శుక్రవారం నుంచి ప్రాక్టీస్ మ్యాచ్
కొలంబో: శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు శుబ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు కొలంబోకు చేరుకుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. టాపార్డర్ బ్యాటర్ సాయి సుదర్శన్ మినహా మిగతా 14 మంది మంగళవారం శ్రీలంకలో అడుగు పెట్టారు. ఈ నెల 15 నుంచి గాలేలో తొలి టెస్టు, 23 నుంచి కొలంబోలో రెండో టెస్టు నిర్వహిస్తారు. వీటికి ముందు ఈ నెల 7 నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ఆడుతుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
ఈ రెండు టెస్టుల్లో భారత్ గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు మెరుగుపడతాయి. చివరిసారిగా 2017లో శ్రీలంకలో మూడు టెస్టుల సిరీస్ కోసం పర్యటించిన భారత్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే గత ఏడాది నవంబర్‌లో సొంతగడ్డపై ఆఖరి టెస్టు సిరీస్ ఆడిన టీమిండియా... దక్షిణాఫ్రికా చేతిలో 0–2తో ఓటమి పాలైంది. మరోవైపు సాయి సుదర్శన్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ మరింత స్పష్టతను ఆశిస్తోంది.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో రీహాబిలిటేషన్ తర్వాత కూడా అతను పూర్తిగా కోలుకోలేదు. దాంతో జట్టుతో కలిసి అతను శ్రీలంకకు వెళ్లలేదు. ప్రస్తుతం సుదర్శన్ గాయం పరిస్థితిని బోర్డు వైద్యులు సమీక్షిస్తుండగా... అతను త్వరలోనే పూర్తి ఫిట్‌గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే శుక్రవారం నుంచి జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే సుదర్శన్ బరిలోకి దిగుతాడు.
భారత ఫీల్డింగ్ కోచ్‌గా శుభదీప్...
శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ నుంచి భారత జట్టుకు కొత్త ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు చేపడుతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన టి.దిలీప్ స్థానంలో బీసీసీఐ శుభదీప్ ఘోష్‌ను కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. 57 ఏళ్ల శుభదీప్ గతంలో రెండేళ్ల పాటు భారత మహిళల జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశాడు. భారత ‘ఎ’, అస్సాం సీనియర్ టీమ్‌కు కూడా కోచింగ్ ఇచ్చిన అనుభవం అతనికి ఉంది.
అస్సాంకు చెందిన శుభదీప్ 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 17 లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లు ఆడాడు. భారత ఫీల్డింగ్ కోచ్‌గా 2021–2025 వరకు నాలుగేళ్ల పాటు పని చేసిన దిలీప్ ... ఆ తర్వాత కాంట్రాక్ట్ పొడిగింపుతో మరో ఏడాది పని చేశాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ తర్వాత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే కూడా తప్పుకున్నాడు. డస్కటే, దిలీప్‌ల సేవలను ప్రశంసిస్తూ మంగళవారం బీసీసీఐ సోషల్ మీడియాలో ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది.


