స్వదేశానికి కామన్వెల్త్ గేమ్స్ పతక వీరులు
తదుపరి లక్ష్యం ఆసియా క్రీడలు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించి స్వదేశానికి చేరుకున్న భారత క్రీడాకారుల బృందానికి ఘనస్వాగతం లభించింది. మంగళవారం తెల్లవారుజామున భారత పతక వీరులు న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా... అభిమానులు వారికి అపూర్వ స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో ఓవరాల్‌గా 39 పతకాలు సాధించి పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
ఇక ఆసియా క్రీడలపై దృష్టి
కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లు... త్వరలో ప్రారంభం కానున్న ఆసియా క్రీడలపై దృష్టి సారించారు. జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడలు జరగనున్నాయి. ‘అంతర్జాతీయ వేదికపై జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గడం చాలా ఆనందంగా ఉంది. ఇక ఇప్పుడు నా దృష్టి అంతా ఆసియా క్రీడలపైనే. అక్కడ కూడా ఇదే జోరు కొనసాగిస్తూ పసిడి పతకం సాధించాలనుకుంటున్నా’ అని కామన్వెల్త్ క్రీడల్లో పసిడి నెగ్గిన బాక్సర్ ప్రియా ఘంఘాస్ తెలిపింది.
కల నిజమాయే!
అపూర్వ స్వాగతం అనంతరం బాక్సర్ సాక్షి మాట్లాడుతూ... ‘ఇదంతా కలలా ఉంది. పోటీలకు ముందు ప్రతీ రోజు స్వర్ణం గెలిచినట్లే ఊహించుకునేదాన్ని. కామన్వెల్త్‌లో పసిడి నెగ్గినట్లు... త్రివర్ణ పతాకం రెపరెపలాడించినట్లు... తిరిగి స్వదేశానికి విచ్చేసినప్పుడు అపూర్వ స్వాగతం లభించినట్లు ఊహించుకున్నా. ఆ ఊహలు నిజమయ్యాయి’ అని వెల్లడించింది.
ఒలింపిక్ పతకమే లక్ష్యం: జైస్మీన్
ఇక తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకొని కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి గెలిచిన జైస్మీన్ లంబోరియా మాట్లాడుతూ... ‘పోటీల ప్రారంభానికి మూడు వారాల ముందే పూర్తి స్థాయిలో కోలుకున్నా. ఆ కొద్ది సమయంలోనే ప్రాక్టీస్ చేశా. అయినా రింగ్‌లో అడుగుపెట్టిన తర్వాత అవేవీ ఆలోచించలేదు. నా అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి పతకం అందించాలి అనుకున్నా. ఒలింపిక్ పతకం గెలవడం నా అతిపెద్ద లక్ష్యం. ఆ మార్గంలో త్వరలోనే జరగనున్న ఆసియా క్రీడల్లో సత్తా చాటాలనుకుంటున్నా’ అని వెల్లడించింది.
ఇక కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారి జూడోలో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించిన హర్‡్ష సింగ్, అస్మిత డే ఘన స్వాగతానికి ఉబ్బితబ్బిబ్బయ్యారు. కామన్వెల్త్ క్రీడల్లో మన పారా అథ్లెట్లు సైతం రికార్డు ప్రదర్శనతో సత్తా చాటారు. ఇప్పటి వరకు ఈ క్రీడల చరిత్రలో భారత్ 7 పతకాలు మాత్రమే సాధించగా... ఈ ఒక్క క్రీడల్లోనే ఏడు పతకాలతో మెరిశారు.
పతక విజేతలకు నజరానా...
కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన బాక్సర్లు, జూడోకాలు, పారా అథ్లెట్లను కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన వారికి రూ. 30 లక్షలు, రజతం గెలిచిన వారికి రూ. 20 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ. 10 లక్షల చొప్పున చెక్‌లు అందజేశారు.


