ఇంగ్లండ్‌కే పరిమితం కాదన్న బెన్ స్టోక్స్
లండన్: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ మద్యపానం అలవాటుతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో తొలి టెస్టు తర్వాత అర్ధరాత్రి పార్టీకి వెళ్లి నిబంధనలు ఉల్లంఘించడంతో రెండో టెస్టులో చోటు పోయింది. తర్వాతి టెస్టు ఆడినా అనూహ్యంగా ఆటకు గుడ్‌బై చెప్పేశాడు. అయితే క్రికెటర్లు మద్యపానం చేయడం కొత్తేమీ కాదని, ఈ అలవాటు ఇంగ్లండ్ ఆటగాళ్లకు మాత్రమే పరిమితం కాదని అతను అభిప్రాయ పడ్డాడు. ‘డ్రింకింగ్’ ఇంగ్లండ్ జట్టు పెద్ద సమస్యగా మారిందా అంటూ ఒక ఇంటర్వ్యూలో మరో మాజీ ప్లేయర్ స్టువర్ట్ బ్రాడ్ అడిగిన ప్రశ్నకు స్టోక్స్ సమాధానమిచ్చాడు.
‘క్రికెట్‌లో మద్యపాన సంస్కృతి చాలా కాలంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఇదేమీ మారలేదు. 2026కు వచ్చే సరికి ఆటలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రొఫెషనలిజం పెరిగింది. అయితే ఆల్కహాల్‌లో క్రికెట్ అనుబంధం మాత్రం మారలేదు. ఆటతో ఇది ముడిపడిపోయింది. క్లబ్ క్రికెట్‌నుంచి పెద్ద స్థాయి వరకు ఇది సాగుతుంది. దీనిని ఇంగ్లండ్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం చేయవద్దు. క్రికెట్‌లో ఆహారపు అలవాట్లు, న్యూట్రిషన్, వైద్య సహకారం, డైట్‌ను దృష్టిలో ఉంచుకుంటూ ఆటగాళ్ల సన్నద్ధతవంటివి ఎన్నో జాగ్రత్తలు ఉన్నా సరే...క్రికెటర్లు ఆల్కహాల్ తీసుకోవడం మానలేదు. అది సహజంగానే కొనసాగుతోంది’ అని స్టోక్స్ వ్యాఖ్యానించాడు.


