్రీనగర్‌లోని షేర్‌-ఇ-కశ్మీర్‌ స్టేడియంలో తొలిసారి టర్ఫ్‌ వికెట్‌పై బౌలింగ్‌ చేసేందుకు దిగినప్పుడు అతడి కాళ్లు పాపింగ్‌ క్రీజ్‌ వద్ద జారిపోయాయి. పరుగెత్తుకుంటూ వచ్చి బంతి వేయాల్సిన బౌలర్‌.. పిచ్‌పై జారి పడిపోయాడు.

అందుకు కారణం ఏంటంటే.. అతడు సాధారణ షూస్‌ వేసుకుని బౌలింగ్‌ చేయడానికి వచ్చాడు. ఫాస్ట్‌ బౌలింగ్‌కు స్పైక్స్‌ అవసరమని కూడా అతడికి తెలీదు.

క్రికెట్‌ వ్యవస్థ గురించి అంతగా అవగాహన లేని నబీ మరోసారి తన అమాయకత్వంతో చిక్కుల్లో పడ్డాడు. జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ రెండు వర్గాలుగా విడిపోయిన సమయంలో రెండు వర్గాలు నిర్వహించిన క్యాంపులకు ఒకే రోజు వెళ్లాడు. 

ఉదయం ఒక క్యాంప్‌లో బౌలింగ్‌ చేసిన అతడు.. అక్కడి అధికారి చెప్పడంతో మధ్యాహ్నం మరో వర్గం నిర్వహించిన క్యాంప్‌కు కూడా వెళ్లి బౌలింగ్‌ చేశాడు. దీని వల్ల అతడు కొద్ది రోజుల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అతడికి అక్కడి రాజకీయాలు తెలియదు. అతడికి తెలిసింది ఒక్కటే.. బంతిని వేగంగా, సరిగ్గా వేయడం.

ఇర్ఫాన్‌ పఠాన్‌ మార్గదర్శకత్వంలో..
నబీలో ఉన్న సహజమైన ప్రతిభకు సరైన మెరుగులు దిద్దింది మాజీ భారత క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌. ఇర్ఫాన్‌ పఠాన్‌ మార్గదర్శకత్వంలో నబీ బౌలింగ్‌లో అసలు మార్పు వచ్చింది. కేవలం వేగంతో బంతులు విసిరే పేసర్‌ నుంచి.. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేయగల తెలివైన బౌలర్‌గా నబీ మారాడు. లైన్‌, లెంగ్త్‌పై పట్టు సాధించాడు.

2018 సెప్టెంబర్‌లో విజయ్‌ హజారే ట్రోఫీతో లిస్ట్‌-ఏ అరంగేట్రం చేసిన నబీ.. 2020 జనవరిలో జార్ఖండ్‌పై ఫస్ట్‌క్లాస్‌ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఒడిశాపై ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. ఆ ప్రదర్శన జమ్మూకశ్మీర్‌ను క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేర్చడంలో కీలకమైంది.

44 వికెట్ల నుంచి డబుల్‌ హ్యాట్రిక్‌ వరకు..
2024-25 రంజీ ట్రోఫీ నబీ కెరీర్‌లో కీలక మలుపు. ఆ సీజన్‌లో 44 వికెట్లతో దేశంలోనే అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా నిలిచాడు. అతడి బౌలింగ్‌ సగటు కేవలం 13.93. అయితే అసలు సంచలనం 2025 ఆగస్టులో వచ్చింది.

దులీప్‌ ట్రోఫీలో నార్త్‌ జోన్‌ తరఫున ఈస్ట్‌ జోన్‌పై ఆడుతున్నప్పుడు నబీ వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. అంటే డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించాడు. అప్పటికే ‘బరాముల్లా ఎక్స్‌ప్రెస్‌’ అనే పేరు దేశవ్యాప్తంగా మార్మోగడం మొదలైంది.

ఆ తర్వాత సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలోనూ 15 వికెట్లు తీసిన నబీ..  వైట్‌బాల్‌ క్రికెట్‌లోనూ తనకు తిరుగులేదని నిరూపించాడు.

ఐపీఎల్‌లో జాక్‌పాట్‌
దీంతో ఐపీఎల్‌ వేలంలో అతడి కోసం ఫ్రాంచైజీల మధ్య పోటీ నెలకొంది. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.8.40 కోట్లకు నబీను సొంతం చేసుకుంది. ఒకప్పుడు కొడుకు విమాన టికెట్‌ కోసం రూ.10,000 సమకూర్చేందుకు ఇబ్బంది పడిన నబీ తండ్రి, ఐపీఎల్‌ జాక్‌పాట్‌ చూసి మురిసిపోయాడు.

జమ్మూకశ్మీర్‌కు తొలి రంజీ టైటిల్‌.. నబీదే కీలక పాత్ర
2025-26 రంజీ ట్రోఫీ సీజన్‌ నబీ కెరీర్‌లోనే అత్యంత గొప్ప అధ్యాయం.జమ్మూకశ్మీర్‌ తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో అతడి పేస్‌ బౌలింగే కీలకం. ఆ సీజన్‌లో అతడు కేవలం 17 ఇన్నింగ్స్‌ల్లో 60 వికెట్లు తీశాడు. 12.65 సగటున ఏకంగా ఎనిమిది సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌గా నిలిచాడు.

ఇండియా-ఏ నుంచి టీమిండియా వరకు..
దేశవాళీ క్రికెట్‌లో వరుసగా అద్భుత ప్రదర్శనలు చేయడంతో భారత జట్టు తలుపులు తెరుచుకున్నాయి.2026 మధ్యలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టులో నబీ చోటు దక్కించుకున్నాడు. రెండు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీశాడు.

అంతేకాదు.. భారత సీనియర్‌ జట్టుకు నెట్‌ బౌలర్‌గా కూడా వ్యవహరించాడు. జాతీయ సెలెక్టర్ల ముందు తన సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం అతడికి అక్కడే లభించింది. అయితే టీమిండియా టెస్ట్‌ జట్టులో చోటు దక్కుతుందని మాత్రం అతడు ఊహించి ఉండకపోవచ్చు.

బుమ్రా గాయంతో తెరుచుకున్న తలుపు
ఆగస్టు 2026లో శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌కు ముందు జస్ప్రీత్‌ బుమ్రా మోకాలి గాయం కారణంగా దూరమయ్యాడు. హర్షిత్‌ రాణా, నితీష్‌ కుమార్‌ రెడ్డి కూడా అందుబాటులో లేకపోవడంతో భారత జట్టుకు మరో పేసర్‌ అవసరమైంది. అప్పుడు సెలెక్టర్ల దృష్టి  నబీపై పడింది.

రెండు రంజీ సీజన్లలో ఏకంగా 104 వికెట్లు. 2025-26 సీజన్‌లో 60 వికెట్లు. రెడ్‌బాల్‌లో రెండు వైపులా బంతిని స్వింగ్‌ చేయగల సామర్థ్యం. అద్భుతమైన ఫామ్‌. ఈ గణాంకాలన్నీ నబీకు అనుకూలంగా నిలిచాయి. దీంతో అతడికి భారత టెస్ట్‌ జట్టులో చోటు దక్కింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement